కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయిన నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం వేచిచూసే ధోరణి అవలంభించిన ఉద్యోగ సంఘాలు..ఇక ప్రభుత్వంపై మహా పోరాటానికి సిద్దమయ్యాయి. పీఆర్సీ అమలు, పెండింగ్ లో ఆరు డీఏల విడుదల, సీపీఎస్ రద్దు-ఓపీఎస్ పునరుద్దరణ, పెండింగ్ బిల్లుల మంజూరు, హెల్త్ కార్డుల అమలు తదితర డిమాండ్ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(TGEJAC) పిలుపు మేరకు 15 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఈ నెల 27నుంచి దశల వారి ఉద్యమించబోతున్నారు. టీజీఈ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆర్థిక కార్యదర్శి కస్తూరి వెంకట్ ఉద్యమ కార్యాచరణను మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్, ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షర్ల జాయింగ్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ సందర్బంగా కస్తూరి వెంకట్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు కీలక పాత్ర పోషించారని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న మన సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటం బాధాకరం అని గుర్తు చేశారు. ప్రభుత్వ హామీలు, మా డిమాండ్లను ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా, వినతిపత్రాలు సమర్పించినా, చర్చలు జరిపినా అనేక న్యాయమైన డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదు అని తెలిపారు. అందుకే హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని స్పష్టం చేశారు.
మూడు దశల్లో ఉద్యమం..
ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 27 గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, సెప్టెంబర్ 1న జిల్లా కేంద్రాల్లో పెన్షన్ విద్రోహ దినం నిరసన కార్యక్రమాలు, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ మహా ధర్నా నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యోగుల ఐక్యతను చాటాలని, మన ఐక్యతనే మన హక్కుల సాధన మార్గం అని పిలుపునిచ్చారు.
ఉద్యోగులు లేవనెత్తుతున్న డిమాండ్లు..
1. రెండో పీఆర్సీ (PRC) అమలులో తీవ్ర జాప్యం
ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన రెండో పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా నూతన వేతన స్కేల్స్ ఇప్పటికీ అమలు కాలేదు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం మధ్య ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2. పెండింగ్ 6 డీఏలు (DAలు) విడుదల కాకపోవడం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావలసిన అనేక డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ కాలంలో 6 డీఏలు విడుదల కాకపోవడం కుటుంబాలపై అదనపు భారం మోపుతోంది.
3. CPS రద్దు – OPS పునరుద్ధరణ
ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ అత్యవసరం. CPS కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
4. పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్
వేల కోట్ల రూపాయల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ హక్కైన బెనిఫిట్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.
5. హెల్త్ కార్డులు – ఉద్యోగుల ఆరోగ్య భద్రత
ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించాల్సిన ఆరోగ్య పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల వైద్య ఖర్చులు భారంగా మారాయి.
6. GO-317, బదిలీలు, ఉపాధ్యాయ సమస్యలు
GO-317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. సాధారణ బదిలీలు, పదోన్నతులు, సేవా నియమాల అంశాల్లో స్పష్టత లేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.