• Telugu News
  • /Telangana

కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్

తుంగతుర్తి నియోజకవర్గంలో ఆర్ఆండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యేగా తనకు ప్రోటోకాల్ మేరకు ఆహ్వానం లేకపోవడం పట్ల మందుల సామేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి కోమటిరెడ్డి బ్రదర్స్ పై నిప్పులు చెరిగారు. మాదిగల నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏందని..మీపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని సామేల్ ప్రకటించడం సంచలనం రేపింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 24, 2026, 8:13 pm IST
Read Time: 15 mins
కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్

విధాత : నా సొంత నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ జోక్యం చేసుకోవడం ఏమిటని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ మండిపడ్డారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గంలో ఆర్ఆండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యేగా తనకు ప్రోటోకాల్ మేరకు ఆహ్వానం లేకపోవడం పట్ల మందుల సామేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి కోమటిరెడ్డి బ్రదర్స్ పై నిప్పులు చెరిగారు.

నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో మొన్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు మంత్రి వెంకట్ రెడ్డి పర్యటించారని..సొంత పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా..ఎస్సీ ఎమ్మెల్యే అయన నన్ను కావాలనే వారు అవమానిస్తున్నారని సామేల్ ఆరోపించారు. ప్రోటోకాల్ కు విరుద్దంగా శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి వెంకట్ రెడ్డికి మతిస్థిమితం లేకుండా పోయిందని మండిపడ్డారు.

రాహుల్, ఖర్గేలకు ఫిర్యాదు చేస్తా..

కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల అంటే లెక్కలేకుండా పోయిందని, చిన్నచూపు చూస్తున్నారని సామేల్ విమర్శించారు. నా నియోజకవర్గంలోని మోత్కుర్ లో రెండు కిలోమీటర్ల రోడ్డు కోసం వంద సార్లు మంత్రి వెంకట్ రెడ్డి చుట్టు తిరిగినా పని చేయలేదని దుయ్యబట్టారు. మాదిగలు అంటే మీకు బానిసలు కాదని, తుంగతుర్తిలో నన్ను, నకిరేకల్ లో వేముల వీరేశంను పదేపదే చిన్నచూపు చూస్తూ అవమానిస్తున్నారన్నారు. ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పట్ల పార్టీ విధానం ఇదేనా అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను, ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ను, సీఎం రేవంత్ రెడ్డిని, భట్టి విక్రమార్కను అడుగుతున్నానని..వారు కోమటిరెడ్డి బ్రదర్స్ వైఖరిపై స్పందించాలన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా కోమటిరెడ్డి బ్రదర్స్‌ సాగిస్తున్న పెత్తందారి రాజకీయాలపైన రాహుల్ గాంధీకి, ఖర్గేకు ఫిర్యాదు చేస్తానని సామేల్ ప్రకటించారు. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదని, కేవలం నన్ను గెలిపించిన నా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలకు మాత్రమే భయపడుతానని సామేల్ స్పష్టం చేశారు.

మాదిగలను అవమానిస్తే తగిన సమాధానం చెబుతా

వేముల వీరేశం నకిరేకల్ లో 68వేల ఓట్లతో, తుంగతుర్తిలో 52వేల ఓట్ల మెజార్టీతో గెలిచామని, మేం మీ వద్ద చేయి చాపలేదని సామేల్ గుర్తు చేశారు. తుంగతుర్తి, నకిరేకల్ లో బాగలేదని, పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని గాంధీభవన్ లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారని, ముందుగా మీ నియోజకవర్గాల్లో మీ సక్కదనం ఏందో ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ చూసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా అంటే పోరాటాల గడ్డ అని, దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలు ఉద్యమించిన జిల్లా అని..ఈ జిల్లా మీ రాజ్యం కాదని, శ్రమజీవుల జిల్లా అని, ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామేల్ ఉంటాడని గుర్తు పెట్టుకోవాలన్నారు. అణగారిన వర్గాలను చిన్నచూపు చూస్తే అందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కు నేను సమాధానం చెబుతానన్నారు.

రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో మీ పెత్తనం ఏంది..?

బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి ఎందుకుపోయి పోటీ చేశాడో ముందుగా పార్టీ కార్యకర్తలకు జవాబు చెప్పాలని, రాహుల్ గాంధీని, సోనియాగాంధీని తిట్టాడని, మళ్లీ వచ్చి కాంగ్రెస్ లో చేరి పోటీ చేసి గెలిచి..మా నిఖార్సైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడుతున్నాడని..అలాగైతే ఇక్కడున్న సర్పంచ్ లు, నాయకులు అంతా ఎవరని సామేల్ ప్రశ్నించారు. మా నియోజకవర్గంలో మీ పెత్తనం ఎందని, మీ జులూం ఎందని కోమటిరెడ్డి బ్రదర్స్ ను ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం మేరకు మాకు పోటీ చేసే అవకాశం వచ్చిందని, ఉద్యమ బిడ్డగా నా నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరించి గెలిపించారన్నారు. బీసీలకు కులగణనతో 52శాతం రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనపైన, సంక్షేమ పథకాలపైన ఒక్కనాడైనా సానుకూలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడరని విమర్శించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ జీవితానికి సమాధి కడుతా

జిల్లాలో మా ఎస్సీ ఎమ్మెల్యేల హక్కులను హరించే ప్రయత్నం మానుకోకపోతే మీ రాజకీయ జీవితానికి సమాధి చేసేందుకు దండోరా మోగిస్తానని సామేల్ హెచ్చరించారు. చావులకు, సంబురాలకు డప్పు కొట్టేది మేమే అని..మీ వైఖరి మారకపోతే మీపై సమరానికి డప్పు కొట్టక తప్పదన్నారు. నా నియోజవర్గంలో తొమ్మిది మండలాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను ఆపేందుకు మీకు ఎవరు అధికారం ఇచ్చారని, మీకు ఏం హక్కు ఉందని సామేల్ ప్రశ్నించారు. అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉందని, మా సీట్లపై మీ పెత్తనం ఎందంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ పై నిప్పులు చెరిగారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు

రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారని, వారు చేస్తే ప్రధాని కారని, మాదిగలు, లంబాడాలు, ఆదివాసీలు, గిరిజనులు, యాదవులు, రైతులు  అంతా కాంగ్రెస్ ఓటు వేస్తే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, రేపు వాళ్లే మళ్లా కాంగ్రెస్ కు ఓట్లేసి రాహుల్ ను ప్రధాని చేస్తారని సామేల్ స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ లో మిగిలిన రెండు మంత్రి పదవుల్లో ఒకటి లంబాడా ఎమ్మెల్యేకు, ఇంకోటి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇచ్చి పార్టీ బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గాలకు న్యాయం చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నానన్నారు. పార్టీ మారి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దన్నారు.

నిన్న ఎంపీ చామల,సర్వోత్తం రెడ్డిలతో పోరు..నేడు కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఫైర్

తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల కాంగ్రెస్ అధ్యక్షులను ఎమ్మెల్యేగా మందుల సామేల్ ఎంపిక చేశారు. అయితే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వారికే పెద్దపీట వేశారంటూ ఎంపీ చామల  కిరణ్ కుమార్  రెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తంరెడ్డిలు అసమ్మతి లేవదీశారు. సామేల్ తీరుపై పీసీసీకి ఫిర్యాదు చేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చామల, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సామేల్ లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ సందర్బంగా నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వివాదం ఇలా ఉండగానే కోమటిరెడ్డి బ్రదర్స్ సామేల్ కు తెలియకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సామేల్ సిద్దపడినట్లుగా భావిస్తున్నారు.

ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని సామేల్ వ్యాఖ్యానించడం..అధిష్టానానికి కోమటిరెడ్డి బ్రదర్స్ పైన ఫిర్యాదు చేస్తానని ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలలో కోమటిరెడ్డి బ్రదర్స్ పైన, పార్టీలోని ఓ వర్గం రెడ్డి నాయకత్వంపైన సామేల్ ప్రకటించిన యుద్దం ఏ మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికకరంగా మారింది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పై సామేల్ తిరుగుబాటు వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉండవచ్చని కోమటిరెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు.

సామేల్ విమర్శలు..వినాశకాలే విపరీత బుద్ది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

విధాత : నాపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన రాజకీయ విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నానని.,ఆయన విమర్శలు “వినాశకాలే విపరీత బుద్ధి” అంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై సామేల్ చేసిన విమర్శలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో తాను కూడా కీలక పాత్ర పోషించానని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు. సామేల్ ఒక్కడే ఉద్యమకారుడు కాదన్నారు.

తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిన సామేల్ కు గత అసెంబ్లీ ఎన్నికలలో తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని తానే కృషి చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను తప్పుడు వ్యక్తికి ఇవ్వడం జరిగిందని..తనను నమ్మి సామేల్ కు ఓటు వేసిన కార్యకర్తలందరికీ క్షమాపణలు కోరుతున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే సామేల్ కు వ్యతిరేకంగా పార్టీ నాయకులు ఎవరు కూడా మీడియా సమావేశాలు నిర్వహించవద్దని, నిరసనలు చేపట్టవద్దని, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.