వానల కోసం మొసలికి పూజలు.. వీడియో వైరల్!

జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాల కోసం వింతగా మొసలికి పూజలు చేయడం..ఇప్పుడు వైరల్ గా మారింది. బీచ్ పల్లి కృష్ణా పుష్కర్ ఘాట్ లోకి వచ్చిన మొసలికి ఎదురుగా కూర్చుని అనిల్ శర్మ అనే పూజారి పూజలు నిర్వహించడం..ఆ సమయంలో మొసలి మౌనంగా కదలకుండా ఉండిపోవడం అందరిని అశ్చర్యపరిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 10, 2026, 12:08 pm IST
Read Time: 4 mins
వానల కోసం మొసలికి పూజలు.. వీడియో వైరల్!

వర్షాల కోసం కప్పలు, గాడిదలకు పెళ్లిళ్లు వంటి తంతులు..బొడ్రాయికి అభిషేకాలు వంటి పూజలు చేయడం ఇప్పటిదాకా అందరికి తెలిసిందే. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాల కోసం వింతగా మొసలికి పూజలు చేయడం..ఇప్పుడు వైరల్ గా మారింది.

జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద కృష్ణానది ఒడ్డుకు ఓ మొసలి కొట్టుకొచ్చింది. మొసలి ఘాట్ లోకి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలికి ఎదురుగా కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు నిర్వహించారు. కుంకుమ, పసుపు, పుష్పాలతో దానికి అభిషేకం చేశాడు. అనిల్ శర్మ ఏమాత్రం భయాందోళన లేకుండా మొసలికి ఎదురుగా కూర్చోని చాలా సేపు పూజలు నిర్వహించడం అందరిని ఆశ్చర్యపరిచింది.

అనిల్ శర్మ పూజలు చేస్తుంటే ఆ మొసలి మౌనంగా, ప్రశాంతంగా కదలకుండా అలానే ఉండిపోయింది. ఇది నిజంగా దైవం కొలువైన ప్రదేశంలో జరిగిన మహిమాన్విత ఘటనగా కొందరు భక్తులు అభివర్ణిస్తున్నారు. మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్‌శర్మ తెలిపారు. ఏది ఏమైనా మొసలికి అంత దగ్గరగా ఉంటే అది దాడి చేసే అవకాశం ఉందని..ఇలాంటివి మంచిది కాదని వన్యప్రాణులు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పూజల అనంతరం మొసలి సమాచారాన్ని స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే పుష్కర ఘాట్ కు చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది.. మొసలిని సురక్షితంగా బంధించి.. కొంత దూరంలో నదిలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.