గిగ్ వర్కర్ల సమ్మె..ట్రాఫిక్ జామ్

డిమాండ్ల పరిష్కారం కోరుతూ హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లు సమ్మెకు దిగడంతో ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సంఘాలు డిమాండ్ చేశాయి.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Jul 22, 2026, 4:01 pm IST
Read Time: 4 mins
గిగ్ వర్కర్ల సమ్మె..ట్రాఫిక్ జామ్

తమ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ గిగ్ వర్కర్లు మరోసారి సమ్మెకు దిగడంతో బుధవారం నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. తమ సమస్యలు తీర్చాలంటూ గిగ్ వర్కర్లు మధ్యాహ్నం వరకు బ్రేక్ డౌన్ చేపట్టారు. వారి సమ్మె ప్రభావంతో ఎల్బీనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లు ఎల్బీనగర్ వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో రింగ్ రోడ్డు, సాగర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు భారీగా మోహరించి ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించారు.

ఇప్పటికే తాము నాలుగుసార్లు సమ్మె చేసిన తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని గిగ్ వర్కర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని గిగ్ వర్కర్ల సంఘాలు హెచ్చరించాయి.

గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : కవిత

గిగ్ వర్కర్లు, డ్రైవర్ల ను అగ్రిగేటర్ సంస్థలు మోసం చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడి వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ఆయా కంపెనీలతో మాట్లాడి ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు న్యాయమైన రేట్లు ఖరారు చేయాలని పేర్కొన్నారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారికి ఒక్క పైసా మిగలటం లేదు అని, కుటుంబ పోషణ వారికి భారంగా మారిందని అన్నారు.మూడేళ్లుగా రేట్లు పెంచాలని వాళ్లు అడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడాలని కోరారు.