హైలైట్స్:
- అమరుల కుటుంబాలకు కోటి చొప్పున ఇవ్వాలి
- అవినీతి అనకొండకు మూణ్ణెల్లు మంత్రి పదవి కావాలా?
- బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచింది
- టీఆర్ఎస్ అధినేత్రి కవిత ఘాటు విమర్శలు
బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము మూలుగుతున్నదని టీఆర్‌ఎస్ అధినేత్రి దేవనపల్లి కవిత ఆరోపించారు. ఈ సొమ్మును అమరవీరుల కుటుంబాలకు తలా కోటి రూపాయల చొప్పున పంచాలని డిమాండ్ చేశారు. తాము ఉద్యమకారుల గురించి పోరాటం చేస్తే ఆ వార్తలు రాకుండా ఫోన్లు చేసి అడ్డుకున్నారని కొత్తగూడెంలో జరిగిన హెచ్‌ఎంఎస్ సమావేశంలో ఆరోపించారు. ‘మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తే… మేము పోరాటం చేయటం మీకు సమస్యగా మారిందా?’ బీఆర్ఎస్ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న రూ.14 వందల కోట్లు.. క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చినవి కావా? అని అని కవిత నిలదీశారు. అమరుల గోసపై చాలా ఆవేదనతో చెబుతున్నానని కవిత అన్నారు. తాను మళ్లీ బీఆరెస్‌లోకి వెళ్లే ప్రసక్తి లేదని కవిత తేల్చి చెప్పారు. ‘నేను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేదు’ అని కవిత స్పష్టం చేశారు. తన పార్టీతో భయం లేదంటూనే ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు వెయ్యికి పైగా కంప్లైంట్స్ ఇచ్చారన్న కవిత.. టీఆర్ఎస్ అనే పేరు తన పార్టీకి రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవా? తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు.. కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా’ అని కవిత తీవ్రంగా హెచ్చరించారు.
ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ వెనుక కేటీఆర్…
మాజీ మంత్రి కేటీఆర్ ఆయన మిత్రుడి ప్రదీప్ కన్‌ష్ట్రక్షన్స్‌కు నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో క్విడ్ ప్రొ కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చి పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చారని కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అనకొండ అయిన మాజీ మంత్రి టీ హరీశ్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోందని అపహాస్యం చేశారు. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ జీవితంలో బాగుపడని స్పష్టమైందన్నారు. చేసిన అవినీతి, పెద్దాయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా మూడు నెలలు మంత్రి పదవి కావాలంట? అని ఆమె ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులో అతి పెద్ద అవినీతి అనకొండ గుంటనక్కనే అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా అన్యాయం చేసింది ఆ గుంటనక్కనే అని పరోక్షంగా హరీశ్‌పై విమర్శలు గుప్పించారు. ఎవరైతే అవినీతి చేశారో ఆయననే ముందు పెట్టి కాళేశ్వరం అంశాన్ని ఈ ప్రభుత్వంపై మాట్లాడిస్తున్నారన్నారు. ఇదంతా చూస్తే ఇక జన్మలో బీఆర్ఎస్ అనే పార్టీ బాగుపడదని అర్థమవుతోందన్నారు. పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
పయనీర్ పేపరు కొనుగోలు చేసిన కేటీఆర్…
తాను పార్టీ పెట్టుకొని తన పని తాను చేసుకుపోతున్నానని కవిత అన్నారు. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ విషయంలో ఎక్కడా పర్సనల్ విషయాలు మాట్లాడలేదని, పార్టీ పెట్టిన ఆరు నెలల వరకు అన్ని పార్టీల గురించి మాట్లాడి ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు. మా పార్టీకి సంబంధించిన వార్తలు రాసే మీడియా ప్రతినిధులకు సిగ్గు వదిలి గుంటనక్క ఫోన్లు చేస్తూ, వార్తలు రాయవద్దని చెబుతున్నారని మండిపడ్డారు. రూ.188 కోట్లు పెట్టి మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవలే పయనీర్ అనే ఇంగ్లీష్ డైలీ పేపర్ ను కొనుగోలు చేశారన్నారు. సొమ్ములతో సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను కొనుగోలు చేసి మా వార్తలు రాకుండా చేయాలని చూస్తున్నారా? అని నిలదీశారు. ఒక ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేస్తే ఇన్ని కుట్రలు చేస్తారా? దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యల పోరాటం విషయంలో పోటీ పడాలని సవాల్ విసిరారు.
"మా పార్టీకి సంబంధించిన వార్తలు రాసే మీడియా ప్రతినిధులకు సిగ్గు వదిలి గుంటనక్క ఫోన్లు చేస్తూ, వార్తలు రాయవద్దని చెబుతున్నారు. రూ.188 కోట్లు పెట్టి మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవలే పయనీర్ అనే ఇంగ్లీష్ డైలీ పేపర్ కొనుగోలు చేశారు. సొమ్ములతో సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను కొనుగోలు చేసి మా వార్తలు రాకుండా చేయాలని చూస్తున్నారా? ఒక ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేస్తే ఇన్ని కుట్రలు చేస్తారా? దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యల పోరాటం విషయంలో పోటీ పడాలి. "
- దేవనపల్లి కవిత
ఫీనిక్స్ యజమాని ఆంధ్రావాడా… తెలంగాణ వాడా…
ఫీనిక్స్ గ్రూపునకు హైదరాబాద్ చుట్టుపక్కల రూ.80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారని కవిత ఆరోపించారు. వాడు ఆంధ్రావాడా? తెలంగాణ వాడా? అని ఆమె నిలదీశారు. ఆ సంస్థ 33 లక్షల టన్నుల కలప కొట్టేస్తున్నదని, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పెట్టిన కేసులను కూడా యజమాని పట్టించుకోవటం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఇంకా ఎక్కువగా ఈ ప్రభుత్వం కూడా భూమి ఇస్తోందని ఆరోపించారు. అవినీతి విషయంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచిందన్నారు. కచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించిన భూములు అన్నింటిపైన సమీక్షిస్తామన్నారు.
"‘నేను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేదు’"
- దేవనపల్లి కవిత
చైతన్య, నారాయణ సంస్థలకు హరీశ్ పాలు…
చైతన్య, నారాయణ విద్యా సంస్థలను నిజామాబాద్ లోకి రానివ్వలేదని, ఉద్యమకారులకు, చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం జరిగేందుకు ఫైట్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఇవ్వాళ హరీష్ రావు మాత్రం నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు పాలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడని విమర్శించారు. 500 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లకు విజయ డెయిరీ నుంచే పాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
"‘బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవా? తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు.. కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా’ "
- దేవనపల్లి కవిత
బీఆర్ఎస్ సోషల్ మీడియాకు వార్నింగ్…
నేను చేసిన ఆరోపణలపై మాట్లాడే దమ్ము లేక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేయిస్తున్నారని కవిత అన్నారు. తల్లి, చెల్లి అనే ఇంగితం మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారన్నారు. మీ దగ్గర ఉన్న కొంతమంది హౌలా గాళ్లతో ఇలాంటి కామెంట్లు చేయించటానికి సిగ్గుండాలన్నారు. తల్లి, చెల్లి అనే ఇంగితం లేకుండా బూతులు తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు? కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతామని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు హెచ్చరిస్తున్నా. ప్రజా సమస్యలు వదిలి, పర్సనల్ గా ఆటాక్ చేస్తున్నారంటూ, నేను మాత్రం అలా చేయనని ఆమె స్పష్టం చేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీని వద్దన్న మహిళలపై రౌడీషీట్…
ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, హెటిరో గ్రూపు ఛైర్మన్ బండి పార్థసారధి రెడ్డి మహబూబ్ నగర్ లో పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని కవిత తెలిపారు. 10 వేల మంది మహిళలు ఫ్యాక్టరీ వద్దని ధర్నా చేస్తే వారిలో 90 మంది పై అక్రమ కేసులు పెట్టారు. 9 మంది పై రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా భూమిలో విషం నింపే పార్థసారధియే హైదరాబాద్ ఖానామెట్ లో సింధూ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారన్నారు. ఖమ్మంలో రైతు సభ జరిగే లోపు మహబూబ్ నగర్ లో రైతులపై పెట్టిన కేసులు, రౌడీ షీట్లను తొలగించాలన్నారు. అదే సభలో రైతు భరోసా వేశామని ప్రచారం చేసుకుంటారని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని విమర్శించారు. అది కూడా రెండు సీజన్లలో సగమే వేశారు. యూరియా కోసం రైతులు అన్ని వదిలేసి మీ సేవ చుట్టు తిరగాలా? రైతుల మీద ఎందుకు ఈ పిచ్చి ప్రయోగాలు? అని అడిగారు. రేవంత్ రెడ్డి రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడన్నారు. కానీ ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనే ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన 90 మంది రైతులపై అక్రమ కేసులు, 9 మంది రైతులపై రౌడీ షీట్లు పెట్టారని మండిపడ్డారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అరకిలోమీటర్ రాళ్ల గోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చని కవిత అన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల ద్వారా కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎత్తి పోసుకోవచ్చని తెలిపారు. కానీ అహంకారం, గత ప్రభుత్వంపై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారు. చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలను మభ్య పెట్టి మోసం చేస్తున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
నిజాం రాసిచ్చిన 17 గనులూ కిషన్ రెడ్డి ఇప్పించాలి…
సింగరేణి కాలరీస్ లో వన్ విజన్, వన్ ఫ్యామిలీ అంటారు కానీ ఆఫీసర్లకు ఒక రూల్, కార్మికులకు ఒక రూల్ నడుస్తోందని కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణికి నిజాం 17 గనులను రాసిచ్చారు. కానీ యూపీఏ హయాంలో జరిగిన భూ కుంభకోణం కారణంగా బీజేపీ బొగ్గు గనులను జాతీయం చేసి, సింగరేణికి చెందిన 17 బొగ్గు గనులను కేంద్రం లాక్కుందన్నారు. కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డనే అయితే టెండర్లు లేకుండా గనులు ఇవ్వాలని నేను మొదటి దఫా బాయి బాటలో డిమాండ్ చేశానన్నారు. ఒక మైనింగ్ ఇచ్చి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. తాడిచర్ల-2 ను కేటాయించినట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారని, గతంలో నిజాం రాసిచ్చిన 17 గనుల్లో ఇంకా 16 గనులు బేషరుతుగా సింగరేణికి ఇచ్చేయాలని కోరారు. బీజేపీ నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు చాలా అన్యాయం జరుగుతోంది. తాడిచర్ల-2 సింగరేణికి ఇస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేట్ సంస్థకు ఇస్తే వాళ్లు వేరే రాష్ట్రాల కార్మికులను తీసుకొస్తారని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరన్నారు. రేవంత్ రెడ్డి బావమరిదికి సత్తుపల్లిలో ఉన్న మైన్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదన్నారు. వాళ్లు ఉద్యోగాల కోసం అడుక్కోవాలా? అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తాడిచర్ల-1 మైనింగ్ ను దొడ్డిదారిన ప్రైవేట్ వాళ్లకు ఇవ్వటంతో కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. సింగరేణిలో 62 వేల మంది సిబ్బంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 38 వేలకు పడిపోయిందన్నారు. సింగరేణిలో డింపెడెంట్ ఉద్యోగాలు వచ్చేలా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను ఎంతో కృషి చేశానన్నారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించి, పెండింగ్ లో ఉన్న డింపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ చేయాలన్నారు. అలియాస్ పేర్ల సమస్య ను వెంటనే తీర్చాలని, లేదంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రధాన డిమాండ్లపై నిరాహార దీక్ష చేస్తానని టీఆర్ఎస్ అధినేత్రి కవిత హెచ్చరించారు.