Blood Donation | రక్తదానం ప్రాణదానంతో సమానం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం( Blood Donation ) చేస్తే వారి ప్రాణాలు నిలబడుతాయి. చాలా మంది రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. అలాంటి వారిలో బగ్గూర్ పటేల్ ( Bagguru Patel ) కూడా ఒకరు. ప్రతి వంద రోజులకోసారి రక్తదానం చేసి.. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. 25 ఏండ్లలో 74 సార్లు రక్తదానం చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు బగ్గూర్ పటేల్.
ఎంతో మంది హృదయాల్లో స్థానం
కర్ణాటక( Karnataka )లోని గుండమ్మ క్యాంపునకు చెందిన సన్నిక్ బాషా బగ్గూర్ పటేల్( Sannik Basha Bagguru Patel ) వృత్తిరీత్యా వ్యాపారవేత్త. ప్రధానంగా వరి వ్యాపారవేత్త( Paddy Trader )గా రాణించారు. వ్యాపారవేత్తనే కాదు.. స్థానికులను మానవీయ కోణంలో చేరదీసి, ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు పటేల్.
ఏ మాత్రం సంకోచించకుండా.. గర్భిణికి రక్తదానం
అయితే తాను డిగ్రీ చదివే రోజుల్లో ఓ గర్భిణి మహిళకు అత్యవసరంగా బ్లడ్ అవసరం ఏర్పడింది. ప్రసవ వేదనతో బాధ పడుతున్న ఆమెకు బీ పాజిటివ్ బ్లడ్ తక్షణమే అవసరం. దీంతో పటేల్‌ది కూడా బీ పాజిటివ్ రక్తం కావడంతో ఏ మాత్రం సంకోచించకుండా.. గర్భిణికి రక్తదానం చేశారు. ఆమెతో పాటు బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారు.
మాజిక బాధ్యతగా.. ప్రతి 100 రోజులకోసారి రక్తదానం
ఇక అప్పట్నుంచి రక్తదానం చేయడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. నాటి నుంచి ఈ 25 ఏండ్లలో 74 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. అంటే ప్రతి 100 రోజులకోసారి పటేల్ రక్తదానం చేస్తూ ఎంతో మందికి ప్రాణం పోశారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.
కొవిడ్ సమయంలో తన సొంత ఖర్చులతో
రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, ఎమర్జెన్సీ సర్జరీలకు, గర్భిణీ స్త్రీలకు పటేల్ రక్తదానం చేస్తుంటారు. కొవిడ్ సమయంలో తన సొంత ఖర్చులతో రాయ్‌చూర్, హుబ్బళి వంటి ప్రాంతాలకు వెళ్లి అవసరమైన వారికి బ్లడ్ డోనెట్ చేసిన సంఘటనలు ఉన్నాయి పటేల్ జీవితంలో.
రోగి ప్రాణాలను నిలబెట్టడమే తన ఏకైక లక్ష్యం
ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ.. రోగి ప్రాణాలను నిలబెట్టడమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు. తనకు ప్రస్తుతం 45 ఏండ్లు అని, డిగ్రీ ప్రథమ సంవత్సరంలోనే రక్తదానం చేయడం ప్రారంభించానని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. తన రక్తంతో రోగి ప్రాణాలతో బయటపడ్డాడని తెలిసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.