తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు చత్తీస్‌గఢ్‌కు చెందిన 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 34 ఆయుధాలు సమర్పించి పునరావాసానికి ముందుకొచ్చారు.

తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు చత్తీస్ గఢ్ కు చెందిన 47మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీఎల్జీఏ బెటాలియాన్ చివరి కమాండర్ హేమ్లా సైతం లొంగిపోయారు. చత్తీస్ గఢ్ బెటాలియన్ 1కు చెందిన మావోయిస్టులు పూర్తిగా లొంగిపోగా..వారు 34 ఆయుధాలను సరెండర్ చేశారు. వాటిలో AK-47, ఎస్ఎల్ఆర్ వంటి అత్యాధునిక తుపాకులు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “హింస ద్వారా ఏదీ సాధించలేమని మావోయిస్టులు గుర్తించాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తాం. ఇంకా అడవుల్లో ఉన్నవారు తక్షణమే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి” అని పిలుపునిచ్చారు.

పార్టీలో తెలంగాణ నుంచి మిగిలింది నలుగురే

2026 సంవత్సరంలో ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 260 మంది అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉండి తెలంగాణ వెలుపల పార్టీలో కొనసాగుతున్నారని తెలిపారు. ఆ నలుగురు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ లో కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

లొంగిపోకపోతే ఎన్ కౌంటర్లే

ఇటీవల జార్ఖండ్‌ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో సహదేవ్ మహతో అలియాస్ అనుజ్, నతాషా, బుధన్ కర్మాలి (ఏరియా కమాండర్),రంజిత్ గంజూ (ఏరియా కమాండర్)లు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఈ నెల 12న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో పార్దాపూర్ ఏరియా కమాండర్ రూపి అలియాస్ భాగ్య మరణించింది. 20ఏళ్ల పాటు పార్టీలో కొనసాగిన ఆమె స్వస్థలం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం. మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి భార్యగా గుర్తింపు పొందిన ఆమెపై ప్రభుత్వం 25 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. గత ఏడాది మాన్పూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె భర్త విజయ్ రెడ్డి మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్లతో లొంగిపోకపోతే ఎన్ కౌంటర్లు తప్పవన్న సందేశాన్ని భద్రతాధికారులు ఇచ్చినట్లయ్యింది.

ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల లొంగుబాటుకు ఇచ్చిన గడువు మార్చి 31తో ముగిసిపోయినప్పటికి ప్రభుత్వాలు మిగిలిపోయిన మావోయిస్టుల లొంగుబాటు కోసం ప్రయత్నిస్తున్నాయి. లొంగుబాట్లను ప్రోత్సహించే దిశగానే తమ చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. మిగిలిపోయిన మావోయిస్టులు అంతా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిస్తున్నారు.

ఈ ఏడాది తెలంగాణలో ఫిబ్రవరిలో మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న సైతం లొంగిపోయారు. ఈ నెల రెండో వారంలో దాదాపు 30 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయారు. తాజాగా చత్తీస్ గఢ్ కు చెందిన మరో 47మంది లొంగిపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి :

ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఆందోళనలను రాజేస్తున్న ఈవీ బస్సుల వ్యవహారం
Simran | 21 ఏళ్ల‌కే సిమ్రాన్ చెల్లెలు క‌న్నుమూత‌… ఆమె మరణం వెనుక దాగి ఉన్న మిస్ట‌రీ ఏంటి?