తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తెలంగాణ బీజేపీ కార్యాలయానికి రావడంతో రాజకీయంగా కలకలం రేగింది. త్వరలో చేరికపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి సందడి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి బీజేపీ రాష్ట్ర పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అయ్యారు. త్వరలో తమ విద్యాసంస్థలో నిర్వహించనున్న లక్ష మందితో వందేమాతరం ఆలాపన కార్యక్రమంపై ఆమె చర్చించినట్లుగా సమాచారం.

ఇటీవలే మల్లారెడ్డి, ప్రీతిరెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం రెండు రోజుల క్రితం రామచందర్‌రావుతో ఆమె భేటీ అయ్యారు. త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే పలు యూ ట్యూబ్ చానెళ్లలో ప్రీతిరెడ్డి తను భవిష్యత్తులో బీజేపీలో చేరవచ్చని, మల్కాజ్ గిరి లేదా మరోచోటి నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే.

త్వరలో జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్ల ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ప్రీతిరెడ్డి చేరిక బీజేపీకి కలిసివస్తుందని కమలనాథులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి విద్యాసంస్థల నిర్వాహకురాలిగా, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా సోషల్ మీడియాలో ప్రీతిరెడ్డికి మంచి క్రేజ్ నెలకొంది. ప్రీతిరెడ్డి చేరికతో పాటు మల్లారెడ్డి కుటుంబం భాగస్వామ్యంతో బీజేపీకి రాజకీయంగా జంటనగరాల్లో బలం పెరుగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏఐ యూనివర్సీటీ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించాం: ప్రీతిరెడ్డి

బీజేపీ కార్యాలయానికి రావడం వెనుక రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రీతిరెడ్డి తెలిపారు. మల్లారెడ్డి విద్యాసంస్ధలో ఏర్పాటు చేసిన ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించడానికి ఇటీవల ఢిల్లీలో మోదీని కలిశామని తెలిపారు.మోదీ పర్యటన ఖరారు కోసం చర్చించేందుకు బీజేపీ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ఇందులో రాజకీయం ఏం లేదన్నారు. నేను విద్యావేత్తను అని, రాజకీయ నేతను కాదని, తాను డిజిటల్ విద్యను ప్రమోట్ చేస్తున్నానని, అందులో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు కాంగ్రెస్ నాయకులను కూడా కలుస్తానని తెలిపారు. ఇటీవల మంత్రి డి.శ్రీధర్ బాబును కూడా కలిశానని గుర్తు చేశారు. ప్రస్తుతం తమ కుటుంబం బీఆర్ఎస్ లోనే ఉందని, ఇక మీదట కూడా ఉంటుందని తెలిపారు. ఏఐ డీజిటల్ యూనివర్సిటీ ప్రారంభం రాష్ట్రానికి గర్వకారణం అని, ఒకేసారి ఈ సందర్బంగా లక్ష మందితో వందేమాతరం గీతాలాపన కూడా ఉంటుందని తెలిపారు. అయితే మోదీ పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదన్నారు. మహిళా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి :

సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు..హెక్టార్ కు 1.80లక్షల ఆదాయం
ఎండలు బాబోయ్ ఎండలు…జూ పార్కుల్లో వన్యప్రాణుల విలవిల