హైలైట్స్:
- మెజార్టీ ఏజెన్సీలు పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వడం లేదు
- ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ప్రతి నెలా 5 లోపు చెల్లింపులు చేయాలి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
విధాత, హైదరాబాద్:
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేందుకు వారి వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా.. ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ తో సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటి నుంచి 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అందుకే ఉద్యోగులందరి పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ 100 రోజుల్లో ఈ అంశాన్ని కొలిక్కి తీసుకు రావాలని ఆదేశించారు. హెల్త్ కార్డులు, ఇతర ప్రయోజనాలు అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిలైజ్ చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. మంగళవారం జూబ్లిహిల్స్ ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సలహాదారు కే రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతి కుమారి, వేతన సవరణ కమిషనర్ ఎన్ శివ శంకర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కావడం లేదు…
రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించాలని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అయినా కిందిస్థాయి విభాగాల అధికారులు అమలు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దుర్గం శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో రేవంత్ రెడ్డి రెండోసారి ఆదేశాలు జారీ చేశారని వారు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా ఆర్థిక శాఖ అధికారులు, ఇతర విభాగాల అధిపతులు ఆదేశాలను అమలు చేయాలని వారు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు లేక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా డీడీవోలు, అలాగే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల బిల్లులు సమయానికి సమర్పించకపోవడం, జీతాలు నిలిపివేయడం జరుగుతోందన్నారు. ఇది ముఖ్యమంత్రి ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, కార్మికుల హక్కులను కాలరాయడమేనన్నారు.
"రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించాలని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా కిందిస్థాయి విభాగాల అధికారులు అమలు చేయడం లేదు. "
- తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దుర్గం శ్రీనివాస్
"రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు లేక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా డీడీవోలు, అలాగే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల బిల్లులు సమయానికి సమర్పించకపోవడం, జీతాలు నిలిపివేయడం జరుగుతోంది. ఇది ముఖ్యమంత్రి ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, కార్మికుల హక్కులను కాలరాయడమే."
- తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దుర్గం శ్రీనివాస్
నెలల తరబడి పెండింగ్‌లో వేతనాలు
పంచాయతీరాజ్ శాఖ లో 3 నెలలు, తెలంగాణ మోడల్ స్కూళ్ల లో 7 నెలలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ ఈఎస్ఐ డిస్పెన్సరీ లో 4 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పలు విభాగాలలో నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదన్నారు. వేతనాల కోసం ఏజెన్సీలను ప్రశ్నిస్తే ఉద్యోగులను బెదిరిస్తూ, కాలయాపన చేస్తున్నాయన్నారు. ఏజెన్సీలు ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ, ఈపీఎఫ్ మొత్తాలను మినహాయిస్తున్నప్పటికీ వాటిని సంబంధిత ఖాతాల్లో జమ చేయడం లేదు. దీంతో ఉద్యోగులు వైద్య సేవలు, భవిష్యత్ సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కార్మిక చట్టాల ఉల్లంఘన మాత్రమే కాదు, ఉద్యోగులపై జరుగుతున్న తీవ్రమైన అన్యాయమని వారు ఖండించారు.
"వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలి. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. "
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సమయానికి అందని జీతాలు..
ప్రభుత్వం మొదటి తేదీన ఏజెన్సీలకు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, ఉద్యోగులకు మాత్రం సమయానికి జీతాలు అందడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు హెచ్‌ఓడీలు, డీడీవోలు, సంబంధిత అధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీతాలు ఆలస్యం చేస్తూ, ఈఎస్ఐ, ఈపీఎఫ్ లు చెల్లించని ఏజెన్సీలను బ్లాక్‌లిస్ట్ చేసి, వారి ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. అన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న జీతాలను అత్యవసరంగా విడుదల చేయాలని కోరారు. అన్ని ఏజెన్సీలపై ప్రత్యేక విచారణ జరిపి ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లింపులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి రెండోసారి జారీ చేసిన ఆదేశాలను తక్షణమే అమలు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దుర్గం శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Outsourcing Scam | ఔట్‌సోర్సింగ్‌లో బోగస్ ఉద్యోగులు.. అధికారులు, ఏజెన్సీలు నొక్కేసింది 15వేల కోట్లు?