• Telugu News
  • /National

ఐదవ రోజు ఉభయ సభలు మళ్లీ వాయిదా..!

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు వరుసగా ఐదో రోజు కూడా వాయిదా పడ్డాయి. అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 24, 2026, 3:56 pm IST
Read Time: 5 mins
ఐదవ రోజు ఉభయ సభలు మళ్లీ వాయిదా..!

నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు మరోసారి ఉభయ సభలను అడ్డుకోవడంతో వరుసగా ఐదవ రోజు కూడా ఎలాంటి సభా కార్యకలాపాలు లేకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం సభా ప్రారంభం కాగానే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్‌ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ప్రకటన చేశారని, సభలో చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని అభ్యర్థించారు. నీట్‌పై పార్లమెంటులో చ‌ర్చ, పటిష్ట బిల్లుకు దేశ ప్ర‌జ‌ల‌కు, విపక్షాలకు ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చార‌ని, సోన‌మ్ వాంగ్‌చెక్ త‌న నిరాహార దీక్ష‌ను విర‌మించార‌ని, ఆయ‌న కూడా స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆశించార‌ని, ఒక‌వేళ ఇప్పుడు చ‌ర్చ చేప‌ట్ట‌కుంటే, అది స‌రైన సందేశాన్ని ఇవ్వ‌బోదు అని మంత్రి రిజిజు అన్నారు. దీనిపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అర్ధరాత్రి వీడియో సందేశాన్ని తాము పట్టించుకోబోమని, సభకు వచ్చి నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రధానమైన మూడు డిమాండ్లను నెరవేర్చేవరకు చర్చలు జరిపే సమస్యే లేదని తేల్చి చెప్పారు.

ఈ సమస్యపై సభలో తాను స్పందించాలనుకున్నప్పుడు తన మైక్ లాగేసుకున్నారని విమర్శించారు. అలాగే విద్యార్థుల డిమాండ్స్‌ ప్రకారం నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యుడు, అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, విద్యార్థులపై దాడి చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించే వరకు చర్చలుండవంటూ ప్రతిపక్షం వైఖరిని స్పష్టం చేశారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చెలరేగడంలో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే తాము విద్యావ్యవస్థ లోపాలపై చర్చకు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య తొలుత సభ మధ్యాహ్నాంకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల నినాదాల మధ్య కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ జాతీయ గేయం వందేమాతరంపై బిల్లును ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టంలో ప్రతిపాదించారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని సీపీఐ, సీపీఎం వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.