నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాచేయాలన్న డిమాండ్ తో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ధర్మేంద్ర బర్తరఫ్ కు డిమాండ్ చేస్తూ…రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లోక్ భవన్ వైపు వెలుతున్న కాంగ్రెస్ నాయకులను, మంత్రులను, ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోగా ఈ సందర్బంగా తోపులాట సాగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ వైపు వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
విజయవాడలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
ఏపీలోని విజయవాడలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. మ్యూజీయం రోడ్ లో కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేసిన రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఓ వైపు, ప్రధానమంత్రి ఇంటి ముందు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బీజేపీ పిలుపునివ్వడంతో రెండు పార్టీలు ర్యాలీలకు దిగాయి. మ్యూజీయం రోడ్డులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేశారు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు ఈ సందర్బంగా కాంగ్రెస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన బీజేపీ నాయకులను కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పరస్పరం జెండా కర్రలతో కొట్టుకున్నారు. కాంగ్రెస్ ఆఫీస్ పై బీజేపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లు రువ్వారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి.
ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు
నీట్ పేపర్ల లీకేజీకి,విద్యా వ్యవస్థలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యవంలో చేపట్టిన నిరసనలు బుధవారం కూడా ఉదృతంగా కొనసాగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆపేది లేదంటూ విద్యార్థులు స్పష్టం చేశారు.
కేంద్రం నిర్లక్ష్యం ఇదే రీతిలో కొనసాగితే దేశవ్యాప్తంగా యువత హస్తినను ముట్టడిస్తుందని హెచ్చరించారు. నిరసనకారులకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుండటంతో ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి.