కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుంది : ఎంపీ ఈటల రాజేందర్

ఆర్టీసీ సమ్మెపై ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని హెచ్చరిస్తూ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుంది : ఎంపీ ఈటల రాజేందర్

విధాత, హైదరాబాద్ : ఆనాటి ఆర్టీసీ కార్మికుల చావులే కేసీఆర్ పాలనను బొంద పెట్టాయని, ఇప్పుడు అదే దారిలో వెళ్తున్న రేవంత్ రెడ్డి కూడా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె అంశంపై ఈటల మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులు చావులు వృధా పోవని, వారికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అండ, పేద ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్నారు. కేసీఆర్ సతాయించినట్లుగానే రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీ కార్మికులను సతాయిస్తూ వారిని చావుల పాలు చేస్తున్నాడని మండిపడ్డారు.

ఎర్రటి ఎండల్లో 12గంటల్లో డ్యూటీ చేస్తున్నారని, వారి జీవితాలతో ఆడుకోకుండా నీవు కార్మికులతో చర్చించి సమ్మెను పరిష్కరించాలని, ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ మాదిరిగా నీవు చేస్తే ఆయనకు పట్టిన గతే నీకు పడుతుందంటూ రేవంత్ రెడ్డిని ఈటల హెచ్చరించారు. ఆర్టీసిని నిర్వీర్యం చేసే కుట్రలను ఇకనైనా మానుకుని ఆర్టీసి కార్మికులతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దని.. ఆత్మహత్యలు వద్దు అని, పోరాటాలతో సమస్యలు పరిష్కరించుకుందాం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

ఆమె 2.06మీటర్లు..ఆయన 1.62మీటర్లు!
తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి