మూసీ పునరుజ్జీవనానికి గోదావరి నీళ్ల తరలింపుపై కీలక ఉత్తర్వులు

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాల తరలింపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్(మేడ్చల్) వరకు 3000 మి.మీ(3మీటర్ల) వ్యాసం గల రెండు ఎంఎస్ పైపులైన్లు నిర్మాణం చేసేందుకు నిర్మాణ సంస్ధ మెగా(ఎంఈఐఎల్)కు అనుమతులు జారీ చేసింది. ఒక్కో పైపులైన్ సామర్థ్యం 10టీఎంసీలుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 31, 2026, 3:31 pm IST
Read Time: 4 mins
మూసీ పునరుజ్జీవనానికి గోదావరి నీళ్ల తరలింపుపై కీలక ఉత్తర్వులు

విధాత, హైదరాబాద్ : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాల తరలింపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ – HMWSSB – గోదావరి తాగునీటి సరఫరా పథకం, దశ-II & III – మూసీ నది పునరుజ్జీవనం కోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లను నీటితో నింపేందుకు కీలక అనుమతులు ఇచ్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్(మేడ్చల్) వరకు 3000 మి.మీ(3మీటర్ల) వ్యాసం గల రెండు ఎంఎస్ పైపులైన్లు నిర్మాణం చేసేందుకు నిర్మాణ సంస్ధ మెగా(ఎంఈఐఎల్)కు అనుమతులు జారీ చేసింది. ఒక్కో పైపులైన్ సామర్థ్యం 10టీఎంసీలుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పైప్‌లైన్లు, మల్లన్న సాగర్ వద్ద పంప్ హౌస్, సబ్ స్టేషన్ నిర్మాణం,ఎలక్ట్రో-మెకానికల్ పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, మల్లన్నసాగర్ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం, అలాగే 1170 MLD సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (WTP), 40 ML సామర్థ్యం గల క్లియర్ వాటర్ రిజర్వాయర్-కమ్-పంప్‌హౌస్ పనులను చేపట్టాలని పేర్కొంది.

ఈ మొత్తం పనులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) కాంట్రాక్ట్ విధానంలో, ప్రాజెక్టు నిర్మాణంతో పాటు 10 సంవత్సరాల పాటు నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలతో చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఆయా పనులను రాబోయే రెండు సంవత్సరాల్లో (2027 నాటికి) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

20 టీఎంసీల నీటిలో 17.5 టీఎంసీలను హైదరాబాద్ మహానగర భవిష్యత్తు (2027 – 2047) తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తారు. గోదావరి నది నుండి తరలించే నీటిలో 2.5 టీఎంసీల (TMC) నీటిని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్‌లలోకి క్రమంగా విడుదల చేస్తారు. అక్కడ నుండి మూసీ నదిలోకి నీటిని వదిలి, నదిలో ఏడాది పొడవునా స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా (Perennial flow) చర్యలు తీసుకుంటారు. ఘన్ పూర్ , శామీర్‌పేట ప్రాంతాలలో రోజుకు 1,170 మిలియన్ లీటర్ల (MLD) సామర్థ్యం గల భారీ నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తారు. గోదావరి స్వచ్ఛమైన నీటితో పాటు, నగరంలోని మురుగునీరు మూసీలో కలవకుండా చూసేందుకు కొత్తగా మరో 39 మురుగునీటి శుద్ధి కేంద్రాలను (STPs) నిర్మించనున్నారు.