Maoist Mukt Bharat | మావోయిస్టు ముక్త్ భారత్… నేటితో ముగియనున్న డెడ్‌లైన్
దేశంలో మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన కగార్ కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైనట్లేనా!? మావోయిస్టుల నిర్మూలనకు 2026, మార్చి 31 తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించి, సాయుధ మావోయిస్టుల పేరే లేకుండా ప్రత్యేకంగా చేపట్టిన అష్టదిగ్బంధ వ్యూహం అనుకున్న ఫలితాన్ని సాధించినట్లేనా? స్థూలంగా కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
- ఉనికి కోల్పోయిన మావోయిస్టు పార్టీ
- ఎన్‌కౌంటర్లలో అగ్ర నాయకత్వం మృతి
- కేంద్ర ముఖ్య నాయకులు లొంగుబాట
- వందల సంఖ్యలో ఆయుధాలు అప్పగింత
- గణపతి కోసం నిఘా వర్గాల వెదుకులాట
- కేంద్రంలక్ష్యం నెరవేరినట్లేనా!?
Maoist Mukt Bharat | విధాత, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన కగార్ కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైనట్లేనా!? మావోయిస్టుల నిర్మూలనకు 2026, మార్చి 31 తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించి, సాయుధ మావోయిస్టుల పేరే లేకుండా ప్రత్యేకంగా చేపట్టిన అష్టదిగ్బంధ వ్యూహం అనుకున్న ఫలితాన్ని సాధించినట్లేనా? స్థూలంగా కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మావోయిస్టు రహిత భారత్ విజయాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుందనే చర్చ సాగుతోంది.

లక్ష్య ఛేదనలో సక్సెస్
మావోయిస్టులు దేశాన్ని అస్థిరత్వానికి గురిచేస్తున్నారని, ఆయుధాలు చేతబట్టి సార్వభౌమాధికారాన్ని నిలదీస్తున్నారని, మధ్య భారతంలోని అడవులను ఆశ్రయంగా మార్చుకుని హింసను ప్రేరేపిస్తున్నారని వరుస ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. మావోయిస్టులను టార్గెట్ చేయడం పరిపాటిగా మార్చుకున్నాయి. ఒక అడుగు ముందుకేసిన బీజేపీ ప్రభుత్వం.. ఒక్కో ప్రణాళికను అమలు చేస్తూ ఆఖరున ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై యుద్ధాన్ని ప్రకటించింది. మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అన్నట్టుగానే వ్యూహాత్మకంగా పై చేయి సాధించడమే కాకుండా పట్టు బిగించి మావోయిస్టులకు ఊపిరిసలపకుండా చేసి తాము అనుకున్న లక్ష్యాన్ని అధిగమించారు. ముందుగా ప్రభుత్వం చేపట్టిన కగార్ సాయుధ దాడుల్లో అగ్రనాయకత్వం అసువులు బాస్తూ వచ్చింది. ముఖ్యంగా ఆపార్టీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్ కౌంటర్, తర్వాత ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది. ఈ దశలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, వికేక్ ,ఉదయ్, మోడం బాలకృష్ణ, రాష్ట్ర నాయకులు శర్మ, గౌంతం, మధు, జయ, రూపేష్ నీతి, కార్దిక్, చైతే, సత్యం, గుడ్డు, అలోక్, పాపన్న, భాస్కర్, జగన్, ఆరుణ, విజయ్ అమరులయ్యారు. వీరితో పాటు వందల సంఖ్యలో కేడర్ , నాయకులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.

అంతర్గత విభేదాలు బహిర్గతం
మావోయిస్టు పార్టీ నాయకత్వంలో కోఆర్డినేషన్ లేకపోవడంతో పాటు అప్పటికే అంతర్గతంగా మావోయిస్టు పార్టీ కేంద్రం నాయకత్వంలోని కొందరు ముఖ్యనేతల్లో నెలకొన్న విభేదాలు పార్టీని పూర్తిగా దెబ్బతీశాయి. కనీసం ఏం చేయాలనేది కూడా ఆలోచించుకునే అవకాశం లేని పరిస్థితి ప్రభుత్వం సాయుధ బలగాలు సృష్టించగా ఇదే సమయంలో ముఖ్యనాయకులు శాంతి చర్చల నుంచి సాయుధ పోరాట విరమణ అంటూ మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపెల్లి వాసుదేవరావు ‘ ఆయుధాలతో లొంగిపోవడంతో నాయకులు, కేడర్ కు మరణమో? లొంగిపోవడమో? అనే రెండే మార్గాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనూ హిడ్మా, ఖాతా రామచంద్రారెడ్డి, కోసా, పాక హన్మంతు, మాంఝీ లాంటి ముఖ్యనాయకులను టార్గెట్ చేసి వెంటాడి వేటాడంతో ఎన్ కౌంటర్లలో మృతి చెందారు. మృతి చెందిన వారు పోగా ఈ దశలో ఒకరి వెంట ఒకరు పెద్ద సంఖ్యలో చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వం ముందు లొంగిపోతూ వచ్చారు.

పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, పుల్లారి ప్రసాద్, తాజాగా పాపారావు, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి, సుజాత, నవత, తాజాగా నారాయణతో పాటు పీఎల్జీఎ, దండకారణ్య నాయకులు బార్స్ దేవ్, వందల కొద్దీ నాయకులు, కేడర్ లొంగుబాటు పట్టారు. ఆయుధాలు, డబ్బులతో లొంగిపోయారు. దాదాపు దండకారణ్యమంతా ఖాళీ అయింది. మార్చి 30 నాటికి దాదాపు ప్రధాన నాయకత్వమంతా చనిపోవడమో? లొంగిపోవడమో? జరిగింది. మిగిలిన వారిలో ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, ఝార్ఖండ్ లో కొందరు మాత్రమే మిగిలి ఉన్నారు. గణపతి కూడా పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న గణపతి ఆచూకిని కనిపెట్టినట్లు చెబుతున్నారు.
సర్కారును సవాల్ చేసిన మావోయిస్టులు
దేశంలోని 17 రాష్ట్రాల్లో విస్తరించి మధ్యభారతంలోని దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టు పార్టీ కొన్నేళ్ళపాటు ప్రత్యామ్నాయ జనతన సర్కారును నిర్వహించి ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. నిత్యం దేశంలోని ఎక్కడో ఒక చోట మావోయిస్టులు పోలీసుల మధ్య ఎన్ కౌంటర్లు జరుగుతూ వచ్చేవి. ముఖ్యంగా చత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు పెట్టని కోటలా కొనసాగాయి. సాయుధ దళాల స్థాయి నుంచి పీపుల్స్ గెరిల్లా ఆర్మీస్థాయికి చేరిన మావోయిస్టు ఉద్యమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారాయి. ముఖ్యంగా మధ్య భారతంలో విస్తారంగా ఉన్న ఖనిజసంపదను వెలికి తీయాలంటే మావోయిస్టులు, ఆదివాసీ, గిరిజనులు అడ్డుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అడవి పై, ఆదివాసీ గూడేలాపై, అక్కడ ఉన్న భూ గర్భ సంపదపై పెత్తనం సాధించాలంటే కోటగోడలా ఉన్న మావోయిస్టులను నిర్మూలించకతప్పని పరిస్థితి నెలకొంది.
అష్టదిగ్బంధం చేసిన బీజేపీ సర్కార్
మావోయిస్టులు, నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయి. భారీ పోలీసు బలగాల కేటాయింపు, సాయుధ దళాల బెటాలియన్ ల ఏర్పాటు, నక్సలైట్లను నిర్మూలించేందుకు గ్రేహౌండ్స్, డీఆర్జీ, పత్ర్యేక పోలీసు, సాయుధ దళాలు, చివరిక బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ లాంటి సరిహద్దు భద్రతా దళాలను లక్షల సంఖ్యలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దించి నిత్యం కూంబింగులతో అడవిని జల్లెడ పట్టారు. మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బకొట్టేందుకు సల్వాజుడుం లాంటి సంస్థలను ప్రయోగించారు.
నిత్యం పల్లెలు, ఆదివాసీ గూడేలు, కొండలు, గుట్టలు, నీటితావులు, నదీ తీర ప్రాంతాలు ఒక్కటేమిటి నక్సలైట్లు తిరిగే ప్రతీ ప్రాంతం పై ఆధునిక ఆయుధాలు, నూతన సాంకేతిక పరిజ్క్షానాన్ని, హెలికాప్టర్లు ఇతరత్రా యుద్ధ పరికరాలను వినియోగించి ఒక యుద్ధాన్నే కొనసాగించారు. పోలీసు దాడులు, ఎనకౌంటర్లకు వ్యతిరేకంగా మావోయిస్టులు కూడా పోలీసుల పై దాడులు చేసి మట్టుపెట్టడం, ఇన్ఫార్మర్లను హత్యచేయడంతో, మందు పాతర్ల, క్లైమోర్లు, ఎల్ ఈడీ బాంబుల మోతలతో మధ్యభారతమంతా నిత్యం తుపాకి నీడన కొనసాగుతూ వచ్చింది.

ఊపిరి సలపనియ్యని కగార్ యుద్ధం
కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలనకు అనేక ఆపరేషన్ లు నిర్వహించినప్పటికీ గ్రీన్ హంట్ ఆ తర్వాత కగార్ పేరుతో సాగించిన యుద్ధంలో మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డారు. కర్రెగుట్టలలాంటి మావోయిస్టు షెల్టర్ లపై 21 రోజుల యుద్ధం చేశారంటే పరిస్థితి ఎంత భయకరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. దెబ్బ మీద దెబ్బతో ముఖ్యంగా గత ఎండాకాలం నుంచి చేపట్టిన ఒక్కో ఆపరేషన్ యుద్ధాన్ని తలపించింది. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం ముఖ్యంగా కేంద్ర కమిటీ నాయకత్వం లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్లు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి.
రోజుల కొద్దీ సాగిన ఎన్ కౌంటర్లలో ముఖ్యనాయకత్వాన్ని మట్టుబెడుతూ మావోయిస్టు పార్టీ నాయకత్వ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టిందని భావిస్తున్నారు. దీని నుంచి కోలుకోలేని మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగుబాట పట్టారు. కొందరు సర్కారు తుపాకులకు బలయ్యారు. మొత్తంగా ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని భౌతికంగా నిర్మూలించడంలో ప్రస్తుతానికి సక్సెస్ అయ్యిందనే భావిస్తున్నారు. మావోయిస్టు సిద్ధాంతం జీవించే ఉంటుందనే వాదనకు ప్రస్తుతానికి ప్రాధాన్యం లేదు.
Read More:
DGP Shivadhar Reddy | ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టులు లొంగిపోండి.. డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram