కేటీఆర్ కు జన్మదిన కానుకగా సన్న బియ్యం పంపించిన కాంగ్రెస్!

కేటీఆర్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నేతలు 25 కిలోల సన్నబియ్యం సంచిని రాపీడో ద్వారా పంపించారు. ఇదే సమయంలో ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 24, 2026, 2:26 pm IST
Read Time: 8 mins
కేటీఆర్ కు జన్మదిన కానుకగా సన్న బియ్యం పంపించిన కాంగ్రెస్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన కానుకగా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యంను పంపించింది. ప్రజా పాలన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అన్న సన్న బియ్యం పేరుతో ప్యాక్ చేసిన 25కేజీల సన్న బియ్యం సంచిని రాపీడో సర్వీస్ ద్వారా కేటీఆర్ కు పంపించారు. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్బంగా సాయికుమార్ గుర్తు చేశారు.

ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే పండగ అనుకునేవారని, రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణాలో ప్రతి ఇంట్లో పండగ రోజుల చేస్తున్నాడన్నారు. కేటీఆర్ నిరుపేద కుటుంబం ఇంటిలోకి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నామని, కేటీఆర్ పుట్టినరోజు కానుకగా 25 కేజీల సన్న బియ్యం పంపిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల పంపిడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ ప్రజా ప్రభుత్వంలో అందరు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని, నిరుపేద కుటుంబం కళ్ళలో ఆనందం చూడటమే మా ప్రభుత్వం లక్ష్యం అన సాయికుమార్ పేర్కొన్నారు. ఈ సన్న బియ్యం అన్ని పార్టీల వారు, ఉన్నవాళ్లు లేనివాళ్లు అందరు తినొచ్చు అని, మా ప్రభుత్వం సంక్షేమ పథకాల సునామీ అని, దేశంలో ఎక్కడ ఇలాంటి పథకాలు లేవు అన్నారు.

ఇందిరా పార్కు వద్ద కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘నీట్’పరీక్షల్లో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శుక్రవారం ఇందిరా పార్కు వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వీ నాయకులతో కలసి ధర్నాకు హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ ఆందోళనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగడంతో ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఓ విద్యార్థిని మరణంపై అత్యంత అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. సమస్య తీవ్రతను పక్కనపెట్టి, సదరు అమ్మాయి లవ్ ఎఫైర్ వల్లే చనిపోయిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలు, విద్యార్థులు తమ హక్కుల కోసం ఆందోళనలు చేయకుండా ‘ధర్నా చౌక్’ను ఎత్తివేశారని గుర్తుచేశారు. నేడు అదే ధర్నా చౌక్‌లో కేటీఆర్ రాజకీయ స్వార్థం కోసం నిరసనలు తెలపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాతే ధర్నా చౌక్‌లో అడుగుపెట్టాలని అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారున.

విద్యార్ధుల నిరసనలో రాజకీయ అజెండాలు సరికాదు: కేటీఆర్‌

ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాన్ని రాజకీయ అజెండాలతో మలినం చేయొద్దని బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ కోరారు. శుక్రవారం ఇందిరాపార్కు వద్ద జరిగిన బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఢిల్లీలో పార్టీలకతీతంగా నిరసనలు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని, ఢిల్లీలో విద్యార్థులపై దాడులు చూస్తే బాధేస్తోందని, అందుకే వారికి అండగా ఉండేందుకే నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ ఎందుకు అడ్డుపడుతుందంటూ ప్రశ్నించారు.