కృతి సనన్ నటించిన ‘రక్షా బంధన్ యాడ్’ను ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘జివ(GIVA)’ తొలగించింది. ఈ ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడం, రాజకీయంగానూ చర్చనీయాంశం కావడంతో సదరు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
యాడ్ వివాదంపై ‘జివ’ సంస్థ వివరణ ఇచ్చింది. మాకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, పండగలపై ఎంతో గౌరవం ఉంది. రాఖీ లాంటి పండగను కుటుంబమంతా చేసుకోవాలని మేం భావించాం. అందులో భాగంగానే పెంపుడు జంతువులకు కూడా ప్రేమను పంచాలనుకున్నాం. కానీ, మా యాడ్ వల్ల సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయి. మేం ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని మరోసారి స్పష్టం చేస్తూ.. ఈ ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి తొలగిస్తున్నాం. ఈ పండగను మీ అందరూ ఎంతో ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం’’ అని ‘జివ’ ఓ నోట్ విడుదల చేసింది.
రక్షా బంధన్ నేపథ్యంలో ఇటీవల జీవ కంపెనీ ఈ యాడ్‌ను విడుదల చేయగా..ఇందులో కృతి వస్త్రధారణ, పెంపుడు శునకానికి రాఖీ కట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ యాడ్ లో కృతి సనన్.. బ్రాలెట్-స్కర్ట్, కేప్‌తో కూడిన ఇండో వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించారు. సోదరుడికి, పెంపుడు శునకానికి రాఖీ కట్టారు. అలాంటి దుస్తులు వేసుకుని రాఖీ కట్టడాన్ని తప్పుపడుతూ నటి, బీజేపీ ఎంపి కంగనా రనౌత్ మండిపడ్డారు. సంప్రదాయ భారతీయ పండగకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియదా అంటూ ప్రశ్నించారు.
ఇదే సమయంలో కృతికి రాహుల్ గాంధీ మద్దతిచ్చారు. ఆయనకు కౌంటర్ ఇస్తూ మళ్లీ కంగనా పోస్ట్ పెట్టారు. ‘పితృస్వామ్యాన్ని కూల్చివేయండి’ అన్న ఆయన పిలుపును నేరుగా ప్రస్తావిస్తూ, “బ్రో, ఆగు. భారత్ మాతా కీ జై. షురూ కర్తే హై,” అని రనౌత్ స్పందించారు. ఈ వరుస పోటాపోటీ పోస్టులతో వివాదం ముదిరిపోతుండటం..సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘జివ’ సంస్థ యాడ ను ఉప సహంరించుకోవడం గమనార్హం.