హైలైట్స్:

  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆగ్రహంలో అర్థమిదేనా?
  • రాష్ట్ర ప్రయోజనాల పట్ల కేంద్ర సర్కార్ నిర్లక్ష్యమా?
  • రేవంత్ వ్యూహాత్మక అడుగులా? గత్యంతరం లేకనా?

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే … మాతో కలిసి రండంటూ ప్రధాని నరేంద్ర మోదీయే సీఎం రేవంత్ రెడ్డిని బహిరంగంగా ఆహ్వానిస్తుండగా … దీనికి భిన్నంగా తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పైన పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా? మల్కాజిగిరి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల15 తర్వాత కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటనలోని ‘కార్యాచరణ’ అర్ధమిదేనా? అంటూ రకరకాల చర్చోపచర్చలు, ఊహాగానాలు సాగుతున్నాయి. రేవంత్ మాటలు, కిషన్ రెడ్డి కౌంటర్ తో రాష్ట్ర రాజకీయాలు కేంద్రం వర్సెస్ రాష్ట్రం అనే విధంగా వేడెక్కాయి.

రేవంత్ హెచ్చరికలో మర్మమేంటి?

కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ది ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల15 తర్వాత కచ్చితంగా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. మెట్రో రావాల్సిందే.. ఆర్ఆర్ఆర్ కు అనుమతులివ్వాల్సిందే.. మూసీ ప్రక్షాళన జరుగాల్సిందే.. పండించిన పంటలు, వడ్లూ, జొన్నలు, మక్కలు నువు కొనాల్సిందే…ఈ అన్నింటికి నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తామంటూ కిషన్ రెడ్డిని సీఎం హెచ్చరించారు. కేసీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి వింటారని బీజేపీ వాళ్లే చెబుతుంటారని విమర్శించారు. చీకట్లో గూడుపుఠాణి చేయకుండా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని తాము కోరుతున్నామన్నారు. మెట్రో పొడిగింపునకు అన్ని అనుమతులు వచ్చాక.. ఇక్కడి కేంద్రమంత్రి కాళ్ళల్లో కట్టెలు, పుల్లలు పెట్టి అర్ధాంతరంగా ఆపేశారని బహిరంగానే విమర్శించారు. నిన్ను పొలిమేరకు దాటనివ్వనంటూ హెచ్చరించారు.

కేంద్రం పై ఒత్తిడికి ప్రయత్నమా?

కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణలో గత రెండున్నరేళ్ళ క్రితం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందీ. ఈ రెండు పక్షాలు రాజకీయంగా బద్ద వ్యతిరేక శిబిరాలుగా ఉన్నప్పటికీ, గత రెండున్నరేళ్ళుగా సీఎం రేవంత్ ఆధ్వర్యంలో వివిధ పద్ధతుల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి అందించాల్సిన సహాకారం, పథకాలకు చేయూత తదితర అనేక అంశాల పై ‘ఫెడరల్’ స్పూర్తితో వ్యవహరిస్తున్నారు. మోదీని బడే బాయ్ అంటూ సంభోధించి విపక్ష బీఆర్ఎస్ నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటి వరకు ‘వినతులు’ విశదీకరణల రూపంలో ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్రాభివృద్ధికి కీలకంగా భావించే ‘పథకాల’కు కేంద్రం నుంచి మొండి చేయి ఎదురవుతోంది. కేంద్రం నుంచి సహకారం లేకపోగా, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు అడ్డుకుంటున్నారని సీఎం విమర్శిస్తున్నారు. ఇందులో బండి సంజయ్ కంటే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై రాష్ట్రానికి చెందిన ఏ పథకానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కాలు అడ్డుపెడుతున్నారని గత కొన్ని నెలలుగా సీఎం బహిరంగానే విమర్శిస్తున్నారు. ఇంత కాలం టార్గెట్ కిషన్ రెడ్డి అనే తీరులో విమర్శలకు పరిమితమైన సీఎం బహిరంగసభలో హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుగా భావిస్తున్నారు.

రేవంత్ ‘కార్యాచరణ’ ఏంటి?

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం, అనుమతులు, ఆమోదాలు రానందున సీఎం రేవంత్ కేంద్రం పైన పోరాటం చేస్తారా? లేక కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ, అడ్డుకుంటున్నారని చెబుతున్నందున కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇక్కడే ఆందోళన చేపడుతారా? ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిరసనలు తెలియజేస్తారా? లేక హైదరాబాద్ కే పరిమితమవుతారా? కేంద్రం పైన, మంత్రి కిషన్ రెడ్డి పైన ఒత్తిడి పెంచేందుకూ, పెండింగులో ఉన్న అంశాల్లో సానుకూల నిర్ణయం తీసుకునేందుకు సీఎం హోదాలో ‘హెచ్చరిక’గా ముందస్తుగా అలా మాట్లాడారా? లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తారా? కాంగ్రెస్ పార్టీని ఇందులో భాగస్వామ్యం చేస్తారా? అనే రకరాల చర్చ సాగుతోంది.

రేవంత్ వ్యూహాత్మక అడుగులు

సీఎం వ్యూహాత్మకంగానే కిషన్ రెడ్డికి హెచ్చరిక ప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండున్నరేళ్ళు వేచిచూసినప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేక పోవడంతో అనేక స్కీంలు అడుగు ముందుకు సాగడంలేదు. ఈ పథకాల పైన సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆశలు పెట్టుకున్నది. ఇంకా ఆలశ్యం జరిగితే కనీసం ఈ కార్యక్రమాలను కొనసాగించే పరిస్థితి లేకపోవచ్చూ..ఈ నేపథ్యంలో తాజా అడుగేస్తున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను టార్గెట్ చేయడం వల్ల వీరు కేంద్రం పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటోందని భావిస్తున్నారా? . కేంద్రం పైన ఒత్తిడి తేకుండా ఈ మంత్రులు మౌనం వహిస్తే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నవారుగా జనంలో చర్చకు తావిస్తోందని ఆశిస్తున్నారా? రానున్న రోజుల్లో తెలంగాణలో అధికార ఆశలు పెట్టుకున్న బీజేపీని ఇరుకున పెట్టి ప్రజల్లో ఎండగట్టేందుకు ఉపయోగపడుతోందనే ముందు చూపుతో రేవంత్ పావులు కదుపుతున్నట్లు చర్చసాగుతోంది. కేంద్రం సహకరిస్తున్నా… బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లతో కిషన్ రెడ్డి కుమ్మక్కై అడ్డుకుంటున్నారనే విమర్శతో ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇరుకున పెడుతోందనే ఎత్తుగడ ఉందంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను చూపెట్టేందుకు అవకాశం లభిస్తోంది.ఇదిలా ఉండగా తమ ఒత్తిడితో కేంద్రం స్పందించి, అనుమతులు, నిధులు విడుదల చేస్తే పథకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి పేరోస్తోందనీ, ఏ రకంగా చూసినా… కాంగ్రెస్ కూ… రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. మరో వైపు రేవంత్ కు మరో గత్యంతరం లేకనే ఈ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నట్లు భావిస్తున్నవారున్నారు.

సీఎం ప్రకటనకు కిషన్ రెడ్డి సీరియస్ కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను పొలిమేరల్లో ఆపేవారు తెలంగాణ గడ్డపై ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. నేను దేనికైనా సిద్దం అని, ప్రజా ఉద్యమాలతో ఈ స్థాయికి వచ్చానని, రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదన్నారు. తెలంగాణకు ఎవరేం చేశారన్నదానిపై.. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెడదామో చెప్పాలని సవాల్ విసిరారు.