విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ కు ఎలా వస్తావో చూస్తాం…నీ నాలుక కోస్తాం అంటూ తెలంగాణ నాయకులు సాగిస్తున్న బెదిరింపులకు నేను భయపడే వాడిని కాదని..ఇక నుంచి తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంధ్రవాళ్లు రావద్దని, జనసేన పోటీ చేయవద్దంటూ చెప్పడానికి తెలంగాణ నాయకులు ఎవరని, నాయకులు వేరు, ప్రజలు వేరు అని, ప్రజల మధ్య విద్వేషాలు లేవని, వేర్పాటు వాదంతో నాయకులే రాజకీయాలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా వస్తే తన్ని తరిమేస్తామని టీఎంసీ నాయకులు బెదిరిస్తే..ఆ పార్టీనే ప్రజలు తరిమేశారని గుర్తు చేశారు. జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికలు సహా 2029ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించారు. అవసరమైతే నేనే స్వయంగా తెలంగాణలో పర్యటిస్తానని, గొడవలు పెట్టేందుకు తాను రానని, సమస్యలపై పోరాటానికి మాత్రమే వస్తానన్నారు. తెలంగాణ భారత్ దేశంలో అంతర్భాగం అని, ఇక మీదట ప్రతి సమస్యపై మాట్లాడుతానన్నారు. ఆరు గ్యారంటీలు, నిరుద్యోగంపైన, అన్యాయాలపైన ప్రశ్నిస్తాం అన్నారు.
తెలంగాణకు, ప్రజలకు నేను వ్యతిరేకం కాదని, గతంలో నేను తెలంగాణ సమస్యలపై పోరాటం చేశానని, యురేనియం వ్యతిరేకంగా ఉద్యమించానని గుర్తు చేశారు. నేను కేవలం తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరును మాత్రమే వ్యతిరేకించానని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో లేవని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయని, నేను వైఎస్ బెదిరింపులకే భయపడలేదని, పార్టీ పెట్టి పోరాటం చేశానని పేర్కొన్నారు.గద్దర్ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారని, జూబ్లీహిల్స్ లో ఉన్న ఆఫీస్ కి వచ్చి గద్దర్ కారు కొనివ్వాలని అడిగితే రెండు రోజుల్లో కారు కొనిచ్చానని, మీరు ఆయనకు ఏం చేశారు అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం, గౌరవం ఉందని, నేను చెరువును కబ్జా చేశాను అంటున్నారని, అదే నిజమైతే ఈ క్షణమే ప్రభుత్వానికి రాసిస్తానని పవన్ ప్రకటించారు. నా స్థలంలో గోశాల ఉందని, అక్కడికి వెళ్లి ఏదో వీడియోలు తీసి చెరువు ఆక్రమించారంటూ నిందలు వేస్తున్నారని పవన్ ఆరోపించారు.
నేను తెలంగాణలో మార్పు తప్ప అధికారం కోరుకోవడం లేదు అని, హైదరాబాదులో ఎలా అడుగు పెడతా అంటున్నారని, మీరు ఎవరు నన్ను బెదిరించడానికి అని, తెలంగాణ మీ అయ్య జాగీరా.. తెలంగాణ కంటే ఏపీలోనే బెదిరింపులు ఎక్కువని పవన్ చెప్పుకొచ్చారు. బాంచన్ అని, భయపడే వాళ్ళం అయితే పార్టీ పెడతామా? అని, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరినైనా ఒక మాట అన్నానా? అని పవన్ అన్నారు. నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు అని, నన్ను ఎన్ని తిట్టినా పట్టించుకోనని, తెలంగాణలో ఉపాధి లేకపోతే నేను కారణమా? మద్రాసులో ఉన్న చిత్ర పరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చింది? మర్రి చెన్నారెడ్డి సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చారని,ఆంధ్రావాళ్లను తిడుతుంటే వాళ్ళు ఇక్కడేలా ఉంటారు అని ప్రశ్నించారు. సడన్ గా మీరు ఇక్కడికిరావద్దు అంటే ఎలా అని నిలదీశారు. దాడులు మాకు కొత్త కాదు..వైఎస్ హాయంలోనే అవన్నీ చూసాం అని, ఏపీలో నా తల తీసేయడానికి చాల మంది రెడీగా ఉన్నారని, నీవు ఎలా వస్తావో చూస్తా అంటూ బెదిరిస్తున్నారని, అందుకే నా ఇంటి ముందే ప్రెస్ మీట్ పెట్టానన్నారు.
