Outsourcing Scam | ఔట్‌సోర్సింగ్‌లో బోగస్ ఉద్యోగులు.. అధికారులు, ఏజెన్సీలు నొక్కేసింది 15వేల కోట్లు?

లేని ఉద్యోగులను కంప్యూటర్లలోకి ఎక్కించి, ఉద్యోగం చేయకపోయినా జీతాలు చెల్లించినట్టు రాసి.. పదేళ్ల కాలంలో 15వేల కోట్లు మెక్కేశారన్న ఆరోపణలు తెలంగాణలో సంచలనం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Outsourcing Scam | ఔట్‌సోర్సింగ్‌లో బోగస్ ఉద్యోగులు.. అధికారులు, ఏజెన్సీలు నొక్కేసింది 15వేల కోట్లు?

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Outsourcing Scam | ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయకపోతే అక్రమార్కులు రెచ్చిపోతారు. కిందిస్థాయి అధికారులను కలుపుకుని కోట్లు కొల్లగొడతారు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన. బీఆరెస్‌ హయాంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో పదిహేను వందల కోట్లు దోపిడీ జరిగిందని బయటపడింది. పని చేయకుండానే చేయించుకున్నట్టు.. నియమించుకోకుండానే జీతాలు చెల్లించినట్లు లెక్కలు రాసుకున్నారు. ఈ సొమ్మును అధికారులతో పాటు ఏజెన్సీలు పంచుకున్నాయని ఇంటెలిజెన్స్‌ విచారణలో వెలుగు చూసింది. ఈ దోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వ విభాగాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు.

నిగ్గు తేల్చాలని నిర్ణయించిన సీఎం

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఏజెన్సీలను, మ్యాన్ పవర్ ఏజెన్సీలను పార్టీ నాయకులు నిర్వహించినట్లు ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. కొద్ది నెలలుగా జీతాలు సకాలంలో రాకపోవడం, ఏజెన్సీల వేధింపుల కారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో తమ జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తూ, చెల్లించడం లేదని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాదిరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత మంది పనిచేస్తున్నారు? చెల్లింపులు ఎలా చేస్తున్నారు? వాస్తవంగా పనిచేస్తున్నారా? లేదా? అనేది నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, జీతాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఐదు నెలల క్రితం నియమించింది. ఈ కమిటీ జిల్లాల వారీగా, ప్రభుత్వ విభాగాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నది. ఐదు నెలలుగా ప్రతినెలా వివరాలు తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది పనిచేస్తున్నట్లు సంఖ్య మాత్రమే ఇచ్చారు. ప్రతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగి వారీగా వివరాలు పంపించాలని సెప్టెంబర్ 30వ తేదీ గడువు విధించారు. గడువు తేదీ నాటికి రెండు లక్షల మంది మాత్రమే తమ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు ఆన్‌లైన్‌లో సమర్పించారు. మిగతా రెండు లక్షల మంది వివరాలు అక్టోబర్ 25 నాటికి ఇవ్వాలని కమిటీ సూచించింది. మహా అయితే మరో లక్ష మంది వివరాలు రావచ్చనే అంచనాలో కమిటీ ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక లక్ష మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తేలింది.

రూ.15వేల కోట్ల దోపిడీ?

బోగస్ ఉద్యోగుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లలో సుమారు రూ.15వేల కోట్లు నష్టపోయినట్లు కమిటీ అంచనా వేసినట్లు తెలిసింది. ప్రతి సంవత్సరం రూ.1500 కోట్లు అధికారులు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు కలగలిసి మెక్కినట్లు ప్రాథమిక విచారణలో తేలిందంటున్నారు. ఎక్కడెక్కడ దుబారా జరిగింది, ఎవరు కొల్లగొట్టారనే దానిపై ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం కూడా వివరాలు ఆరా తీసే పనిలో నిమగ్నమై ఉంది. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనని, ఆర్థిక శాఖ లో క్రమ శిక్షణ లోపం ఉందని సచివాలయంలోని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నిక్కచ్చిగా ఉంటే వేల కోట్ల దుబారా తప్పేదని, అక్రమార్కులు చెలరేగిపోయేవారు కాదంటున్నారు.