• Telugu News
  • /Telangana

షాకింగ్ కల్తీ.. మటన్‌లో ఎద్దు మాసం మిక్సింగ్!

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హబీబ్‌నగర్‌ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్న ఉస్మాన్ ఖురేషిని ఫుడ్ సెప్టీ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా అరెస్ట్ చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 02, 2026, 2:20 pm IST
Read Time: 5 mins
షాకింగ్ కల్తీ.. మటన్‌లో ఎద్దు మాసం మిక్సింగ్!

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హబీబ్‌నగర్‌ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్న ఉస్మాన్ ఖురేషిని H-FAST అధికారులు, పోలీసులు ఉమ్మడిగా అరెస్ట్ చేశారు. మల్లెపల్లిలోని బడి మసీదు సమీపంలోని ఉస్మాన్ మీట్ షాప్‌పై దాడి చేసి 50 కేజీల కల్తీ మాంసాన్ని సీజ్ చేశారు. యజమానిపై కేసు నమోదు చేశారు.

నిందితుడు ఉస్మాన్ ఖురేషి మల్లెపల్లి ప్రాంతంలో షాపు నిర్వహిస్తూ.. తక్కువ ధరకే పెద్ద మొత్తంలో ఎద్దు మాంసం సేకరించి..దానిని మేక మాంసంలో కలిపి విక్రయిస్తున్నాడు. ఈ కల్తీ మాంసాన్ని నగరంలోని ఫేమస్ బిర్యానీ పాయింట్లు, హోటళ్లకు తక్కువ ధరకే గుట్టుచప్పుడు కాకుండా సప్లై చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. నిందితుడు నగరంలోని ఏయే హోటళ్లకు కల్తీ మాంసం సరఫరా చేస్తున్నాడన్నదానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

హైదరాబాద్ బిర్యానీ అన్నా, ఇక్కడి మటన్ వంటకాలన్నా భోజన ప్రియులు లొట్టలేసుకుని తినేవారు. కానీ, కొందరు కాసుల కక్కుర్తి పడ్డ నరరూప రాక్షసులు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తరచూ మటన్ మాంసంలో కుక్క మాంసం, ఎద్దు మాంసం కలుపుతూ, చనిపోయిన మేకలు, గొర్రెల మంసాలను హోటళ్లకు సరఫరా చేస్తున్న కల్తీ రాయుళ్ల నిర్వాకంతో బిర్యానీ అంటేనే భయపడేలా చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ హోటళ్లలో ఆహార పదార్ధాల నాణ్యతపై ప్రజల్లో తీవ్ర సందేహాలు నెలకొన్న పరిస్థితి పెరిగిపోతుంది.

కుళ్లిన చేపలు, రొయ్యల ముఠా గుట్టురట్టు

మంగళహాట్‌లోని ‘తార ఫిషరీస్’పై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు నిర్వహించిన సంయుక్త దాడులలో కుళ్లిన చేపలు, రొయ్యల హోటళ్లకు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. నలుగురిని అరెస్ట చేసిన పోలీసులు రూ.90 వేల విలువైన 262 కిలోల చేపలు, రొయ్యలు స్వాధీనం చేసుకున్నారు. 10 కిలోల సోడియం బైకార్బోనేట్ పౌడర్, 6 బస్తాల ఉప్పు సీజ్ చేశారు. రసాయనాలతో నిల్వ చేసి తాజా చేపలుగా హోటళ్లు, ఫంక్షన్లకు ఈ ముఠా సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.