Bharat Bandh February 12 | 12-2-2026న భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది,,,
రేపు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహణకు కార్మిక, రైతు సంఘాలు సన్నద్దమయ్యాయి. వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. అయితే భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో బంద్ కు మద్దతు పెరిగింది.
విధాత, హైదరాబాద్: ఫిబ్రవరి 12న గురువారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహణకు కార్మిక, రైతు సంఘాలు సన్నద్దమయ్యాయి. వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. అయితే భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో బంద్ కు మద్దతు పెరిగింది. గురువారం జరిగే భారత్ బంద్ లో రైతులు, కార్మికులు, బ్యాంకింగ్, ప్రజా రవాణా, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొననున్నారు. 30 కోట్ల మంది బంద్ లో భాగస్వామ్యం కానుండడంతో బ్యాంకింగ్ సేవలు, ప్రజా రవాణా స్థంభించిపోనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాడల్లో కార్యకలాలపాలు నిలిచిపోనున్నాయి. 24 గంటల భారత్ బంద్ బుధవారం అర్థరాత్రి అనగా 12వ తేదీ నుంచి మొదలుకానున్నది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఇటీవల తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీనికి తోడు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా, అలాగే మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ 10 ప్రధాన కార్మిక సంఘాలు.. రైతు సంఘాలు ఉమ్మడిగా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ బిల్లు వంటి అంశాలపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. రైతు సంఘాలతో పాటు 10 కేంద్ర కార్మిక సంఘాలు – INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF , UTUC భారత్ బంద్‌లో భాగస్వామ్యం కానున్నాయి. మావోయిస్టు పార్టీ కూడా భారత్ బంద్ కు మద్దతునిచ్చింది.
వీటికి బంద్ ఎఫెక్ట్
భారత్ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, రవాణా సేవలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ లు బంద్ పాటించే అవకాశం ఉంది. పలు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా బంద్ కు మద్దతు ప్రకటించినప్పటికి..బ్యాంకులు అధికారికంగా తెరిచే ఉంటాయి. అయితే బంద్ ప్రభావంతో బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు , అధికారులు సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) , బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) వంటి ప్రధాన ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె జరుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మంగళవారం తెలిపింది. ఐడీబీఐ బ్యాంకు కూడా బ్యాంకు యూనియన్స్ నుండి సమ్మె నోటీసులు అందుకుంది. అదేవిధంగా.రవాణా వ్యవస్థపై ఈ బంద్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహన డ్రైవర్ల సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనవచ్చని సమాచారం. భారత్ బంద్ కారణంగా దేశ వ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం ఏర్పడనున్నది. ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల కార్యకలాపాలు స్థంభించిపోనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు బోసిపోనున్నాయి. బస్సులు, టాక్సీలు, ప్రజా రవాణా సర్వీసులకు ఆటంకం కలుగనున్నది. పారిశ్రామిక వాడలలో కంపెనీలలో పనులు స్థంభించనున్నాయి. విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది కూడా మత సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. వీరితో పాటు దుకాణాలలో కూడా పనిచేసే ఉద్యోగులు, కార్మికులు కూడా హాజరయ్యే సూచనలు కన్పించడం లేదు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మిక, కర్షక, ఉద్యోగులు రోడ్డెక్కుతున్నందున కేరళ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలలో ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. అత్యవసర సేవల కింద హాస్పిటళ్లు, మెడికల్ సర్వీసులు, అంబులెన్స్ సేవలు, మెడికల్ షాపులు, ఫైర్ సర్వీసు, పాల సరఫరా, న్యూస్ పేపర్ పంపిణీ, ఏయిర్ పోర్టులు, విమాన రాకపోకలు, బ్యాంకు ఏటీఎం లు యధావిధిగా పనిచేయనున్నాయి. బంద్ లో 30 కోట్ల మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నందున ప్రయాణాలు చేయాలని అనుకునే వారు స్థానికంగా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నగదు కావాల్సిన వారు ఏటీఎంలను వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలని అనుకునే వారు ఒకరోజు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి.
విద్యాసంస్థల బంద్ పై అయోమయం
భారత్ బంద్ లో భాగంగా విద్యాసంస్థల మూసివేతపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే బంద్ కు మద్దతునిస్తున్న రాజకీయ పార్టీలు, సంఘాలకు చెందిన విద్యార్థి సంఘాలు విద్యాసంస్ధల తరగతుల బహిష్కరణకు పూనుకునే అవకాశం ఉంది. పరీక్షల కాలం కావడంతో పాఠశాలలు, కాలేజీల మూసివేతపై అయోమయం కొనసాగుతుంది. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ముందస్తు జాగ్రత్తగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram