• Telugu News
  • /National

కృతి సనన్ కు రాహుల్ మద్దతు..కంగనా కౌంటర్

రక్షా బంధన్ సందర్బంగా ఓ జ్యువెలరీ కంపెనీ యాడ్ లో బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ధరించిన దుస్తుల వ్యవహారం సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి విస్తరించి రచ్చ రేపుతుంది. రాఖీ కట్టే సందర్బంతో కృతి సనన్ ధరించిన దుస్తులను నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తప్పుబట్టగా.. ఈ వివాదంలో కృతికి రాహుల్ గాంధీకి మద్దతు తెలుపగా..కంగనా ఆయనకు కూడా కౌంటర్ ఇచ్చారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 26, 2026, 12:56 pm IST
Read Time: 9 mins
కృతి సనన్ కు రాహుల్ మద్దతు..కంగనా కౌంటర్

రక్షా బంధన్ సందర్బంగా ఓ జ్యువెలరీ కంపెనీ యాడ్ లో బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ధరించిన దుస్తుల వ్యవహారం సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి విస్తరించి రచ్చ రేపుతుంది. రాఖీ కట్టే సందర్బంతో కృతి సనన్ ధరించిన దుస్తులను నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తప్పుబట్టగా.. ఎలాంటి డ్రెస్‌ వేసుకోవాలో మహిళలకు చెప్పడాన్ని ఎప్పుడు ఆపుతారని కృతి ప్రశ్నించారు. దీంతో ఇరువురి వ్యాఖ్యలను సమర్ధించేవారి, వ్యతిరేకించే వారి విమర్శలతో  సోషల్‌ మీడియా వేడెక్కింది. ఆ యాడ్ లో కృతి సనన్‌.. బ్రాలెట్‌-స్కర్ట్, కేప్‌తో కూడిన ఇండో వెస్ట్రన్‌ దుస్తుల్లో కనిపించారు. సోదరుడికి, పెంపుడు శునకానికి రాఖీ కట్టారు. రాఖీ కట్టే సందర్బంలో కృతి సనన్‌ దుస్తులు వికారంగా ఉన్నాయని కంగన వ్యాఖ్యానించారు.

 కంగానా ఏమన్నారంటే..

సంప్రదాయ భారతీయ పండగకు అలాంటి దుస్తులు ఎలా వేసుకుంటారని కంగనా  మండిపడ్డారు.  ‘మహిళగా ఉండటానికి ఇది అద్భుత సమయం. మన అల్మారాలు రకరకాల దుస్తులతో నిండి ఉన్నాయి. ప్రస్తుతం మహిళలు ప్రపంచ మహిళలుగా ఉంటున్నారు. వారికి కాక్‌టెయిల్‌ డ్రెస్‌ల నుంచి లెహెంగా చోళీల వరకూ.. జీన్స్‌ నుంచి చీరల వరకూ.. బికినీల నుంచి సల్వార్‌ కమీజ్‌ల వరకూ ఉంటున్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్నప్పుడు సోదరుడికి రాఖీ కట్టే సమయంలో లోదుస్తులు, బికినీలే వేసుకోవాలా.. మిగిలిన మీ స్టైలింగ్‌ ఆప్షన్లన్నీ ఎక్కడ ఉన్నాయి. ఈ యాడ్‌ ఉద్దేశపూర్వకంగా భయపెట్టేలా ఉంది అని కంగనా వ్యాఖ్యానించారు. కంగనా వ్యాఖ్యలకు మద్దతుగా పలువురు సామాజిక మాధ్యమాల్లో కృతి సనన్‌ దుస్తులపై విమర్శలు చేశారు.

కృతి సనన్  స్పందన..

