Messi Tour | హైదరాబాద్ పర్యటనకు ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్‌ మెస్సీ

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. తెలంగాణ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా, ‘Telangana Rising’ కార్యక్రమానికి మెస్సీని గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసడర్‌గా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.

Reported by: chinna | తెలంగాణ‌ | Nov 28, 2025, 8:13 pm IST
Read Time: 4 mins
Messi Tour | హైదరాబాద్ పర్యటనకు ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్‌ మెస్సీ

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. తెలంగాణ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా, ‘Telangana Rising’ కార్యక్రమానికి మెస్సీని గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసడర్‌గా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మెస్సీ కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా భారతీయులకు దన్యవాదాలు తెలియజేశాడు. ‘‘ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు నేను ముగ్ధుడినైపోయాను. GOAT టూర్‌ త్వరలోనే ఆరంభం కానుంది. మొదట కోల్‌కతా, ముంబై, ఢిల్లీ మాత్రమే ప్లాన్‌ చేసినా… ఇప్పుడు హైదరాబాద్‌ కూడా జాబితాలో చేరింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నా’’ అని సోషల్ మీడియాలో మెస్సీ ప్రకటించాడు.

మెస్సీ హైదరాబాద్‌ పర్యటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు, ఆతిథ్యం ఇవ్వడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని సీఎం ఎక్స్ (ట్విట్టర్)‌లో పోస్టు చేశారు. ‘‘మెస్సీ వంటి మహానుభావుడిని ఒకసారి కనీసం ప్రత్యక్షంగా చూడాలని ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతగానో ఆశపడతారు. అలాంటి దిగ్గజం మన నగరానికి రాబోతుండటం గర్వకారణం. హైదరాబాద్‌ తన ప్రత్యేక ఆతిథ్యంతో ఆయనను ఆహ్వానిస్తుంది. ఇక్కడి ప్రజల ఆదరణ ఏం అన్నది మెస్సీకి ఖచ్చితంగా తెలుస్తుంది’’ అని రేవంత్ తెలిపారు.

మెస్సీ తన ఇండియా టూర్‌లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రత్యేక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడటం, ఫుట్‌బాల్‌ క్లినిక్స్‌ ప్రారంభించడం, మ్యూజిక్‌ కన్సర్ట్‌, సన్మాన కార్యక్రమాలు కూడా ఈ టూర్‌లో ఉండనున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక డిమాండ్‌ ఉన్న క్రీడా ప్రముఖుల్లో మెస్సీ ఒకరు. భారతదేశంలో ఏకంగా ఒక్క బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌కు ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఛార్జ్‌ చేస్తున్నట్లు సమాచారం. కాగా, మెస్సీ పర్యటన తెలంగాణలో క్రీడలు, యువత, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రమోషన్‌కు పెద్ద మద్దతు ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Also read :
Kokapet Lands | బంగారు భూములు.. కోకాపేటలో ఎకరం రూ.151 కోట్లు
Karnataka CM change | తుది అంకానికి కర్ణాటక సీఎం ఇష్యూ! డీకే, సిద్ధరామయ్యతో ఖర్గే భేటీకి రంగం సిద్ధం!
Hyderabad | ఆన్‌లైన్ బెట్టింగ్‌‌కు బానిసై రివాల్వర్ కుదువ పెట్టిన ఎస్ఐ