విధాత, హైదరాబాద్ : ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లుగా టీపీసీసీ అధ్యక్షులు బీ. మహేశ్ కుమార్ గౌడ్ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. ప్రజాపాలనలో 1000 రోజులు ఓ మైలురాయి వంటిదని, 1000 రోజుల పండుగలో విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేశామని, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
రైతు సంక్షేమానికి రూ.1.75లక్షల కోట్ల ఖర్చు..
ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ.. 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తి చేశామని, రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచాం అని, ధాన్యం కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేశామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసి రికార్డు సృష్టించాం అని, రూ.20 వేల కోట్లకు పైగా రుణమాఫీతో 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చామన్నారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించాం అని, ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.30 వేల కోట్లు ఖర్చు, సన్నవడ్ల బోనస్‌కు దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయింపు, రైతుబీమాకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశాం అని గుర్తు చేశారు.
పేదల సంక్షేమానికి ప్రాధాన్యత..
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించామని, రూ.500కే ఎల్పీజీ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు పథకం అందించామని గుర్తు చేశారు. పేదల ఆశలు నెరవేర్చే దిశగా 16.32 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ చేశామని, 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులతో 3.43 కోట్ల మందికి ప్రయోజనం అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నామని, మహిళా సాధికారికత సాధనలో పురోగమించామని పేర్కొన్నారు.
70వేలకు పైగా ఉద్యోగాలు..
తెలంగాణ యువతలో విశ్వాసం కలిగించేలా 70 వేలకు పైగా ప్రభుత్వ నియామకాలు చేపట్టామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నాం అని, పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం ప్రారంభించామని, 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చూట్టామని తెలిపారు. దావోస్, ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు, ఉపాధి కల్పన అవకాశాలు పెంచామని అన్నారు.
బీసీ కులగణనతో సామాజిక న్యాయానికి పెద్దపీట
బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాం అని, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయడం విప్లవాత్మక చర్య అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, బలహీనవర్గాలను ప్రభుత్వ విధానాలకు కేంద్ర బిందువుగా మార్చాం అని, రాహుల్ గాంధీ సామాజిక న్యాయ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వచ్చే రోజుల్లో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రజాదరణ పొందే విధంగా ప్రజా సంక్షేమం, అభివృద్ది కోసం పాటుపడుతామని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలిపారు.
ప్రజల ఆశీర్వాదంతో….
ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి— టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
ప్రజాపాలనలో 1000 రోజులు ఓ మైలురాయి
1000 రోజుల పండుగలో విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు… pic.twitter.com/38q8hmYMf1
— Congress for Telangana (@Congress4TS) August 31, 2026