• Telugu News
  • /National

డీలిమిటేషన్ బిల్లుకు నో చెప్పిన రాహుల్..స్పెషల్ సెషన్ కు కేంద్రం ప్లాన్ !

డీలిమిటేషన్ బిల్లుకు కాంగ్రెస్ నో చెప్పడంతో కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై దృష్టి పెట్టింది. రాహుల్-రిజిజు భేటీ తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 05, 2026, 5:44 pm IST
Read Time: 4 mins
డీలిమిటేషన్ బిల్లుకు నో చెప్పిన రాహుల్..స్పెషల్ సెషన్ కు కేంద్రం ప్లాన్ !

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాల నిరసనలో వాయిదా పర్వంగా మారిపోతున్నాయి. దీంతో సభలో నెలకొన్న ప్రతిష్టంభనలు తొలగించడంతో పాటు కీలక బిల్లుల ఆమోదం దిశగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రయత్నాలు చేపట్టారు. బుధవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ప్రతిపక్షాల నినాదాల మధ్య సభ వాయిదా పడింది. ఆ వెంటనే కిరణ్ రిజిజు తన ఛాంబర్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని అభ్యర్థించారు. ప్రస్తుత సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులపై కాంగ్రెస్ సహకారాన్ని కోరారు. అయితే ప్రభుత్వ అభ్యర్థనను రాహుల్‌ తిరస్కరించారు.

నీట్ పేపర్ లీకేజీపై విద్యార్ధుల నిరసన సందర్భంగా పోలీసుల చర్యపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన వెలువడేవరకు సభలో కార్యకలాపాలను అడ్డుకుంటామని, అలాగే రామమందిరం విరాళాల చోరీపై కూడా ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని కలిసిన అనంతరం పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు కిరణ్ రిజిజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రితో సమావేశమయ్యారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి. దీంతో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుల ఆమోదం కోసం ఆగస్టు 16 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

నిజానికి తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి ఎంపీల ఫిరాయింపుల నేపథ్యంలో ఉభయ సభలలో మారిన సంఖ్యాబలాన్ని ఉపయోగించుకుని, గత సమావేశాల్లో ఆమోదం పొందలేకపోయిన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులన ఈ సమావేశాల్లో ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వ ప్రణాళికను ప్రతిపక్షం అడ్డుకోవడంతో ఇప్పటిదాకా ఆ బిల్లులపై ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లయ్యింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ద్వారానైన ఆ బిల్లులను ఆమోదింపచేయాలని కేంద్రం పట్టుదలతో చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు సఫలీకృతమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.