తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) పేరును కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి పేరును కేటాయించాలని పిటిషన్ లో అభ్యర్థించారు. అయితే టీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ పై తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయని హైకోర్టు తెలిపింది. సీఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే కోర్టుకు రావాలని కవితకు హైకోర్టు సూచించింది. కవిత పిటిషన్‌ను విచారణ చేపట్టడమంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది.
కవిత వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోండి
టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం నోటీసులపై స్పందించిన కవిత ఈ వ్యవహారంలో నేరుగా మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఎన్నికల సంఘం నోటీసులకు కవిత సమాధానాలు ఇచ్చిన తర్వాత వ్యక్తిగతంగానూ ఆమె వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి హైకోర్టు సూచించింది.
విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో నెలకొన్న వివాదంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో పోలిక ఉన్న రెండు రాజకీయ పార్టీలు నమోదై ఉన్నందున అదే పేరును కవితకు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పేరు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ.. వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని, గతంలో ఇలాంటి వ్యవహారాల్లో ఎవరికీ వ్యక్తిగతంగా వాదనలు వినడానికి అవకాశం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదని ఇప్పటికే కవితకు స్పష్టం చేసినట్లు ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు.
మరోవైపు కవిత తరఫు న్యాయవాది మాత్రం టీఆర్ఎస్ పేరును ఆమెకు కేటాయించాలని కోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో కవితకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే ప్రతికూల నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు వారం రోజుల్లో కవిత అభిప్రాయాలను తెలిపిన తర్వాత వ్యక్తిగతంగానూ ఆమె వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచించింది.