అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగతున్నాయి. ఐదు రోజుల వరుస పెరుగుదల తర్వాతా పసిడి ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేయగా, వెండి స్వల్పంగా పెరిగింది. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 1,51,970వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 1,39,300 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర సైతం రూ.100 తగ్గి రూ. 2,50,000కు చేరింది.
పుంజుకోనున్న పసిడి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల కదలికలు, అమెరికా డాలర్ బలం, ట్రెజరీ బాండ్ యీల్డ్స్‌లో మార్పులు వంటి అంశాలు దేశీయ పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ తగ్గుదల స్వల్పకాలం మాత్రమేనని భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరగడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్యణం పెరుగడం, ఫెడరల్ వడ్డీ రేట్లు వంటి పరిణామాలతో దీర్ఘకాలంలో మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అభిప్రాయపడింది.
ఐదేళ్ల క్రితం ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లు ఉండేది. కానీ ఇప్పుడు ఔన్స్ బంగారం 4,200 డాలర్లకు చేరింది. ఈ ఐదేళ్లలో పసిడి ధర 100 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అయితే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర తులానికి రూ.1,70,000 చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్ లో సుంకాల పెంపుతో దిగుమతులు తగ్గినా ధరలు మాత్రం తగ్గే అవకాశం ఉండదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోసారి వెండి పరుగులు..
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాగ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలు రానున్న రోజుల్లో మరోసారి పెరగడం ఖాయం అని చెబుతున్నారు. వెండి ధర భవిష్యత్‌లో ఔన్స్‌కు 200 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పోస్ట్ చేశారు. వెండి సరఫరా, డిమాండ్ మధ్య తేడా భారీగా పెరుగుతుందని గుర్తు చేశారు. పలు దేశాలు భారీగా వెండిని నిల్వ చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచ జనాభాలో దాదాపు 40 శాతాన్ని కలిగి ఉన్న మూడు ప్రభుత్వాలు ఒకే లోహాన్ని భారీగా నిల్వ చేస్తున్నాయని రాబర్ట్ కియోసాకి గుర్తు చేశారు.
బంగారాన్ని ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు నిల్వ చేస్తుంటే.. వెండిలో మాత్రం పారిశ్రామిక వినియోగం భారీగా ఉందని కియోసాకి గుర్తు చేశారు. స్మార్ట్‌ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, రక్షణ రంగ పరికరాలు సహా అనేక ఉత్పత్తుల్లో వెండి వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ వినియోగం కారణంగా అందుబాటులో ఉన్న సరఫరాపై ఒత్తిడి పెరుగుతోందని వివరించారు. సరఫరా పరిమితంగా ఉండటం, డిమాండ్ ఏటా పెరుగుతుండటం భవిష్యత్‌లో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.