Mallojula Venugopal| మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ముందు లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముందు ఆయుదాలు అప్పగించి లొంగిపోయారు.

న్యూఢిల్లీ : మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముందు ఆయుదాలు అప్పగించి లొంగిపోయారు. గడ్చిరోలి పోలీసులు మల్లోజులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మల్లోజులపై వందకు పైగా కేసులు, 6కోట్ల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందించారు. మల్లోజుల వేణుగోపాల్ తన ఆయుధాన్ని సీఎం ఫడ్నవిస్ కు అందించి లొంగిపోయారు. మొత్తం 54 ఆయుధాలను మావోయిస్టులు గడ్చిరౌలి పోలీసులకు అప్పగించారు. ఆ ఆయుధాల్లో ఏడు ఏకే-47, తొమ్మిది ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. మల్లోజుల భార్య తారక్క సైతం గత జనవరిలో గడ్చిరోలిలో సీఎం ఫడ్నవిస్ ముందు లొంగిపోవడం గమనార్హం. ఆమె కూడా వేణుగోపాల్ బృందం లొంగుబాటుకు హాజరవ్వగా సీఎం ఫడ్నవిస్ ఆమెను వేదికపైకి పిలువడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మల్లోజుల వేణుగోపాల్ రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. దేశంలో మావోయిజానికి చోటు లేదని అన్నారు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మిస్తామన్నారు.
కొన్ని నెలలుగా మల్లోజుల లొంగుబాటు ప్రయత్నాలు
ఇక కొన్ని నెలలుగా మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం శాంతి చర్చల ప్రసక్తే లేదనడం.. ఆపరేషన్ కగార్ ను ఎదురించలేని పరిస్థితి..సాయుధ విప్లవోద్యమానికి అనుకూల పరిస్థితులు లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో మల్లోజుల లొంగిపోయారు. అయితే చివరి నిమిషంలో మల్లోజుల వేణుగోపాల్ కుడి భుజం ప్రభాకర్ తో పాటు మరో నలుగురు మహిళ కమాండర్లు లొంగుబాటు ఆలోచన విరమించుకోవడం ఆసక్తికరం. శాంతిచర్చలు..విప్లవోద్యమ కొనసాగింపుపై మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తాను కూడా కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. మల్లోజుల ఆగస్టులో ’విడుదల చేసిన 22 పేజీల లేఖ సెప్టెంబరు 17న వెలుగుచూడటం పార్టీలో కలకలం రేపింది. అది పార్టీలో తీవ్రచర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది.అంతేగాక వేణుగోపాల్ ను విప్లవ ద్రోహిగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ మరో లేఖలో సాయుధ విప్లవోద్యమంపై మరోసారి తన వైఖరిని సమర్థించుకున్నారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడి ప్రభుత్వానికి లొంగిపోయారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి. మల్లోజుల వేణుగోపాల్ ను పార్టీలో అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. 69ఏళ్ల మల్లోజుల వేణుగోపాల్ తో పాటు పీఎల్ జీఏ కు చెందిన 60మంది సాయుధ సభ్యులు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. మావోయిస్టుల్లో భూపతి అలియాస్ సోనూను అత్యంత ప్రభావిత రాజకీయ వ్యూహాకర్తగా భావిస్తారు. మహారాష్ట్ర-చత్తీస్‌ఘడ్ బోర్డర్‌లో అనేక దళాలను ఆయన నడిపించారు.
మావోయిజంలో మల్లోజులది 44 ఏళ్ల ప్రస్థానం
మల్లోజుల వేణుగోపాల్ సొంత రాష్ట్రం తెలంగాణ. పెద్దపల్లికి చెందిన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తండ్రి వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారు. మరో కొడుకు ఆంజనేయులు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. వెంకటయ్య 1997లో మరణించగా.. తల్లి మధురమ్మ 2022లో కన్నుమూశారు. వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీలు ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీ ఉద్యమంలో 44ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి అగ్రనేతలుగా ఎదిగారు. కోటేశ్వర్రావు, వేణుగోపాల్ జగిత్యాల జైత్రయాత్ర అనంతరం 1971లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏటూరి నాగారం సాయుధ దళంలో పనిచేస్తున్న క్రమంలో వేణుగోపాల్ 1982లో అరెస్టయ్యారు. 1983లో విడుదలయ్యాక దండకారణ్యానికి వెళ్లారు. సోదరుడు కిషన్ జీ 2011లో జరిగిన బెంగాల్ ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఆయన భార్య పోతుల సుజాత(కేంద్ర కమిటీ సభ్యురాలు) తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వేణుగోపాల్ 1993లో పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకే ఎస్ జెడ్ సీ) సెక్రటరీగా ఎదిగారు. 1995 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2010, జులైలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత ఆయన స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతలో వేణుగోపాల్ దే మాస్టర్ మైండ్ అని పోలీసుల రికార్డులు చెప్తున్నాయి. ఆ తర్వాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో ఈయన వ్యూహలు రచించారు. ఈ క్రమంలోనే ఆయన గడ్చిరోలి జిల్లాలో పనిచేసే సమయంలో తారక్కను దళంలోనే పెండ్లి చేసుకున్నాడు. 2018లో ఆమె మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు.
42 మంది సభ్యుల సెంట్రల్ కమిటీలో ఇప్పుడు 13మందినే?
2004లో పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసీసీ కలిసి సీపీఐ(మావోయిస్ట్)గా ఏర్పడినప్పుడు సంస్థ కేంద్ర కమిటీలో 42 మంది సభ్యులుండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 13లోపే ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ ఏడాదిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ ఎన్ కౌంటర్లలో మరణించారు. కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత ఇటీవల తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఇప్పుడు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కూడా ఆయుధాలు వదిలి లొంగిపోయారు. దీంతో సెంట్రల్ కమిటీలో ఇప్పుడు 13మంది లోపునే సభ్యులు ఉన్నారని సమాచారం. దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతాబలగాలు దాడులు చేస్తున్నాయి. ఈ దాడులతో మావోయిస్టు పార్టీ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ సంవత్సరంలోనే కేంద్ర కమిటీ సభ్యులు ఆరుగురు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు.గత నెలలో మరో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.