హైలైట్స్:
- సాఫ్ట్‌వేర్ మార్చి జిల్లా కలెక్టర్లకు తెలియకుండా భూ దందా!
- అక్రమ భూ బదలాయింపులపై విచారణ జరగాలి
- ఏసీబీ కేసుల్లో రెండు కళ్ల ధోరణి
- బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ఆరోపణలు
విధాత, హైదరాబాద్:
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కింద నడుస్తున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో ఇప్పటివరకు 22 వేల ఫైల్స్ భూ యజమానులకు తెలియకుండానే, వారి ప్రమేయం లేకుండానే, ఇతరుల పేర్ల మీదికి మార్చారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో నిషేధిత భూములు కూడా ఉన్నాయని, పట్టాదారులకు సంబంధం లేకుండానే సాఫ్ట్ వేర్ మార్చి, ఆ భూములను ఇతరుల పేర్లకు బదలాయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షిస్తారని, వీరి పాలనలో ఏమాత్రం రక్షణ లేదన్నారు. ప్రజలకు ధనం లేదా ఆస్తి కూడా లేకుండా చేస్తున్నారన్నారు. భూ భారతి వెబ్ ఫోర్టల్ లో మీ భూమి ఉందా లేదా చూసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఫోర్టల్ లో ఈసీ చెక్ చేసుకోవాలన్నారు. పొంగులేటి కింద ఉన్న రెవెన్యూ శాఖలో, భూమి ఈసీ కోసం చూస్తే ఏమీ కనిపిచట్లేదన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. పొంగులేటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం నాడు బంజారాహిల్స్ తెలంగాణ భవన్ లో ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరించడానికి గతంలో కేసీఆర్ ధరణి తెచ్చారన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలకమైన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, పౌర సంబంధాలు శాఖలు తీసుకున్నారు. శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం శాఖను రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. ఇద్దరు కూడబలుక్కొని భూ దందా చేస్తున్నారని ఆయన విమర్శించారు. రూల్ 4 ఆఫ్ ఆర్ఓఆర్ (రికార్డ్సు ఆఫ్ రైట్స్) ప్రకారం, ఏ భూ బదలాయింపు జరగాలన్నా వారికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. కొనేవారికి,అమ్మేవారికి ఇద్దరికీ సమాచారం ఇవ్వాలని, ఆ తర్వాతనే భూ బదలాయింపు జరుగుతుందన్నారు. పొంగులేటి, రేవంత్ రెడ్డి లు కూడబలుక్కుని రెవెన్యూ శాఖలో ఈ రూల్ ఉల్లంఘిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్ధు చేసి, దాని స్థానంలో భూ భారతి చట్టం తెచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళ తరువాత ఇపుడు మళ్లీ… ధరణి కి కన్నం అంటూ పొంగులేటి లీకులు ఇచ్చి రాయించుకుంటున్నారన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల వంటి జిల్లాల్లో ఉన్న భూముల్ని అక్రమ బదలాయింపు చేస్తున్నారు. జనగామలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నొక్కేసి… మీ సేవ సెంటర్ల యజమానులు… కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి కోట్ల రూపాయల స్కాం చేశారు. కాని శ్రీనివాస్ రెడ్డి స్పందించి, కేవలం రూ.3.95 కోట్ల కుంభకోణం జరిగిందని, విచారణకు ఆదేశించామన్నారు. భూ లావాదేవీలపై 2025లో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. కానీ 2024 నుండి ఇప్పటికీ ఈ దందాలు నిరంతరాయంగా నడుస్తున్నాయని ప్రవీణ్ కుమార్ అన్నారు.
