Pregnant Woman | ప్ర‌స‌వం కోసం 6 కి.మీ. న‌డిచిన గ‌ర్భిణి.. తీవ్ర ర‌క్త‌స్రావంతో మృతి

Pregnant Woman | ఓ నిండు గ‌ర్భిణికి పురిటి నొప్పులు రావ‌డంతో ప్ర‌స‌వం కోసం ఆస్ప‌త్రికి బ‌య‌ల్దేరింది. రోడ్డు మార్గం లేక‌పోవ‌డంతో అంబులెన్స్ స‌మ‌యానికి రాక‌పోవ‌డంతో చేసేదేమీ లేక ఆ నిండు గ‌ర్భిణి 6 కిలోమీట‌ర్లు న‌డిచింది.

  • By: raj |    national |    Published on : Jan 03, 2026 8:57 AM IST
Pregnant Woman | ప్ర‌స‌వం కోసం 6 కి.మీ. న‌డిచిన గ‌ర్భిణి.. తీవ్ర ర‌క్త‌స్రావంతో మృతి

Pregnant Woman | ముంబై : ఓ నిండు గ‌ర్భిణికి పురిటి నొప్పులు రావ‌డంతో ప్ర‌స‌వం కోసం ఆస్ప‌త్రికి బ‌య‌ల్దేరింది. రోడ్డు మార్గం లేక‌పోవ‌డంతో అంబులెన్స్ స‌మ‌యానికి రాక‌పోవ‌డంతో చేసేదేమీ లేక ఆ నిండు గ‌ర్భిణి 6 కిలోమీట‌ర్లు న‌డిచింది. దీంతో ఆమెకు తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి క‌డుపులో ఉన్న బిడ్డ‌తో పాటు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరోలిలో వెలుగు చూసింది.

గ‌డ్చిరోలి జిల్లా ఎట‌ప‌ల్లి తాలుకాలోని ఆల్దండి టోలో గ్రామానికి చెందిన ఆశా సంతోష్ కిరంగ‌(24)కు నెల‌లు నిండాయి. దీంతో ఆమెకు నిన్న పురిటి నొప్పులు వ‌చ్చాయి. ఆల్దండి టోలో గ్రామానికి రోడ్డు మార్గం లేదు. స‌మీపంలో కూడా వైద్య స‌దుపాయాలు లేవు. చేసేదేమీ లేక గ‌ర్భిణి అడ‌వి మార్గం గుండా 6 కిలోమీట‌ర్లు న‌డ‌క సాగించింది. మొత్తానికి త‌న సోద‌రి నివాస‌ముంటున్న పెథా గ్రామానికి చేరుకుంది. అప్ప‌టికే ఆమె అల‌సిపోయింది. పురిటి నొప్పులు మ‌రింత అధిక‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ తీవ్ర ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌డంతో పాటు బీపీ అధిక‌మై క‌డుపులో ఉన్న బిడ్డ‌తో పాటు సంతోష్ కిరంగ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘ‌ట‌న‌పై జిల్లా ఆరోగ్య అధికారి డాక్ట‌ర్ ప్ర‌తాప్ షిండే స్పందించారు. డాక్ట‌ర్లు ఆమెను ప్రాణాల‌తో కాపాడేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.