తెలంగాణలో వాన కాలం పంట సీజన్ ప్రారంభంతో పాటు గ్రామాల్లో యూరియా కొరత సమస్యలు కూడా మొదలయ్యాయి. యూరియాకు తోడు డీఏపీ కొరత కూడా వాన కాలం పంట సీజన్ లో రైతులను వెంటాడుతుంది. సీజన్ ప్రారంభమై ఎరువులు కొనేందుకు రైతులు దుకాణాల వద్ద మళ్లీ క్యూ కడుతుంటే ‘అన్నిచోట్లా ‘నో స్టాక్’ బోర్డులే కనిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామంలో రైతులు భారీ సంఖ్యలో యూరియా కోసం వచ్చి…యూరియా దొరకక సొసైటీ ముందు నిరసనకు దిగారు. గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడితే తమకు సరిపడా యూరియా దొరకలేదంటూ రైతుల ఆందోళన నిర్వహించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట మాధపూర్, గేర్జం, ముక్రా(బీ) రైతులు నిరసన తెలిపారు.
యాప్ విధానం రద్దుకు రైతుల డిమాండ్
యాప్ విధానం రద్దు చేసి మ్యానువల్ పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యూరియా కోసం రైతులు గుమిగూడకుండా, కొరత ఉన్న విషయం బహిర్గతం కాకుండా యాప్‌ను తీసుకొచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరో యాప్ తీసుకొస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫెర్టిలైజర్ సేల్స్ అప్లికేషన్ సిస్టం (ఎఫ్‌ఎస్‌ఏఎస్) యాప్‌ను అమల్లోకి తీసుకొస్తుందని, తొలిదశలో రాష్ట్రంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ కేవలం యూరియాకే పరిమితం కాగా, కేంద్రం తీసుకొచ్చిన యాప్ అన్ని ఎరువులకు ఉద్దేశించిందని, దీంతో రైతులకు మరిన్ని కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ యూరియా, డీఏపీలకు కొరతనే..
గత ఏడాది రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ధాన్యం, మక్కలు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఇబ్బందులు సరిపోవు అన్నట్లు రైతన్నలకు మళ్లీ వానకాలం పంటలకు ఎరువుల సమస్య వచ్చి పడింది. కేంద్రం నుంచి సరఫరా తగ్గడంతో పాటు తగినంత నిల్వలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ సేవలను తరుచూ నిలిపివేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.40 లక్షల టన్నుల యూరియాతో పాటు 10 వేల టన్నుల డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్ కోసం 11.50 లక్షల టన్నుల యూరియా కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంతర్జాతీయంగా దిగుమతులు లేకపోవడం, దేశంలో ఉత్పత్తి తగ్గడం, ఇతర పరిణామాల వల్ల కేంద్రం 10 లక్షల టన్నులకే అనుమతించింది.
తెలంగాణలో ఎరువుల నిల్వల కొరత
గత మే, జూన్ నెలల్లో కలిపి రైతులు 1.8 లక్షల టన్నుల యూరియా కొనుగోలు చేశారు. జూలైలో 3.43 లక్షల టన్నుల యూరియా కొనుగోలు చేశారు. ఈ మూడు నెలల్లో కలిపి 5.23 లక్షల టన్నులు అవసరం. ఈ లెక్కన వాన కాలం సీజన్‌కు ముందు ఒక్క మార్క్‌ఫెడ్ వద్దనే నాలుగు లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 2.2 లక్షల టన్నులు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక డీఏపీ కొరత కూడా రైతులను కలవర పెడుతుంది. గత జూన్‌లో 71వేల టన్నులు, జూలైలో 82వేల టన్నుల డీఏపీని రైతులు కొనుగోలు చేశారు. కానీ, ప్రస్తుతం ఆ మేరకు నిల్వలు లేకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నది.
పశ్చిమాసియా సంక్షోభంతో ఎరువులకు మరింత కొరత
పశ్చిమాసియా యుద్ద సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఎరువుల పరిశ్రమలు ఇంధన కొరత ఎదుర్కోవడం, విదేశాల నుంచి దిగుమతులు భారం కావడంతో ఈ దఫా ఎరువుల కొరత తీవ్రంగా ఉండబోతుందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి మూసివేయడంతో గల్ఫ్ దేశాల నుంచి యూరియా దిగుమతులు ఆగిపోయాయి. దేశీయంగా ఉత్పత్తి చేసుకుందాం అంటే దానికి తయారీకి అవసరమైన ముడి సరుకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ దిగుమతులు కూడా నిలిచిపోయాయి. ఇలా రెండు విధాలుగా సమస్య వచ్చిపడింది. అధికారిక గణాంకాల ప్రకారం భారత్‌లో యూరియా సహా అన్ని రకాల ఎరువుల ఉత్పత్తి 2025లో 524.64 లక్షల మెట్రిక్ టన్నులు. తద్వారా కాస్త అటు ఇటుగా 70% మేర దేశీయ అవసరాలు తీరుతున్నాయి. కానీ తయారీ కోసం వాడే ముడిసరుకే అందుబాటులో లేకపోవడంతో కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి.
వినియోగం తగ్గించడమే మార్గం..
ప్రపంచంలోనే ఎరువుల వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఉత్పత్తి విషయంలో మూడో స్థానంలో ఉంది. ఇదే సమయంలో దిగుమతుల్లో ఆధారపడడమూ తగ్గడం లేదు. దీంతో దేశ ప్రధాని మోదీ స్వయంగా ప్రజలకు, రైతులకు బంగారం, వంటనూనెలు, రసాయనిక ఎరువు వినియోగాన్ని తగ్గించాలని పిలుపినివ్వడం ఈ సందర్బంగా గమనార్హం. రైతులు సేంద్రీయ ఎరువల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ పరిణామాల నేపధ్యంలో రైతులకు మరోసారి ఎరువుల కొరత తప్పదన్న సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ఇప్పటికే ఎరువుల కంపెనీలు ధరలు పెంచేయ్యగా..రైతుల వద్దకు వచ్చసరికి ఒక్కో బస్తాపై 400నుంచి 100వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.