• Telugu News
  • /National

వచ్చేవారం కేంద్ర క్యాబినెట్ విస్తరణ! ధర్మేంద్ర, బండి సంజయ్, పురి ఇంటికేనా?

వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు ముందే కేంద్ర క్యాబినెట్‌ను విస్తరిస్తారన్న చర్చలు ఢిల్లీలో జోరందుకున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ను, పెట్రోల్‌ సంక్షోభం నేపథ్యంలో పురిని తప్పిస్తారని చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో కుమారుడి పోస్కో కేసుతో చిక్కుల్లో పడ్డ బండి సంజయ్‌ను కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఆర్థిక మంత్రిగా ఆర్బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ను నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది.

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Edited by: విధాత భారత్ డెస్క్ | Jun 26, 2026, 8:22 pm IST
Read Time: 22 mins
వచ్చేవారం కేంద్ర క్యాబినెట్ విస్తరణ! ధర్మేంద్ర, బండి సంజయ్, పురి ఇంటికేనా?

హైలైట్స్:

  • ఆర్థిక శాఖ మంత్రిగా శక్తికాంతదాస్..
  • విద్యాశాఖకు మారనున్న నిర్మల..
  • డీకే అరుణకు కలిసిరానున్న మహిళా కోటా!
  • ఢిల్లీ మీడియాలో ఊహాగానాలు..

విధాత, హైదరాబాద్:

త్వరలో కేంద్రమంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పూర్తి చేశారని ఢిల్లీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న వారితోపాటు పనితీరు సరిగా లేని వారిని తప్పించి సమర్థులకు అవకాశాలు కల్పించనున్నారని సమాచారం. జూలై 21 లేదా 27వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూలు ప్రకటించనున్న నేపథ్యంలో అంతకు ముందే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం కూడా క్యాబినెట్ విస్తరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విస్తరణలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కీలక శాఖ అప్పగిస్తారన్న చర్చలు సాగుతున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుని ఆర్థిక శాఖను అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. నీట్ నిర్వహణలో విఫలం అయిన ధర్మేంద్ర ప్రధాన్, కుమారుడి ఫోక్సో కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్, ఇంధన నిర్వహణలో విఫలం అయిన హర్దీప్ సింగ్ పురిలను ఇంటికి పంపిస్తారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. మహారాష్ట్ర శివసేన (ఉద్ధవ్‌)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఎన్డీఏలో చేరడంతో వారికి బెర్త్ ఖరారు కానున్నదని సమాచారం.

రాష్ట్రపతితో అమిత్‌షా భేటీ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చర్చకు వచ్చిందని ఢిల్లీలోని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. తేదీ సమయం తెలియచేస్తే ముహూర్తం ఖరారు చేస్తామని రాష్ట్రపతికి అమిత్ షా వివరించారని ఆ వర్గాల కథనం. అమిత్ షా కలవడానికి రెండు రోజుల ముందు ప్రధాని మోదీ సైతం రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రివర్గ విస్తరణకు ఇది కీలక సంకేతమని ఢిల్లీలోని పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో కేంద్ర సహాయ మంత్రి జార్జ్‌ కురియన్‌.. తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ముర్మును షా కలిసిన తరువాత ఆయన రాజీనామా సమర్పించడం గమనార్హం. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నది. వాస్తవానికి జూన్ నెల ప్రారంభంలో పూర్తి కావాల్సి ఉండగా పలు సమీకరణలు, ఇతర పార్టీల నుంచి ఎన్డీఏలోకి చేరికల మూలంగా నిలిచిపోయిందని చెబుతున్నారు. శివసేనతో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతు పలికారు. దీంతో రాజ్యసభలో, లోక్‌సభలో ఎన్డీఏకు బలం పెరిగి, బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం అయ్యింది. తమిళనాడు ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని విస్మరించడంతో కాంగ్రెస్‌కు డీఎంకే గుడ్ బై చెప్పింది. కేంద్రానికి అంశాలవారీగా మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మున్ముందు కీలకమైన బిల్లుల ఆమోదానికి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడేందుకు బీజేపీ అధినేతలు భారీ ప్రణాళికల్లోనే ఉన్నారని తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా నీట్ మలివిడత పరీక్ష ముగియడం, పార్టీలో చేరికలు కూడా దాదాపు పూర్తికావడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా మంత్రి మండలి విస్తరణపై దృష్టి పెట్టారని సమాచారం. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌, పంజాబ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుండగా, పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉంది. పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎంపీలు ఇప్పటికే జెండా ఎత్తేసి బీజేపీలో చేరిపోయారు. పంజాబ్ నుంచి ఒకరు లేదా ఇద్దరికి క్యాబినెట్‌లో స్థానం కల్పిస్తారన్న చర్చలు సాగుతున్నాయి. రాఘవ్ ఛద్దా, అశోక్ మిట్టల్ (లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అధినేత)లలో ఒకరికి లేదా ఇద్దరికీ పదవి దక్కే చాన్స్‌ ఉందనేది ఆ చర్చల సారాంశం.

