భారత చిత్రపటంపై మావోయిస్టు పార్టీ ప్రస్థానం ముగిసిందా? సమగ్ర విశ్లేషణ
భారత చిత్రపటంలో నిన్నటి వరకు ఉనికిలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) అనే విప్లవ పార్టీ ఇక ఉనికిలో లేనట్లే. ఉంటే గింటే మావోయిస్టు భావజాలం అక్కడక్కడ ఉనికిలో ఉంటూ ఊపిరితీసుకునే అవకాశముండొచ్చేమోగానీ, ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీ నిర్మాణాత్మకంగా దాని ప్రస్థానం ముగిసినట్లేనని భావిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం నుంచి నక్సలబరీ, శ్రీకాకుళ పోరాటాల ప్రభావంతో 60 దశకంలో పురుడుబోసుకుని అప్రతిహతంగా దేశవ్యాప్తంగా విస్తరించి మధ్యభారతంలోని దండకారణ్యంలోని దుర్భేద్యమైన అబూజ్‌మడ్ అడవులు కేంద్రంగా గట్టిపట్టు బిగించిన మావోయిస్టు పార్టీ... చరమాంకానికి చేరింది. అక్కడక్కడ ఎవరైన నాయకులు మిగిలి ఉంటే లొంగిపోవడమో.. మృత్యువాత పడటమో లాంఛనం తప్ప మరేమీ కాదని తాజా పరిస్థితులు తేల్చిచెబుతున్నాయి.
- డెడ్‌లైన్ విధించి నిర్మూలించిన బీజేపీ ప్రభుత్వం
- దండకారణ్యమంతా పారిన ఆరని నెత్తురుటేరులు
- పంతం నెగ్గించుకున్న మోదీ– షా ద్వయం
- అన్నింటా మావోయిస్టులపై సర్కారు పైచేయి
- కేంద్ర, రాష్ట్ర నాయకుల్లో ఎక్కువమంది ఎన్‌కౌంటర్
- మిగిలిన ముఖ్య నేతలు సర్కారు ముందు సరెండర్
- సాయుధ పోరాటానికి సలాం, ఆయుధాలతో లొంగుబాట
- అణచివేతకు గురైన ఆదివాసీ గూడేలు, గిరిజనులు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ అఖరు ఘట్టానికి చేరింది. కేంద్రం ప్రకటించిన 2026 మార్చి 31కి ముందే మావోయిస్టు పార్టీ నిర్మాణాన్ని నామరూపాలు లేకుండా చేయడంలో కేంద్రం సక్సెస్ అయింది. తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, సంగ్రాం అలియాస్ మల్లా రాజిరెడ్డి, నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న సహా 16 మంది ముఖ్యనాయకులు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసుల ముందు లొంగిపోయారనే సమాచారంతో ఆ పార్టీ నిర్మాణాత్మకంగా చివరి ఘడియల్లోకి చేరినట్లేనని భావిస్తున్నారు. ఇంకా లొంగిపోకుండా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లాంటి వారు కూడా లొంగుబాట పట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. లేకుంటే భద్రతబలగాల చేతిలో ఎన్‌కౌంటర్‌లో మృత్యువాతపడక తప్పని స్థితి నెలకొందనే చర్చలు వినిపిస్తున్నాయి.

