తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతనంగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌)పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పోటెత్తాయి. టీఆర్ఎస్ పేరు కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును బీఆర్ఎస్ వదులుకున్నప్పటికి, కవిత మళ్లీ అదే పేరును ఎంచుకోవడంతో ఓట్ల బదిలీలో గందరగోళం ఏర్పడుతుందని,నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ‘TRS’ గానే గుర్తిస్తారని, అందువల్ల ఆ పేరును కవితకు కేటాయించవద్దని బీఆర్ఎస్ తన ఫిర్యాదులో ఈసీని కోరింది.

‘టైటిల్ వార్’

టీఆర్‌ఎస్‌ పేరు కేటాయింపుపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి దాదాపు 700 అభ్యంతరాలు అందాయి. టీఆర్‌ఎస్‌పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే జూన్‌ 1వ తేదీలోపు చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలుపాలంటూ ఇటీవల పేపర్లలో కవిత తరఫున ఇచ్చిన పబ్లిక్ నోటీసు (యాడ్) పై ఇప్పుడు ప్రజా అభ్యంతరాలు, రాజకీయ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తో పాటు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న ‘తెలంగాణ రాజ్య సమితి’ (TRS) అనే పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అలాగే కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి కేవలం ఒక్క రోజు ముందే.. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న “తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన” (TRS) అనే పార్టీ ఇదే పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సోలాపూర్‌కు చెందిన నేత దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ పేరు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. రెండు పార్టీల సంక్షిప్త నామం ‘TRS’ ఒక్కటే కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద అసలైన వివాదం మొదలైంది.

తెలంగాణ ఈసీ వద్ద ఇప్పటికే టీఆర్ఎస్ సంక్షిప్త నామంతో మరో రెండు పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ టైటిల్ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వివరణ కోరనుండటంతో, తగిన సమాధానాలు ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం ఢిల్లీలో సిద్ధమవుతోంది. భారీ ఎత్తున చట్టపరమైన, రాజకీయ అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కవిత కొత్త పార్టీకి ‘TRS’ అనే పేరు దక్కుతుందా? లేక ఈసీ సూచనల మేరకు పేరు మార్చుకోవాల్సి వస్తుందా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.