తనపై వచ్చిన విమర్శలపై కృతి సనన్ స్పందించారు.  శ‌తాబ్ధాలుగా స్త్రీలు ధ‌రించే దుస్తుల్లో మార్పులు జ‌రిగాయ‌ని, కానీ మ‌హిళ‌కు గౌర‌వం అనేది ఆమె వేసుకునే దుస్తుల‌పై ఇంకా ఆధార‌ప‌డుతోంద‌ని  అన్నారు. సంస్కృతి, సంప్ర‌దాయం అనేది గుండెల్లో ఉంటాయ‌ని, నెక్‌లైన్‌లో కాద‌ని కీర్తి అన్నారు. ఆడ‌వాళ్లు ఏ దుస్తులు వేసుకోవాలో చెప్ప‌డం ఇంకెప్పుడు ఆపేస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కృతి తాజాగా ఈ టాపిక్‌పై స్పందించారు. పండుగ‌ల్లోని ఆంత‌ర్యం దుస్తులు ధ‌రించ‌డంలో లేద‌ని, కానీ భావోద్వేగాలు, సంప్ర‌దాయాల్లో ఆ మ‌ర్మం ఉంటుంద‌న్నారు. రక్షాబంధ‌నం అనేది ఓ ర‌క్ష‌ణ బంధం అని, మా చెల్లిలి, నేను కూడా రాఖీ క‌ట్టుకుంటామ‌ని, సోద‌రుడు లేకున్నా త‌మ‌ను తాము ర‌క్షించుకుంటామ‌న్న సంకేతం ఇస్తుంద‌ని, ఇద్ద‌రం ఒక‌రి సంతోషం, ఆరోగ్యం కోసం ప్రార్థ‌న చేస్తామ‌ని, ఇది ప్ర‌తి ఫ్యామిలీలో ఉంటుంద‌ని కృతి అన్నారు. ఇది మా ఇంట్లో కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవీ కూడా మా కుటుంబంలో సభ్యులే కదా’ అని కృతి రాసుకొచ్చింది.

రాహుల్ గాంధీ ఎంట్రీతో రాజకీయ రంగు..

రక్షా బంధన్ యాడ్ లో కృతి  సనన్ ధరించిన దుస్తుల వివాదంపై కంగానా, కృతిల మాటల యుద్దంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంట్రీ ఇవ్వడంతో వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. కృతి పోస్టును షేర్ చేసిన రాహుల్ గాంధీ, “ఒక మహిళ ఏం ధరించాలి? ఎక్కడికి వెళ్లాలి? అనేది ఆమె ఇష్టం. వారి స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు ట్రోల్ చేయడం ఆపండి” అని పేర్కొంటూ ‘పితృస్వామ్యాన్ని కూల్చివేయండి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

బ్రో.. ఆగు: రాహుల్‌ గాంధీకి కంగనా కౌంటర్‌

రక్షాబంధన్ జ్యువెలరీ యాడ్ లో నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై నెలకొన్న వివాదంపై రాహుల్ స్పందిస్తూ..’పితృస్వామ్యాన్ని కూల్చివేయండి’ అన్న వ్యాఖ్యలపై ఎంనీ కంగనా రనౌత్ మండిపడ్డారు. పితృస్వామ్యాన్ని కూల్చివేయండి’ అన్న ఆయన పిలుపును నేరుగా ప్రస్తావిస్తూ, “బ్రో, ఆగు. భారత్ మాతా కీ జై. షురూ కర్తే హై,” అని రనౌత్ స్పందించారు. బీజేపీ చేసిన ఓ పోస్టును షేర్ చేస్తూ, “బ్రో, వెయిట్.. భారత్ మాతా కీ జై. మొదలు పెడదాం” అని కౌంటర్ ఇచ్చారు. ఆ పోస్టులో ట్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్ బిల్లు, షా బానో కేసు, కర్ణాటక కేబినెట్‌లో మహిళా మంత్రులు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ మహిళల హక్కులపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ ప్రశ్నించింది. దీంతో, ఓ యాడ్‌తో మొదలైన వివాదం కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది.

వారిని వదలని కంగనా…

రక్షా బంధన్ యాడ్ లో నటించిన కృతి సనన్  ధరించిన దుస్తులపై మండిపడిన కంగనా రనౌత్ నటినటులు తాప్సీ పన్నూ, అశుతోష్‌ రాణా, రాఖీ సావంత్, సోనూ సూద్‌లు తనపై చేసిన విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు. ‘అలాంటి వారిని రోజూ చూస్తూ ఉంటానని, నేను కుక్కలా మొరుగుతానని అనే అశుతోష్‌ రాణాను, ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలనే సోనూ సూద్‌ను, అన్ని రకాల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే రాఖీ సావంత్‌ను, నా తల్లిదండ్రులను అవమానించే తాప్సీ పన్నూను చూస్తూ ఉంటానని.. ఇలాంటి వారికి నేనిచ్చే సందేశం ఒక్కటేనని.. నేను సాధించిన దాంట్లో ఒక శాతమైనా మీరు సాధించలేదు. అలాంటి మీ నుంచి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని కంగనా స్పష్టం చేశారు. దీనిపై తాప్సీ స్పందించారు. తమ ఇద్దరినీ మీడియా ప్రశ్నలు అడగడం మానేస్తే వివాదం ముగిసిపోతుంది కదా అని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని చూసి మీరంతా ఆనందిస్తున్నట్లున్నారని వ్యాఖ్యానించారు.