నంబాల లాంటి ప్రధాన నాయకత్వమే టార్గెట్
మావోయిస్టు పార్టీలోని ప్రధాన నాయకత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ భద్రతాబలగాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనూ పలు మిలటరీ ఆపరేషన్లు నిర్వహించారు. అన్నింటి కంటే ఎక్కువగా గత ఏడాది నుంచి ప్రారంభించిన కగార్ ఆపరేషన్ పూర్తిగా మావోయిస్టు నాయకత్వం, సాయుధ దళాలలే లక్ష్యంగా కొనసాగుతూ వచ్చింది. మావోయిస్టులకు గట్టిపట్టున్న ప్రాంతాల్లోకి సాయుధ బలగాలు చొచ్చుకునిపోయి వారి స్థావరాలు, షెలర్టర్లపై మూకుమ్మడిగా ముప్పేట దాడులు చేశాయి. వేలాది మందితో గంటల కొద్దీ సాగిస్తున్న సాయుధ దాడుల్లో మావోయిస్టుల గెరిల్లా యుద్ధతంత్రం విఫలమై చేతులెత్తేశారు. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో మృతి చెందిన సంఘటనలు ఇప్పటికే అనేకం జరిగాయి. అత్యంత కట్టుదిట్టమైన మూడంచెల భద్రత మధ్య ఉంటారని చెప్పుకునే మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు సైతం తాజా ఎన్ కౌంటర్ల పరంపరలో పిట్టల్లా రాలిపోయిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ చరిత్రలోనే జరుగని విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును సైతం భద్రతబలగాలు మాడ్ ప్రాంతంలోని గండికోట అటవీ ప్రాంతంలో గత ఏడాది మే 21 జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఈ సంఘటనలో బసవరాజుతో పాటు సెంట్రల్ సెక్రటరీ సెక్యూరిటీ, ఆయన టీం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ సంఘటన నక్సలైట్ ఉద్యమ చరిత్రలోనే తీవ్ర సంచలనం సృష్టించగా మావోయిస్టు పార్టీని తీవ్రంగా కలవరపరిచింది. దీంతో పార్టీ నాయకత్వం, కేడర్ బెంబేలెత్తిపోయారు. ఆ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టిందని తాజా పరిణామాలను పరిశీలిస్తే సులభంగా చెప్పవచ్చు. చివరికి బస్వరాజు మృతదేహాన్ని సైతం బంధువులకు అప్పగించకుండా ఛత్తీస్‌గఢ్ పోలీసులే దహనం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో నక్సలైట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చారుమజుందార్ పోలీసుల అదుపులో మృతి చెందారు. ఆ తర్వాత పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన కేజీ సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య బహిరంగ జీవితంలో మృతి చెందారు. ఇక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వయోభారంతో తప్పుకున్న ముప్పాల లక్ష్మణ్ అలియాస్ గణపతి మాత్రం ఇప్పటికీ ఎక్కడో సురక్షితంగా ఉన్నారు.

వరుస ఎన్ కౌంటర్లు. అగ్రనాయకులు మృతి
ఈ మధ్య కాలంలో గణపతి తప్ప మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులంతా లొంగిపోవడమో, ఎన్కౌంటర్‌లో మృత్యువాత పడటమో జరిగింది. ఇటీవల ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు కేంద్ర, రాష్ట్ర ముఖ్యనాయకులు చనిపోయారు. ఒకరో ఇద్దరో జైలులో మిగిలారు. సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో ఉన్నతస్థాయికి చేరిన నాయకులు ఒక్కరొక్కరుగా ఒరిగిపోతున్నారు. ఒరిస్సా రాష్ట్ర ఇంచార్జ్ పాక హన్మంత్ అలియాస్ ఊక గణేష్, ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఒరిస్సా బాధ్యతలు నిర్వహించిన మోడెం బాలకృష్ణ, ఝార్ఖండ్‌లో కీలక నేత వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ, మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగానికి కీలక వ్యక్తిగా బాధ్యతలు నిర్వహించిన హిడ్మా మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించిన రాజు దాదా అలియాస్ కట్టా రాంచంద్రారెడ్డి, కోసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి పోలీసుల చేతిలో ఎన్‌కౌంటరయ్యారు. పార్టీ నేతలు జగ్జిత్ సింగ్ సోహల్, చలపతి, గౌతం, మధు, రూపేష్, కార్తీక్, చైతే, భాస్కర్ తదితరులతో పాటు కేంద్ర, రాష్ట్ర నాయకులు ఎంతో మంది వరుస ఎన్‌కౌంటర్‌లలో అమరులయ్యారు. గడ్చిరోలి, బస్తర్, ఛత్తీస్‌గఢ్, మాడ్… ఒక్కటేమిటి మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పడు నెత్తురుటేర్లు పారుతున్నాయి. పదుల సంఖ్యలో ఆయుధాగారాలు, డెన్లు, డంపులు సాయుధ బలగాలు స్వాధీనం చేసుకుంటున్నారు. దండకారణ్యమంతా నిర్మించిన అమరుల స్థూపాలను కూల్చివేస్తున్నారు. మావోయిస్టుల ఆనవాళ్ళు లేకుండా సాయుధ బలగాలు తుడిచివేస్తున్నాయి.

