తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రం నుంచి అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు (బియ్యం రూపంలో) పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులు (LMT)గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం సేకరణ మొత్తం పెంచినందుకు ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసి లేఖలు అందించడం ద్వారా ఒత్తిడి పెంచారు. రబీ సీజన్ లో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావడంతో రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ మొత్తం పెంచాలని వారు కేంద్రాన్ని కోరారు. ఎట్టకేలకు కేంద్రం తెలంగాణ నుంచి అదనంగా మరో 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అంగీకారం తెలుపడంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. అదనపు కొనుగోళ్లతో రైతులకు ఆర్థిక భరోసా పెరగడంతో పాటు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత సాఫీగా సాగేందుకు అవకాశం ఏర్పడింది.కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలోని గిడ్డంగుల నుంచి కొంత ధాన్యం ఖాళీకి అవకాశం చిక్కినట్లయ్యింది.