• Telugu News
  • /Telangana

హరీశ్ రావు క్షుద్ర పూజలపై ఆధారాలు ఉన్నాయి : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్ రావు తెలంగాణలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణలకు తమ వద్ద ఆధారాలున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇదే సమయంలో హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 04, 2026, 3:35 pm IST
Read Time: 4 mins
హరీశ్ రావు క్షుద్ర పూజలపై ఆధారాలు ఉన్నాయి : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో వానలు పడొద్దని, కరువు రావాలని, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు క్షుద్ర పూజలు చేయించారనడానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావు కుటుంబంతో శివమొగ్గ, తిరుచ్చి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. క్షుద్ర పూజలపై అవాస్తవం అని చెబుతున్న హరీశ్ రావు మరి అక్కడికి వెళ్లి ఏం పూజలు చేశారో ఎందుకు చెప్పలేదని మహేశ్ ప్రశ్నించారు.

తమిళనాడులోని తిరుచిరాపల్లి, శివమొగ్గ ప్రాంతాల్లో క్షుద్రపూజలు చేసే దేవాలయాలున్నాయని, అక్కడికి హరీష్ రావు జూన్ 1, మే 31, జులై 23న వెళ్లారనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అబద్ధమైతే తాము చెప్పిన తేదీల్లో హరీష్ రావు ఎక్కడున్నారో మీడియాకు చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ సమాధానం చెప్తే.. తాను, సీఎం కూడా బీఆర్ఎస్ అడిగేవాటికి సమాధానం చెప్తామన్నారు. వాస్తవాలు మాట్లాడినందుకు తమ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చినంత ఈజీగా నిజాలు చెప్పలేరన్నారు.

బీఆర్ఎస్ వాళ్లకు అఘోరాలు తాంత్రికులతో తిరగడం, క్షుద్ర పూజలు చేయడం అలవాటేనని, వాళ్లకు రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అని విమర్శించారు. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేయించారన్న ప్రచారం ఉందని, అధికారం కోల్పోయిన అసహనంతో హరీశ్ రావు అరుంధతి సినిమాలో పశుపతిలా వ్యవహరిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

అద్దంకి, సామాలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

తను తిరుచ్చి, శివమొగ్గలలో తెలంగాణలో కరువు రావాలని తాను క్షుద్ర పూజలు చేసినట్లుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మీడియా సెల్ చైర్మన్ సామా రాంమోహన్ రెడ్డిలు చేసిన ఆరోపణలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. వారి ఆరోపణలు నిరాధారమైనవని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారికి లీగల్ నోటీసులు పంపించారు. తక్షణమే వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, వీడియోలు, పోస్టులు తొలగించాలని లేనిపక్షంలో పరువు నష్టం, క్రిమినల్ చర్యలకు సంబంధించిన చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని హరీశ్ రావు తన నోటీస్ లో హెచ్చరించారు.