ఛుగ్‌కు బెర్త్‌?

అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీల నుంచి మద్దతు సమీకరించేందుకు ఆ వర్గానికి చెందిన తరుణ్ ఛుగ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆయన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండటంతోపాటు.. ఆర్ఎస్ఎస్ సంపూర్ణ మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. ఆప్ ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఇంత వరకు పంజాబ్ ఎస్సీ కమిషన్‌ను నియమించలేదని, ఒక్క ఎస్సీ నాయకుడిని కూడా రాజ్యసభకు పంపించకుండా ఆప్ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ నాటకాలు ఆడుతున్నారని చుగ్ గతంలో ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గం నుంచి సీఎంను ఎంపిక చేస్తామని ఆయన ప్రకటించినా అధికారంలోకి రాలేదు. రానున్న ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ఛుగ్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోనున్నట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

టీవీ రాముడికి మంత్రి పదవి?

ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్‌కు కేంద్ర క్యాబినెట్‌లో బెర్త్‌ దక్కుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని తప్పించి.. ఆ బాధ్యతల్లో గోవిల్‌ను కూర్చోబెడతారని సమాచారం. రామాయణ్ టీవీ సీరియల్‌లో అరుణ్.. రాముడిగా నటించి ప్రజలకు దగ్గరైన విషయం తెలిసిందే. హిందూ ఓటర్లను పూర్తిగా తమవైపు తిప్పుకొనే లక్ష్యంలో భాగంగా అరుణ్‌కు స్థానం కల్పిస్తారని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

నితీశ్‌కు వ్యవసాయం లేదా రైల్వే?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కేంద్ర మంత్రి మండలిలో స్థానం కల్పించడం దాదాపు ఖరారు అయ్యిందని సమాచారం. మిత్రధర్మం పాటించి, తన పదవిని త్యాగం చేసిన ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారని భావిస్తున్నారు. రైల్వే లేదా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆయన కోరుతున్నారని సమాచారం. మహారాష్ట్రంలో శివసేన (యూబీటీ) నుంచి బయటకు వచ్చి ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన ఆరుగురు సభ్యులకు నాయకత్వం వహించిన సంజయ్ దినా పాటిల్‌కు సహాయ మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. శివసేన ఎంపీ ప్రతాప్ రావు జాదవ్ ప్రస్తుతం ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. ఈ శాఖను పాటిల్‌కు అప్పగించి, జాదవ్‌ను ఆయూష్ శాఖకు పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు విష్ణుదత్తు శర్మను తీసుకోనున్నారని సమాచారం. మహారాజ్ గంజ్ ఎంపీ జనార్దన్ సింగ్‌ను కూడా క్యాబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తున్నది. రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన ఈయనను తీసుకోవడం ద్వారా మరింతగా బలపడాలనే యోచనకు అధిష్ఠానం వచ్చిందని సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీపూర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ రెండోసారి ప్రధాని అయిన తరువాత 2021 నుంచి 2024 వరకు సమాచార, ప్రసార శాఖ, యువజన సర్వీసుల మంత్రిగా, ఆ తరువాత ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. మూడో విడతలో ఆయనకు క్యాబినెట్‌ బెర్త్ లభించలేదు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2022 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా సుఖ్విందర్ సింగ్ సీఎం అయ్యారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో మరోసారి పాగా వేసేందుకు ఇప్పటినుంచే బీజేపీ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఠాగూర్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటారనే చర్చలు సాగుతున్నాయి.

తెలంగాణ నుంచి లక్ష్మణ్, అరుణలకు అవకాశం?

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు చర్చించుకుంటున్నారు. సంజయ్‌ను తప్పిస్తే ఆయన కులానికే చెందిన లక్ష్మణ్‌కు ఇవ్వవచ్చని సమాచారం. మహిళా కోటా బిల్లుపై బీజేపీ పట్టుదలగా ఉండటం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కలిసి వస్తుందంటున్నారు. మహిళా కోటాలో ఆమెకు మంత్రి పదవి ఖాయమని అభిమనులు చెప్పుకొంటున్నారు. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ తమవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి. ముదిరాజ్ కులం ఓట్లు అధికంగా ఉండడంతో వారిని బీజేపీ వైపునకు తిప్పుకొనేందుకు ఈటలకు క్యాబినెట్‌లో చోటు కల్పించే పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.