భూ భారతి వెబ్ ఫోర్టల్ ద్వారా సుపారీ గ్యాంగుల దందాలు…
రంగారెడ్డి జిల్లా ఖాజాగూడ సర్వే నెం 20 లో గల 20 గుంటల భూమిని సాస్ ఇన్ ఫ్రా అనే కంపెనీకి బదలాయింపు చేశారు. జూన్ నెల 19 వ తేదీన కూడా ఖాజాగూడలోని 1.2 ఎకరాల భూమిని అదే కంపెనీకి కట్టబెట్టారు. అత్యంత రక్షణ ఉండే రాష్ట్ర విభాగాల సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) కు దాచి పెట్టే బాధ్యతను ఇచ్చారు. తహశీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ తో పాటు సీసీఎల్ఏ కు ఈ లావాదేవీలు తెలియదంటే ఇంకెవరికి తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రికి ప్రతి రోజూ ఎన్ని లావాదేవీలు, ఎన్ని భూ బదలాయింపులు జరిగాయో రెవెన్యూ మంత్రి కి ఖచ్చితంగా తెలుస్తుందన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా వచ్చే ఆదాయం ఎందుకు తగ్గుతుందో సంబంధిత ఉన్నతాధికారులను పొంగులేటి ఎందుకు అడగడం లేదన్నారు. పొంగులేటి, రేవంత్ రెడ్డి గ్యాంగ్ లు సాఫ్ట్ వేర్ ను వాడి బంధువులు, దోస్తులకు భూ బదలాయింపు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లకు కూడా తెలియకుండా భూ బదలాయింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి లో ఒక్కో ఎకరం 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా 100, 200 ఎకరాల భూమి అక్రమంగా బదలాయింపు జరుగుతొందన్నారు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ వ్యక్తి దరఖాస్తు చేసుకోకుండానే ఇతరులకు భూమి వెళ్తే అది పెద్ద నేరమన్నారు. జనవరి 2026 లో జనగామ కుంభకోణం గురించి మాట్లాడిన పొంగులేటి, ఈ 22 వేల భూ బదలాయింపుల గురించి ఎందుకు మాట్లాడడంలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. భూ బదలాయింపునకు గురైన బాధిత రైతులు తహశీల్దార్ వద్దకు వెళ్తే… మాకు కూడా తెలియదు కోర్టుకు పొమ్మంటున్నారు. కోర్టుకు వెళ్లేలోపు సుపారీ గ్యాంగులు వెళ్లి భూమిని కబ్జా చేస్తున్నారు. ఆ తర్వాత భూ యజమానితో 50 శాతం కమీషన్ అడిగి సెటిల్మెంట్ చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో మాఫియా పాలన
తెలంగాణలో నడిచేది ప్రజా పాలన కాదు, మాఫియా పాలన,రాక్షస పాలన అన్నారు. 22 వేల భూ బదలాయింపు జరిగితే పొంగులేటి ఎందుకు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలేదని ప్రశ్నించారు. సీసీఎల్ఏ ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. గతంలో చెప్పిన జనగామ కుంభకోణంలో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి కూడా తీసుకోలేదన్నారు. ఇపుడు కూడా అక్రమ భూ బదలాయింపులు జరిగాయంటూ, ఎవరో చిన్న స్థాయి అధికారుల వల్ల ఇది జరిగిందంటూ లీకులు ఇస్తున్నారు. చివరికి ఎవరో అమాయక అధికారులను బలిపశువును చేసి తప్పించుకోవాలని పొంగులేటి చూస్తున్నారు. జనగామ కుంభకోణం పై మీరు వేసిన కమిటీ రిపోర్ట్ ఏం చెప్పిందో బహిర్గత పరచాలన్నారు. కానీ సీసీఎల్ఏ, రెవెన్యూ ఉన్నధికారులకు రెవెన్యూ మంత్రిగా అన్ని సూచనలు ఇచ్చేది మీరే కదా అని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో జీవో 111 భూములు కూడా వదలడం లేదన్నారు. ఇపుడు కీసర లో మరో భూ దందా ప్రారంభించారని, అందుకోసం తహశీల్దార్ స్థాయి అధికారిని ఆర్డీఓ పోస్టింగ్ లో కూర్చోబెట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో తహశీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లు ఇలా పదోన్నతులు, పోస్టింగ్ లలో నిబంధనలు పాటించడం లేదని, తహశీల్దార్లే డీఆర్ఓలు అయ్యారన్నారు.
"ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి వరకు పరిశీలిస్తే పొంగులేటిదే అతి పెద్ద బాహుబలి కుంభకోణం. బాధ్యులు అయిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? ఎన్ఐసీ అధికారులు మీ సంతకం లేకుండా ఏం చేయలేరు. మీ సంతకం లేకుండా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా? అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ చేసుకొని, రియల్ ఎస్టేట్ దందా చేసే వారి దగ్గరకు వెళ్లి... వారి నుంచి 30 శాతం కమీషన్లు అడుగుతున్నది నిజం కాదా?"
- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
ఉమ్మడి ఏపీ ని మించి భూ కుంభకోణాలు…
ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి వరకు పరిశీలిస్తే పొంగులేటి దే అతి పెద్ద బాహుబలి కుంభకోణం అని, బాధ్యులు అయిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ఎన్ఐసీ అధికారులు మీ సంతకం లేకుండా ఏం చేయలేరన్నారు. మీ సంతకం లేకుండా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా? అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ చేసుకొని, రియల్ ఎస్టేట్ దందా చేసే వారి దగ్గరకు వెళ్లి… వారి నుంచి 30 శాతం కమీషన్లు అడుగుతున్నది నిజం కాదా? విమర్శలు వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే మళ్లీ అధికారులతో.. అక్రమ భూ బదలాయింపుల్లో జరిగిన తప్పులు తిరిగి సరి చేయిస్తున్నారు. అధికారులకు విన్నపం చేస్తున్నా మీరు ఏం చేసినా దొరికిపోతారని, దయచేసి తప్పులు చేయవద్దని ప్రవీణ్ కుమార్ కోరారు. రూ.10 వేల కోట్ల భూ బదలాయింపు కుంభకోణం జరిగిందని, ఈ కేసులో పోలీసులు వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి విచారణ జరపాలన్నారు. ఎవరెవరు అక్రమంగా భూ బదలాయింపు చేశారో.. వారి ఫోన్ నెంబర్లు తీసుకొని పొంగులేటి, రేవంత్ మాఫియా మధ్య జరిగిన కాల్ రికార్డ్ డాటా బయటకు తీయాలన్నారు. భూ భారతి సంబంధించిన తాళం ఎవరి దగ్గర ఉందో వారు బాధ్యత వహించాలన్నారు. భూ బదలాయింపు కుంభకోణంలో రెవెన్యూ మంత్రే లబ్ది దారుడు అని, ఈ కేసును సీబీఐ, సీఐడీ, ఈడీ విచారణ చేయాలని ఆయన కోరారు.
సీఎం కు నచ్చకపోతే ఏసీబీ దాడులు…
చేర్యాలలో ఏసీబీకి పట్టుబడిన తహశీల్దార్ దిలీప్ నాయక్ ను అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైలుకు పంపారని, డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డిని 5 రోజుల వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీఎన్ఎస్ఎస్ 35(3) ప్రకారం ఎవరికైనా మినహాయింపు ఇవ్వవచ్చు కానీ కేవలం భీమ్ రెడ్డికి మాత్రమే ఎందుకు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి బంధువుకు చెందిన క్రషర్ ను ఉచితంగా కరెంట్ ఇవ్వలేదని మణికొండ టీజీఎస్పీడీసీఈఎల్ ఏడీఈ ఇరుగు అంబేద్కర్ పై ఏసీబీ దాడులు చేయించి రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నాయని కేసు పెట్టి జైలుకు పంపారు. రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ రాంచందర్ నాయక్ పై ఏ7 కేసు పెట్టి రాత్రికి రాత్రే జైలుకు పంపారు. తన వద్ద పైసా దొరలేదని, సస్పెన్షన్ ఎత్తివేయాలని అడగడానికి వెళితే మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి చేతిలోనే ఏసీబీ ఉంది కాబట్టి, ఆయనకు నచ్చని వారిపై ఏసీబీ కేసులు పెడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.