కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్

జన్మదినం సందర్భంగా కేటీఆర్ కుటుంబంతో కలిసి కేసీఆర్, శోభ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 24, 2026, 5:26 pm IST
Read Time: 3 mins
కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్

అధికారంలో ఉన్నప్పుడైనా..ప్రతిపక్షంలో కొనసాగుతున్నా.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు తన వ్యవసాయ క్షేత్రం( ఫామ్ హౌస్ )పై మమకారం ఎక్కువే. అందుకే ఆయన ఎక్కువ కాలం తన దైనందిన జీవితాన్ని ఫామ్ హౌస్ లోనే కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన చాల అరుదుగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు కనిపిస్తున్నారు. తాజాగా కేసీఆర్ ఎలా ఉన్నారన్న వీడియో ఒకటి ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్బంగా వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం తన జన్మదినం సందర్భంగా కేటీఆర్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేందుకు కేసీఆర్ వద్దకు కుటుంబంతో పాటు వెళ్లారు. ఈ సందర్బంగా సోఫాలో కూర్చున్న కేసీఆర్, ఆయన సతీమణి శోభలు కేటీఆర్ తమ వద్దకు రాగానే లేచి ఆయనను ఆశీర్వదించారు. కేసీఆర్ కుమారుడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ దంపతులు కుమారుడు కేటీఆర్ తో పాటు కోడలు నీలిమ, మనుమడు హిమాన్షులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ వీడియోలో తమ అభిమాన నాయకుడు కేసీఆర్ ఎలా ఉన్నారోనంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా తిలకిస్తుండటంతో అది కాస్తా వైరల్ గా మారింది.