దివంగత నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గద్దె నిర్మాణం చేపట్టారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు రాత్రి వేళ కూల్చివేశారు.
అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం భారీ సంఖ్యలో తరలివచ్చి నర్సంపేటలో ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా కూడా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో నర్సంపేటలో నిర్వహించే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారక కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.