ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఆందోళనలను రాజేస్తున్న ఈవీ బస్సుల వ్యవహారం
ఆర్టీసీ సమ్మెలో అత్యంత కీలక అంశంగా ఉన్నది.. ప్రైవేటీకరణ. ఇప్పటికే ఆర్టీసీలో సుమారు 500 ఈవీ బస్సులను ప్రవేశపెట్టారు. వీటికి ఎదురు చార్జీలు చెల్లించడంతోపాటు.. వాటి రీచార్జింగ్ పాయింట్లు, కరెంటు కోసం సబ్‌స్టేషన్, డిపోల్లో భూమి వినియోగం.. ఇవన్నీ ఆర్టీసీ కల్పిస్తే.. ప్రైవేటు ఆపరేటర్లు కేంద్రం ఇచ్చే సబ్సిడీలను కూడా జేబులో వేసుకుంటున్నారు. ఇది ముదిరితే రానున్న రోజుల్లో సంస్థ ప్రైవేటీకరణకు గురవడం తథ్యమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
(హిమన్య, రిసెర్చ్ స్కాలర్)
తీవ్ర ఉద్రిక్తతలకు, ఆత్మహత్యాయత్నాలకు.. ఒక బలిదానానికి కారణమైన ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం దిగిరావడంతో ఎట్టకేలకు పరిష్కారమైంది. శనివారం అర్ధరాత్రి నుంచే బస్సులు రోడ్లెక్కాయి. సిబ్బంది యథావిధిగా విధులకు హాజరవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఈ సమ్మెలో రెండో కోణం కూడా ఉంది. అదేంటో వివరంగా చూద్దాం.
మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయికి వెళ్లే దిశలో చోటు చేసుకున్న ఆత్మాహుతి, ఆత్మహత్యాయత్నాలు.. సమ్మెను ఉద్రిక్తంగా మార్చాయి. వేతన సవరణ అంశం పరిష్కారానికి నోచుకోకపోవడం, కొత్త నియామకాలు లేకపోవడం, పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు, ఉద్యోగ భద్రతపై బలమైన హామీ వంటి అంశాలను కార్మికులు చాలాకాలంగా అడుగుతున్నారు. గత ఒకటి, ఒకటిన్నరేళ్లలో కార్మికుల్లో నైరాశ్యం గూడుకట్టుకుంటూ వచ్చింది. అది సమ్మెగా మారింది. 2500 కోట్లకుపైగా బకాయిలను చెల్లించలేదని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు.. సిబ్బంది చాలా తక్కువ ఉండటం, ఫలితంగా కార్మికులపై పడుతున్న అదనపు భారం.. ఉన్న ఉద్యోగుల పని పరిస్థితులను మరింత దయనీయంగా మార్చుతున్నని చెబుతున్నారు.
అన్నింటికంటే మించి.. ప్రైవేట్ ఆపరేటింగ్ మోడల్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవస్థ కింద.. ప్రైవేటు కంపెనీలు ఈవీ బస్సులను ఆర్టీసీకి సరఫరా చేస్తాయి. అద్దె ఒప్పందాల ప్రాతిపదికన వాటిని అవే నడుపుతాయి. ఇటువంటివి సుమారు 500 వరకూ తెలంగాణలో ఇప్పటికే ఉన్నాయి. వాటికి కిలోమీటరుకు 40 నుంచి 60 రూపాయల వరకూ చెల్లిస్తున్నారు. ఈ వివాదంలో మరో అంశం.. కేంద్ర ప్రభుత్వ నిధులు. క్లీన్ మొబిలిటీ యాక్టివిటీస్ కింద ప్రతి ఈవీ బస్సుకు సుమారు 36 లక్షల రూపాయల సబ్సిడీ లభిస్తుంది. ఈ సొమ్ము ఆర్టీసీ సొంత బస్సులను పెంచుకునేందుకు, ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ఉపయోగించడం కాకుండా.. ప్రైవేటు కంపెనీలకు చెల్లిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వ నిధులను క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులకు మారేందుకు ఉపయోగించుకోవాల్సి ఉండగా.. దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను ప్రైవేటు ఆపరేటర్లకు మళ్లిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో వివిధ డిపోల వద్ద చార్జింగ్ స్టేషన్స్, సబ్‌స్టేషన్స్, మెయిటనెన్స్ వంటివాటికి ఆర్టీసీ తన సొంత నిధుల నుంచి పది నుంచి 12 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది.
ఈవీ బస్సుల ఆపరేషన్లకు వీలుగా తెలంగాణలోని 96 డిపోలలో ఈ ఏర్పాట్లు చేశారు. ఈ సదుపాయాలను, డిపోలను వినియోగించుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు కనీసం అద్దెలు కూడా ఆర్టీసీకి చెల్లించడం లేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇది ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యాపారులకు ధారాదత్తం చేయడమేనని మండిపడుతున్నాయి.
ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాదని, ప్రజారవాణా వ్యవస్థ నిర్వహణలోనే ఒక పెద్ద మార్పు దిశగా పరిణామాలు సాగుతున్నాయి. ఈ ప్రస్తుత వ్యవస్థ.. ఆర్టీసీ ఆపరేషనల్ కంట్రోల్‌ను తగ్గించి.. ప్రైవేటు కంపెనీలపై ఆధారపడటాన్ని పెంచుతుందని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఇది ఒక క్రమపద్ధతిలో ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీని తీసుకుపోవడమేనని చెబుతున్నాయి.
ఈవీ బస్సుల వాడకం అనేది ఆధునీకరణలో ఒక భాగమని, పర్యావరణ సమతుల్యం కోసం తీసుకున్న చర్యలని ప్రభుత్వం చెబుతున్న అంశంతో కార్మిక సంఘాలు ఏకీభవించడం లేదు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు, ప్రైవేటు కాంట్రాక్టులు, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్.. ఇవన్నీ చూస్తే ఆందోళన కలుగుతున్నదనేది కార్మిక సంఘాల భావన.
ఆర్టీసీలో ఉన్న అనేక మంది ప్రస్తుత వ్యవస్థ పరోక్ష ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నదని చెబుతున్నారు. సంస్కరణలని చెప్పి, ఆధునీకరణ పేరు తగిలించినా, ఈ విధానం.. ప్రైవేటు సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, మౌలిక వసతులు, పనిప్రదేశాల్లోని ఉద్యోగ సమస్యల భారం మాత్రం ఆర్టీసీపై పడుతున్నట్టు కనిపిస్తున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram