భూభారతి పోర్టల్ ఉద్యోగుల ఆందోళన

భూభారతి పోర్టల్‌లో పనిచేస్తున్న 636 మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగులు తొలగింపును నిరసిస్తూ హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాల చెల్లింపును డిమాండ్ చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 04, 2026, 4:09 pm IST
Read Time: 5 mins
భూభారతి పోర్టల్ ఉద్యోగుల ఆందోళన

భూ భారతిలో ఫీల్డ్ లెవల్ టెక్నికల్ స్టాఫ్ (FTS) ఉద్యోగులుగా పనిచేస్తున్న 636మంది ఉద్యోగులు తమను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం హైద్రాబాద్ అబిడ్స్ లోని సీసీఎల్ ఏ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమను ఉద్యోగాలలో కొనసాగించాలంటూ వారు ధర్నా చేపట్టారు. భూ సమష్యాలపై నిరంతరం కృషి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గత 15నెలలుగా తమకు జీతాలు రావడం లేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమష్యాలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులు హెచ్చరించారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2020 నవంబర్ 29న ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తహశీల్దార్లకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆపరేటర్లను నియమించారు. ప్రతి తహశీల్దార్‌ కార్యాలయంలో ఒక ఆపరేటర్‌ (ఫీల్డ్‌ లెవల్‌ టెక్నికల్‌ స్టాఫ్‌)తో పాటు జిల్లా స్ధాయిలో కోఆర్డినేటర్‌ (డీసీ), ఇద్దరు సహాయ ఆపరేటర్లను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని భూభారతిగా మార్చి నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్(ఎన్ఐసీ)కి బాధ్యతలు అప్పగించారు. భూ అక్రమాల్లో చాల జిల్లాల్లో ఆపరేటర్ల పాత్ర ఉన్నట్లుగా ప్రభుత్వం విచారణలో గుర్తించింది. వారిని తొలగించి వారి స్థానంలో రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా కలెక్టరేట్‌, ఆర్‌డీవో, తహశీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్ల తొలగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వివాదం రేగింది. 2026 మార్చి నెలతో వీరి కాంట్రాక్టు గడువు ముగిసింది. మళ్లీ రెన్యువల్‌ కాకపోవడంతో పాటు ప్రభుత్వం వారిని తొలగించాలని నిర్ణయించింది. ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్ల స్థానంలో భూభారతి బాధ్యతలను రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో తాము అంతా జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆపరేటర్ల సంఖ్యను 636నుంచి 332కు కుదించే ప్రయత్నాలను విరమించుకోవాలని వారంతా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలుపుతూ వినతిపత్రాలు అందజేస్తున్నారు.