DGP Shivadhar Reddy | ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టులు లొంగిపోండి.. డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు

DGP Shivadhar Reddy | ఇంకా అజ్ఞాతవాసంలోనే ఉన్న సీపీఐ మావోయిస్టు నేతలు, క్యాడర్‌ హింసామార్గాన్ని వీడి, ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ డీజీపీ బీ శివధర్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు.

DGP Shivadhar Reddy | ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టులు లొంగిపోండి.. డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
DGP Shivadhar Reddy | ఇంకా అజ్ఞాతవాసంలోనే ఉన్న సీపీఐ మావోయిస్టు నేతలు, క్యాడర్‌ హింసామార్గాన్ని వీడి, ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ డీజీపీ బీ శివధర్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలోకి వచ్చి, సురక్షితమైన, గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితం గడపాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపు మేరకు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకులు, కేడర్లందరూ తిరిగి వచ్చి తమ కుటుంబ సభ్యులతో శాంతియుతమైన, సురక్షితమైన జీవితాన్ని గడపాలని కోరారు.
గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ పోలీసుల నిరంతర, సమన్వయ కృషి ఫలితంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లో వివిధ స్థాయిలకు చెందిన మొత్తం 721 మంది అజ్ఞాత మావోయిస్టు కేడర్ లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారని తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం తరఫున సమగ్ర పునరావాస పథకం కింద ఆర్థిక సహాయం సహా అన్ని రకాల ప్రయోజనాలు అందజేశామని తెలిపారు. ప్రస్తుతం వీరంతా తమ కుటుంబాలతో కలిసి తమ స్వగ్రామాల్లో శాంతియుతంగా, గౌరవప్రదంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి చెంది, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వివిధ మావోయిస్టు నిర్మాణాల్లో పనిచేస్తున్న అజ్ఞాత కేడర్‌కు కూడా ఈ విజ్ఞప్తిని చేశారు. వీరిలో:

వరుస సంఖ్య పేరు & వివరాలు 

1. ముప్పాల్ల లక్ష్మణరావు @ గణపతి, s/o గోపాలరావు, age: 72 సంవత్సరాలు, n/o బీర్పూర్ (గ్రామం & మండలం), జగిత్యాల జిల్లా.  సి.సి.ఎమ్ & పీ.బీ.ఎం.
2. పుసునూరి నరహరి @ సంతోష్, s/o సోమనారాయణ, age: 57 సంవత్సరాలు, n/o ఇంటి నంబర్ 25-2-128, సోమిడి గ్రామం, హనుమకొండ మండలం & జిల్లా. సీసీఎం, ఈఆర్బీ సభ్యుడు. ప్రస్తుతం జార్ఖండ్‌లో పనిచేస్తున్నారు.
3. వర్త శేఖర్ @ మంగ్తు, s/o late ఉదుత్తల శ్రీనివాసులు @ ఆజాద్, age: 51 సంవత్సరాలు, n/o సికింద్రాబాద్. డీకేఎస్‌జెడ్‌సిఎం, కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌చార్జ్, డీకేఎస్‌జెడ్‌సి.
4. జోడే రత్న బాయి @ సుజాత, w/o ముప్పాల్ల లక్ష్మణ్ రావు @ గణపతి, age: 68 సంవత్సరాలు, n/o భవానీపురం, బుద్ధరపుపేట గ్రామం, గద్వాల్ మండలం & జిల్లా. డీకే ఎస్‌జెడ్‌సి మెంబరు మరియు మాడ్ డీవీసీ ఇన్‌చార్జ్.
5. నక్క సుశీల @ రేలా, d/o నక్క కమల, w/o late సామల వెంకటేశ్వర్లు @ సుదర్శన్, age: 51 సంవత్సరాలు, n/o హైదరాబాద్. డీసీఎం స్థాయి, డీకేఎస్‌జెడ్‌సిలోని మావోయిస్టు విద్యా విభాగంలో పనిచేస్తున్నారు.
6. రంగబోయిన భాగ్య @ రూపి, d/o చింతమడక నర్సయ్య, w/o సుగులూరి చిన్నన్న @ విజయ్, age: 43 సంవత్సరాలు, n/o ధర్మారం గ్రామం, మిరుదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా. ఏసీఎం స్థాయి, డీకేఎస్‌జెడ్‌సిలోని మాడ్ లో డీవీసీఎం.
తెలంగాణ పోలీసుల దృష్టికి వచ్చిన మేరకు, ముప్పాల్ల లక్ష్మణ రావు @ గణపతి (CCM & PBM) వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యలు సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆయనను జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తూ, ఆయన తిరిగి వచ్చిన వెంటనే ఆయనకు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరపున  తగిన వైద్య చికిత్సను అందిస్తామని హామీ ఇస్తోంది.
07.03.2026 న అజ్ఞాతంలో ఉన్న 130 మంది సిపిఐ (మావోయిస్టు) పార్టీ కేడర్లు ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలోకి వచ్చిన సందర్భంగా జరిగిన పత్రికా సమావేశంలో, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ముప్పాల్ల లక్ష్మణ రావు @ గణపతి (CCM & PBM) జనజీవన స్రవంతిలోకి ప్రత్యేకంగా మరియు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేయడం జరిగింది.
పైన పేర్కొన్న తెలంగాణకు చెందిన మరియు అజ్ఞాతంలో ఉన్న సిపిఐ (మావోయిస్టు) కేడర్లు జనజీవన స్రవంతిలోకి వచ్చి తమ కుటుంబాలు, బంధువులను తిరిగి కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న పునరావాస అవకాశాలను వినియోగించుకోవాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వారి అనుభవం, నైపుణ్యాలను సమాజంలో సానుకూల, చట్టబద్ధ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం పట్ల విశ్వాసం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేడర్‌లో కూడా పెరిగి, చాలామంది తెలంగాణ పోలీసుల ఎదుట జన జీవన స్రవంతిలో చేరి  సమాజంలో కలిసిపోతున్నారని తెలిపారు.
సిపిఐ (మావోయిస్టు) పార్టీ లో అజ్ఞాతంలో ఉన్న అజ్ఞాత కేడర్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వారిని జన జీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించి, వారు శాంతి మార్గాన్ని ఎంచుకునేలా వారిని చైతన్యపర చాలని కోరారు.
జన జీవన స్రవంతిలో కలిసే వారందరికీ భద్రత, గౌరవం మరియు కొత్త జీవితానికి అవసరమైన అన్ని సహాయాలను అందించడంలో తెలంగాణ పోలీసులు కట్టుబడి ఉన్నారని పునరుద్ఘాటించారు. మారుతున్న కాలంలో శాంతియుత, ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, హింస మార్గాన్ని విడిచిపెట్టి రాష్ట్ర అభివృద్ధి, శాంతిలో భాగస్వాములు కావాలని సూచించారు. “ఆయుధాలు వదలండి, మీ కుటుంబాల వద్దకు తిరిగి రండి, తెలంగాణ అభివృద్ధి మరియు శాంతిలో భాగస్వాములు కండి.” అని పిలుపునిచ్చారు.