• Telugu News
  • /National

Musical Road | ఆ రోడ్డుపై వాహ‌నం వెళ్తే సంగీతం వినిపిస్తుంది.. దేశంలోనే తొలి మ్యూజిక‌ల్ రోడ్డు.. ఎక్క‌డుందో తెలుసా..?

దేశంలో తొలిసారి మ్యూజిక‌ల్ రోడ్డు (Indias first musical road) అందుబాటులోకి వ‌చ్చింది. ఆ రోడ్డుపై వాహ‌నాలు వెళ్తే సంగీతం వినిపిస్తుంది. ముంబై కోస్టల్ రోడ్డు (Mumbai Coastal Road)లోని నారిమన్ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే క్యారేజ్‌వేపై 700 మీటర్ల మేర పలు సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 11, 2026, 6:59 pm IST
Read Time: 6 mins
Musical Road | ఆ రోడ్డుపై వాహ‌నం వెళ్తే సంగీతం వినిపిస్తుంది.. దేశంలోనే తొలి మ్యూజిక‌ల్ రోడ్డు.. ఎక్క‌డుందో తెలుసా..?

Musical Road | సాధార‌ణంగా రోడ్డెక్కితే మ‌న‌కు ఏం సౌండ్స్‌ వినిపిస్తాయి.. వాహ‌నాల‌ హారెన్ శ‌బ్దాలే క‌ద‌. కానీ దేశంలో తొలిసారి మ్యూజిక‌ల్ రోడ్డు (Indias first musical road) అందుబాటులోకి వ‌చ్చింది. ఆ రోడ్డుపై వాహ‌నాలు వెళ్తే సంగీతం వినిపిస్తుంది (musical road). అది ఎక్కడ ఉంద‌నుకుంటున్నారు..? మ‌న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై (Mumbai)లోనే.

జయహో.. సాంగ్‌

ముంబై కోస్టల్ రోడ్డు (Mumbai Coastal Road)లోని నారిమన్ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే క్యారేజ్‌వేపై 700 మీటర్ల మేర పలు సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జయహో’ పాట వినిపించనుంది. ఈ పాటను దేశానికి అంకితం చేయడానికి, ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి ఈ విధంగా డిజైన్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

హంగేరియ‌న్ సాంకేతిక‌త‌తో..

70-80 kmph వేగంతో వాహ‌నాలు వెళ్లేట‌ప్పుడు ఈ మ్యూజిక్ వ‌స్తుంది. ఈ మ్యూజిక‌ల్ రోడ్డును హంగేరియన్ సాంకేతికతతో నిర్మించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.6.21 కోట్ల వ్యయం అయినట్లు అధికారులు తెలిపారు. ముంబై కోస్టల్ రోడ్డు కారిడార్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఈ వినూత్న రహదారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM) దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. దీంతో భారత్‌లోనే తొలి మ్యూజికల్ రోడ్డుగా ముంబై కోస్టల్ రోడ్ అరుదైన గుర్తింపు సాధించింది.

విదేశాల్లో ఇప్ప‌టికే..

ఇలాంటి మ్యూజికల్ రహదారులు ఇప్పటివరకు హంగేరీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో మాత్రమే ఉన్నాయి. హంగేరీ (Hungary)లోని మ్యూజికల్ రోడ్డు (musical road)కు సంబంధించిన వీడియోని ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా గ‌తంలో ఎక్స్ వేదిక‌గా షేర్ చేశారు కూడా. అక్కడ సంగీత వాయిద్యాలను రోడ్డుపై చారలుగా గీశారు. వాహనం ఆ వాయిద్యాల చారలపై వెళ్లగానే మ్యూజిక్ వ‌స్తుంది. అప్ప‌ట్లో ఈ వీడియో నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇలాంటివి మ‌న భార‌త్‌లోనూ అందుబాటులోకి తెస్తే బాగుంటుంద‌ని అప్ప‌ట్లో నెటిజ‌న్లు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు మ్యూజిక‌ల్ రోడ్డు అందుబాటులోకి రావ‌డంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఏమిటీ కోస్టల్‌ రోడ్డు ప్రాజెక్ట్‌..?

ముంబైలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణా సౌలభ్యాన్ని పెంచడం, ట్రాఫిక్ రద్దీ సమస్యను తగ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ రూ.14,000 కోట్ల వ్య‌యంతో కోస్ట‌ల్ రోడ్ ప్రాజెక్టును చేప‌ట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ద‌క్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్ నుంచి ఉత్త‌ర శివారు ప్రాంతమైన ద‌హిస‌ర్ వ‌ర‌కూ మొత్తం 29.2 కిలోఈమ‌ట‌ర్ల పొడ‌వున ర‌హ‌దారి నిర్మాణం చేప‌ట్టారు. ఈ రోడ్డులోని కొంత భాగంలో మాత్రం హంగేరియన్ సాంకేతికతతో మ్యూజిక్ వ‌చ్చేలా ప్రత్యేకంగా మ్యూజికల్ స్ట్రిప్‌లను అమర్చారు. ఇప్పుడు ఈ రోడ్డు వాహ‌న‌దారుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి :

Bharat Bandh February 12| రేపు భారత్ బంద్..కాంగ్రెస్ మద్దతు !
GHMC Reorganisation | జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ: మూడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కిళ్ల పంపకం – ఇదే జాబితా..