సంచలనం సృష్టించిన లొంగుబాట
సోనూ అలియాస్ మల్లోజు వేణుగోపాల్, సతీష్ అలియాస్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావు, పుల్లారి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, ఆజాద్‌తోపాటు.. తాజాగా దేవ్‌జీ, సంగ్రామ్‌తోపాటు 16 మంది సహా వందల సంఖ్యలో లొంగిపోయారు. అడవి నుంచి మిలటరీ క్యాంపులకు చేరుకుని పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ లొంగుబాటు పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇందులో సాధారణ పీఎల్‌జీఏ సభ్యుని స్థాయి నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్ వరకు ఉన్నారు. కొందరు సాధారణంగా లొంగిపోతే మరికొందరు తుపాకులతో లొంగిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మావోయిస్టు పార్టీగా ఏర్పడినప్పుడు ఒక్క తెలంగాణ నుంచే 11 మంది కేంద్ర స్థాయి నాయకులుండేవారు. తాజా లొంగుబాటుతో తెలంగాణ నాయకులెవరూ మిగిలి లేరని భావిస్తున్నారు. ఝార్ఖండ్ మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు.
ప్రకంపనం సృష్టించిన సాయుధ పోరాట విరమణ
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు బతికి ఉండగా కగార్ ఆపరేషన్ తీవ్రమైన నేపథ్యంలో ప్రభుత్వంతో వచ్చిన చర్చల ప్రతిపాదన సందర్భంగా ప్రారంభమైన కాల్పుల విరమణ ఆ తర్వాత సాయుధ పోరాట విరమణగా మారి మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. ఆయుధాలతో సహా లొంగిపోవాలని పార్టీ అగ్రనాయకులుగా ఉన్న వేణుగోపాల్, వాసుదేవరావు తెరపైకి తెచ్చిన ప్రతిపాదన ఆ పార్టీ మూలాలను దెబ్బకొట్టిందని భావిస్తున్నారు. పార్టీలో తీవ్రమైన సంక్షోభమే కాకుండా శత్రువు ముప్పేట దాడుల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సందర్భంలో తెరపైకి వచ్చిన సాయుధ పోరాట విరమణ ఆ పార్టీని నిలువునా చీల్చిందని చెప్పవచ్చు. బస్వరాజు బతికుండగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాయుధ పోరాట విరమణ వాదులు చెబుతుండగా… ఇది పార్టీకి ద్రోహం చేయడమేనంటూ మిగిలిన నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత అటు ప్రభుత్వ అణచివేత, ఇటు పోరాట విమరణ నిర్ణయంతో రెండువైపులా జరిగిన ఒత్తిడి ఫలించి లొంగుబాట్లు, అదే సమయంలో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. హిడ్మా లాంటి మిలిటరీ నాయకుడు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడం సంచలనం సృష్టిస్తే, హిడ్మా వారసుడిగా భావించిన బర్సా… తెలంగాణ పోలీసులకు చిక్కి తర్వాత సరెండయ్యారు. ప్రస్తుతానికి వేళ్ళమీద లెక్కగట్టే మంది కూడా పార్టీలో లేరని చెబుతున్నారు. తాజా పరిణామాలతో వారు కూడా లొంగిపోవాల్సిన అనివార్యత ఏర్పడిందంటున్నారు.
ఆ ఇద్దరు నేతల తీరుపై భిన్నాభిప్రాయాలు
వేణుగోపాల్ రావు , వాసుదేవ రావు ఆయుధాలతో లొంగిపోయిన సమయంలో పార్టీ తీవ్రంగా ప్రతిస్పందించింది. అదే స్థాయిలో మావోయిస్టు సానుభూతి పరులుగా ఉన్న పలువురు నాయకులు కూడా విమర్శించారు. పార్టీ ద్రోహులుగా మారారని విమర్శించారు. ఇదే సందర్భంలో మావోయిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను గుర్తించకుండా కొనసాగించే సాయుధ పోరాటం ఆత్మహత్యా సదృశ్యంతో సమానమంటూ సమర్ధించిన వారిలో కొందరు లొంగిపోయిన నాయకులతోపాటు వారి అనుచరులుగా కొనసాగిన వారున్నారు. తాజా పరిణామాలతో పార్టీయే పూర్తిగా తుడిచిపెట్టుకపోయిన పరిస్థితుల్లో చర్చలకు కూడా సోషల్ మీడియా తప్ప వేదికలేకుండా పోయిందంటున్నారు. ఇక మావోయిస్టు పార్టీ అనేది నిర్మాణాత్మకంగా గత చరిత్రయే అంటున్నారు. మావోయిస్టు భావజాలాన్ని పూర్తిగా ఎవరూ తుడిచిపెట్టకపోయినప్పటికీ ప్రస్తుతానికి నిర్మాణమనేది జీరోగా మారిందని చెప్పవచ్చు. సాయుధ పోరాటాన్ని విరమించినప్పటికీ దేశపరిస్థితుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా నూతన పార్టీ నిర్మాణం చేస్తామనే విధంగా లొంగిపోయిన కొందరు నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram