విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం అభివృద్ది కోసం..పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకే మూడు కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మియాపూర్‌లో రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.530 కోట్లతో మియాపూర్ ఫ్లైఓవర్ ఇంటర్‌సెక్షన్, బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో పాటు సరికొత్త సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.
ఐటీ కారిడార్‌కు మహర్దశ
కొత్తగా చేపట్టిన అభివృద్ది పనులతో ఐటీ కారిడార్ మహర్దశ కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు, ఢిల్లీ కాలుష్యం, కోలుకత్తా, ముంబాయి, చైన్నై వంటి నగరాలు ఎదుర్కొంటున్న వరదలు, శాంతి భద్రతలు వంటి సమస్యలు హైదరాబాద్ వాసులకు రాకుండా ముందు జాగ్రత్తగా ఫ్లై ఓవర్లు, ఎలివేట్ కారిడార్లు, మెట్రో విస్తరణ, కాలుష్య కారక పరిశ్రమల తరలింపు, మూడు కార్పోరేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామన్నారు. మెట్రో విస్తరణ రాయదుర్గం నుంచి లియో పోలీస్ వరకు చేపడతాం అని, ఈ ప్రాంతంలో 200 కోట్లకు పైగా ఎకరం ధర పలుకుతుందంటే.. ఇక్కడ మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలోచేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వనగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతామని, అమెరికా సిలికాన్ సిటీతో సెబరాబాద్ పోటీ పడుతుందన్నారు. గాజుల రామారంలో 100ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ నిర్మిస్తాం అన్నారు.
మరోసారి కిషన్ రెడ్డిపై విమర్శలు
మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు, మహారాష్ట్ర సీఎంతో తమ్మిడి హట్టి చర్చలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, నేను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ది ప్రాజెక్టులకు ఆమోదం కోసం ఒప్పిస్తే…తర్వాత కిషన్ రెడ్డి వెళ్లి అనుమతులు, నిధులు ఇవ్వవద్దని చెబుతున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పొంకనాల పోషిగానికి మూడెడ్లు..ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయన్నట్లుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడని, కిషన్ రెడ్డి ఎంతపాటి లడాయి కోతినో అందరికి తెలుసన్నారు.
తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారని, హైదరాబాద్ నగరం, చుట్టు కూడా నలుగురు బీజేపీ ఎంపీలే ఉన్నారని, మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు అనుమతులు మాత్రం తీసుకురావడం లేదని, వారికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ గులామ్ లుగా తెలంగాణ బీజేపీ ఎంపీలు పనిచేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు కేసీఆర్, 12 ఏళ్లు మోదీ, రెండేళ్లలో నేను హైదరాబాద్ కు ఏం చేశారో అసెంబ్లీలో చర్చిద్దాం అని సవాల్ చేశారు. పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ ప్రజాతిరస్కారంతో ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడన్నారు. సబర్మది అద్బుతమని చెప్పిన బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనకు ఎందుకు సహకరించడం లేదన్నారు.