దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి నాలుగు నెలల కిందటే రహస్యంగా వివాహం చేసుకున్నట్లుగా పోలీసు విచారణలో వెల్లడవ్వడం విస్మయం రేపింది.
కేతన్ అగర్వాల్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాతనే…నిందితులిద్దరూ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నట్లు పూణే రూరల్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సియా, చేతన్ లు ప్రత్యేక వివాహ చట్టం కింద వారి పెళ్లికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తు్నారు. వారి రహస్య పెళ్లికి సాక్షులుగా సంతకాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గోయల్ ఇద్దరు స్నేహితులను కూడా విచారిస్తున్నారు. అలాగే, సియా, చేతన్‌లు పెళ్లి దండలు ధరించిన ఫొటోలను ఓ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారని, అనంతరం వాటిని డిలీట్ చేశారని తెలుస్తోంది. ఆ ఫొటోలను తిరిగి రికవరీ చేసేందుకు పోలీస్ ఫోరెన్సిక్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
దాదాపుగా రూ. 600కోట్ల ఆస్తులకు వారసుడైన యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ కు, సియా గోయల్ కు పెళ్లి చేాలనిఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించి నిశ్చితార్థం చేశారు. డిసెంబర్‌లో వివాహం చేయాలని తేదీ ఖరారు చేశారు. అయితే, ఆ పెళ్లి ఇష్టం లేని సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 18న పుణె సమీపంలోని లోహగడ్ కోటకు తీసుకెళ్లి, పక్కా ప్రణాళిక ప్రకారం కొండ పైనుంచి తోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి..కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో కేతన్ అగర్వాల్ హత్యకు ముందు సియా, చేతన్ ల మధ్య సాగిన వ్యవహారాలు మరిన్ని వెలుగుచూస్తుండటం ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చేస్తుంది.