శాఖల మార్పు…

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆర్థిక శాఖ నుంచి ఇతర శాఖ నుంచి తప్పిస్తారని ఢిల్లీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న హర్యానాకు చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి విద్యుత్ శాఖను తొలగించి మరొకరికి అప్పగించే సూచనలున్నాయి. వయస్సు రీత్యా మనోహర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించి, ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపించే ఆలోచనలో ప్రధాని ఉన్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. అయితే మనోహర్ మొదటి నుంచి మోదీకి సన్నిహితంగా ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందుగా, ఇద్దరూ కలిసి ఢిల్లీలో మోటర్ సైకిల్‌పై ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్నేహంతోనే ఆయనను హర్యానా ముఖ్యమంత్రిగా, ఆ తరువాత కేంద్ర మంత్రిగా నియమించారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఆర్థిక స్థిరత్వం కోసం నిర్మలా సీతారామన్‌ను తప్పించి, ఆ బాధ్యతలను ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అప్పగించాలనే గట్టి నిర్ణయం మోదీ తీసుకున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాస్ ప్రస్తుతం మోదీ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. నేరుగా క్యాబినెట్‌లోకి తీసుకుని ఆర్థిక శాఖ అప్పగించాలని మోదీ నిర్ణయించడంతో, నిర్మలా సీతారామన్‌ను విద్యాశాఖకు పంపించే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాశాఖను ధర్మేంద్ర ప్రధాన్ నిర్వర్తిస్తున్నారు.

ప్రధాన్, పూరీ, సంజయ్ లు ఇంటికేనా…

నీట్ 2026 పేపర్ లీకేజీతో పాటు సీబీఎస్ఈ 12వ తరగతి పేపర్ల మూల్యాంకనంలో తీవ్రమైన ఆరోపణలు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎదుర్కొంటున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ మూలంగా 22 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురైన విషయం తెలిసిందే. 12వ తరగతి చదువుతున్న 12 లక్షల మంది సీబీఎస్ఈ విద్యార్థులు పరీక్షలు రాయగా, తప్పులు దొర్లాయని ప్రధాన్ బహిరంగంగా అంగీకరించారు. ఈ తప్పులకు తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు తప్పిదాలు, బాధ్యతారాహిత్యాన్ని మోదీ సీరియస్‌గా తీసుకున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. విద్యార్థులతో ముడిపడి ఉన్న అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. ఈ మరక నుంచి బయట పడేందుకు ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇంటికి పంపించాలని నిర్ణయించారని అంటున్నారు. అయితే.. ప్రధాన్‌ను తప్పిస్తే.. జరిగిన తప్పిదాన్ని అంగీకరించినట్టు అవుతుంది. ఆయన రాజీనామాకు జెన్‌ జీ చేసిన డిమాండ్‌కు తలొగ్గినట్టు అవుతుంది. అది మోదీ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

బండి ఇంటికేనా?

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో తప్పని పరిస్థితుల్లో పోక్సో కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో సంజయ్‌కు రాజకీయంగా చిక్కులు మొదలయ్యాయి. ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించాలనే డిమాండ్లు ఇప్పటికీ ఉన్నాయి. విమర్శలను పెడచెవిన పెట్టి సంజయ్‌ను మంత్రిగా కొనసాగిస్తే రాష్ట్రంలో పార్టీకి మరింత చెడ్డ పేరు వస్తుందనే ఒత్తిడి కూడా కాషాయం పెద్దలపై ఉందని అంటున్నారు. ఆ మరక పార్టీకి అంటుకోకుండా ఉండేందుకు, విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు సంజయ్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించవచ్చని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్రంలో ఐఎఫ్ఎస్ అధికారిగా వివిధ పదవులు నిర్వర్తించిన హర్దీప్ సింగ్ పురి.. 2014లో బీజేపీలో చేరారు. 2019 నుంచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వయస్సు ఏడు పదులు దాటడం, పెట్రోలియం శాఖ నిర్వహణలో విఫలం కావడంతో తప్పిస్తారని బీజేపీ పెద్దలే అంగీకరిస్తున్నారు. పంజాబ్ నుంచి ఆప్ సభ్యులకు ప్రాతినిధ్యం కల్పిస్తుండటంతో ఈయనను క్యాబినెట్ నుంచి ఇంటికి పంపించక తప్పడం లేదని అంటున్నారు.