కాంగ్రెస్..ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్ గా మారింది : మోదీ ఫైర్

దేశ ప్రజల తిరస్కారంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్ గా మారిపోయిందని ప్రధాని నరంద్ర మోదీ విమర్శించారు. పశ్చిమాసియా యుద్దం కారణంగా నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు పెట్రోల్, డీజీల్, గ్యాస్, యూరియా వినియోగం తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకుండా శపథం పెట్టుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్..ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్ గా మారింది : మోదీ ఫైర్

విధాత, హైదరాబాద్ : దేశ ప్రజల తిరస్కారంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్ గా మారిపోయిందని ప్రధాని నరంద్ర మోదీ విమర్శించారు. దేశం అంతా మావోయిస్టులు అంతమైనా తెలంగాణలో ఇంకా ఉన్నారని, మావోయిస్టు రహిత తెలంగాణ కోసం బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.

ఇదే సభ నుంచి దేశ ప్రజలకు పశ్చిమాసియా యుద్దం కారణంగా నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించేందుకు పెట్రోల్, డీజీల్, గ్యాస్, యూరియా వినియోగం తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకుండా శపథం పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్ వాహనాలను, ప్రజా రవాణను వినియోగించాలని, విదేశీ మాదక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు దేశ ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఇవన్ని చేయడం ద్వారా దేశానికి ప్రజలు సేవ చేసినట్లేనన్నారు.

బెంగాల్ తరహాలో తెలంగాణలో అధికారంలోకి

పశ్చిమ బెంగాల్ లో మొట్టమొదటిసారిగా బీజేపీ సీఎం పదవి ప్రమాణ స్వీకారం చేశారని, ఒకప్పుడు దక్షిణ భారతం, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ ఉనికి లేదని, ఇప్పుడు దేశంలోని 21రాష్ట్రాలలో బీజేపీ పాలనలో ఉన్నాయన్నారు. బెంగాల్ లో నియంతృత్వ టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ సర్కార్ ను, వామపక్షాలను, కాంగ్రెస్ ను తిరస్కరించి 3సీట్లు ఉన్న బీజేపీని 200సీట్లకు పైగా గెలిపించి భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. తెలంగాణలోనూ బెంగాల్ తరహా కనిపిస్తుందని, తెలంగాణలో అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తున్నానని మోదీ చెప్పకొచ్చారు. దేశ ప్రజలు పదేపదే బీజేపీ సుపరిపాలన, అభివృదిని ఆశీర్వదిస్తూ పార్టీని గెలిపిస్తున్నారన్నారు.

కుటుంబ, అవినీతి పార్టీలను దూరం పెడుతున్న ప్రజలు

కుటుంబ పాలన వారసత్వ రాజకీయాలు కాదని, విశ్వాస రాజకీయాలను ప్రజలు నమ్ముతున్నారన్నారని మోదీ స్పష్టం చేశారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ, అవినీతి రాజకీయాలను తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మోదీ చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాల అభివృద్ధిగా బీజేపీ విశ్వసిస్తుందన్నారు. గతంలో మాకు లోక్ సభలో రెండు సీట్లు ఉంటే అందులో ఒకటి తెలంగాణ నుంచి వచ్చిందేనన్నారు. ఒకప్పుడు కార్యకర్తలు లేని బెంగాల్లో ఇప్పుడు బీజేపీ వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా అబద్దాలతో పాలన చేస్తుందని, ప్రస్తుతం దేశంలో మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారని మోదీ గుర్తు చేశారు.

తెలంగాణ అభివృద్దికి నిధులు

హైదరాబాదును అన్ని రకాలుగా కేంద్రం అభివృద్ధి చేస్తుందని, తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం అన్నారు. ఈరోజు 9400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభించుకున్నాం న్నారు. జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని, వరంగల్ లో టెక్స్ టైల్ పార్కును నిర్మిస్తున్నాం అని, రైల్వేలు, హైవే లకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం అన్నారు. టెక్స్ టైల్ పార్కుతో పత్తి రైతులకు మేలు జరుగుతుందన్నారు. పత్తి రైతుల కోసం కొత్త పథకం తెచ్చాం అన్నారు.

దేశానికి భారంగా మారిన పశ్చిమాసియా యుద్దం

పశ్చిమాసియా యుద్దం దేశానికి భారంగా మారిందని, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయని, ఇంధనం, గ్యాస్, యూరియా కొరత ఏర్పడిందని మోదీ వెల్లడించారు. కేంద్రం ఆయా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయత్నిస్తుందని, ప్రజలు కూడా తమవంతు సహకారం దేశం కోసం అందించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, రెండు నెలల నుంచి ప్రజలపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా ప్రజలు త్యాగాలకు సిద్దం కావాలన్నారు.

దేశం కోసం ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలి

యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తుందని, ధరలను పెంచడం లేదు అని, ప్రజలపై భారం వేయడం లేదు అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్దంతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించుకునేందుకు, విదేశీ మారకద్రవ్య పరిరక్షణకు ప్రజలు పెట్రోల్, డీజీల్, గ్యాస్, యూరియా వినియోగం తగ్గించుకోవాలన్నారు. రైతులు సోలార్ కరెంటు వాడాలని, రసాయానిక ఎరువుల వాడకం తగ్గించాలని కోరారు. డీజిల్ పంపుల బదులు సోలార్ పంపుల్ని వాడాలని, రైతులు సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎరువులు రసాయనాలపై అతిగా ఆధారపడవద్దు అని, ఎరువులు, రసాయనల వినియోగాన్ని సగానికి సగం తగ్గించాలని ప్రజలకు సూచించారు.

ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి..ప్రజా రవాణ వినియోగించండి

ప్రజలు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని వాడాలని, ప్రజా రవాణను వినియోగించాలని, మెట్రోలో ప్రయాణం చేయాలని కోరారు. కరోనా సమయంలో మాదిరిగా ప్రయాణాలు తగ్గించి వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ మీటింగ్, వీడియో కాన్ఫరెన్స్ లను వినియోగించాలని కోరారు. యుద్ధ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడాన్ని ప్రజలు అలవర్చుకోవాలని కోరారు.

ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకుండా శపథం తీసుకోవాలి

మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని, ఆడంబరాలకు పోవద్దు అని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని కోరారు. వంటనూనే వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా దేశానికి, ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. రాగీ కొరత తీవ్రంగా ఉందని, బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయింది అని తెలిపారు. గతంలో యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలు బంగారం దానం చేసేవారు అని గుర్తు చేశారు. ఏడాది పాటు బంగారం కొనుగోలును ప్రజలు నిలిపివేయాలని శపథం తీసుకోవాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తు ఉత్పత్తులను వినియోగం, కొనుగోలు పెంచుకోవాలని తెలిపారు.