నాకు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ తెలియదు అని నాది హ్యూమన్ వింగ్అని, తెలంగాణ పట్ల కమిట్మెంట్ లేకపోతే కొండగట్టుకు రూ.30కోట్ల టీడీపీ నిధులు ఎందుకు ఇస్తానని పవన్ ప్రశ్నించారు. యురేనియం మైనింగ్ వకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఆరోజు జనసేనకు ఓట్లు వస్తాయని చేశానా అని, తెలంగాణ యువత మీద నమ్మకంతో ప్రేమతో ఆ రోజు పోరాడటం జరిగిందని తెలిపారు. మాట్లాడితే ఆంధ్రా ఆంధ్రా అంటున్నారు.. అది నాకు నచ్చడం లేదు అని, తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదు.నిజంగా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రజలు ఒక్కరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కాదు అన్నారు. నాపై వ్యతిరేకంగా కొనసాగుతున్న బెదిరింపుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉన్నారని అనుకోవడం లేదన్నారు.
కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెడితే స్వాగతించానని, కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలలో పోటీ చేయవచ్చుగాని మేం పోటీ చేయవద్దా అని, మీరు అన్ని రాష్ట్రాలు తిరగవచ్చు మేము ఇక్కడికి రాకూడదా అని పవన్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తామనే భయంతోనే మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారని, ఇక మేము బెదరేది లేదన్నారు. కొంత మంది కాంగ్రెస్ నాయకులు పవన్ కల్యాణ్ కు తెలంగాణలో ఏం పని అంటున్నారని, రాహుల్, ప్రియాంకలు కేరళంలో పోటీ చేయవచ్చు, ఇందిరాగాంధీ మెదక్ లో, పీవీ నరసింహరావు ఏపీలో పోటీ చేయలేదా అని గుర్తు చేశారు. భారతదేశం ఇది ఏమైనా.. పాకిస్తాన్, పాలస్తీననా… రాజ్యాంగపరంగా నాకు నాదేశంలో తిరిగే స్వేచ్చ లేదా అని అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆంధ్ర వాడికి ఏం పని అంటున్నారని, ఆంధ్ర కాంట్రాక్టర్లు మీకు ఓకేనా? ఇక్కడ
ఎవరిని మీరు ఫుల్ చేస్తున్నారు అని, ఇలా నాయకులు, అధికారులు, బిజినెస్ లు, కాంట్రాక్టులు బాగానే చేసుకుంటున్నారని, ప్రజలకు ఎందుకు హద్దులు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం అని, రాజ్యాంగ పరంగా అందరం అన్ని చోట్ల తిరిగే హక్కు ఉంటుందన్నారు. ఆంధ్ర వాళ్లంటూ తిడితే దశాబ్దంపైగా 12 ఏళ్లు సహించాం భరించాం అని ఇకపై ప్రశ్నిస్తాం అని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు ఎమ్మెల్యేలయ్యారు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారని మరి దానికేం చెబుతారని ప్రశ్నించారు. నేను అభిమానించిన పాశం యాదగిరి వంటి వారు నన్ను తిట్టడం బాధాకరం అని,
మేము టాక్స్ కడుతున్నాం అని, నేల విడిచి పారిపోలేము అని, దమ్ముంటే పవన్ తెలంగాణ రావద్దని అసెంబ్లీలో తీర్మానం చేయండని సవాల్ చేశారు. తెలంగాణ సమాజం నుంచే జనసేన సిద్దాంతాలు పుట్టాయని, నన్ను బెదిరించిన కాంగ్రెస్ నాయకుల విషయమై రాహుల్ గాంధీ స్పందించాలని, ఏ రాష్ట్రానికి వెళ్లిన పాస్ పోర్టులు తీసుకుని రావాలా అంటూ పవన్ మండిపడ్డారు.
తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం, సీపీఎం గురించి ఎందుకు మాట్లాడటం లేదని, నేను చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీని పెట్టాను అని, తెలంగాణలో చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని పవన్ ఆరోపించారు. పహల్గామ్ లో కాల్పులు జరిపిన వారిని, పాకిస్తాన్ ను ప్రేమించే కాంగ్రెస్ ఇది అని, పార్టీల వెనుకు, ప్రాంతాల వెనుక, సోషల్ మీడియా వెనుక దాక్కుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో విబేధాలు రెచ్చగొడుతున్నవారిపై దృష్టి పెట్టాలని, ప్రాంతీయవాదం ముదిరితే దేశ ఐక్యతను దెబ్బతీస్తుందని, కొన్నాళ్లు పోతే వందేమాతరం పాడమంటారు అని పవన్ విమర్శించారు. బెంగాలీలో ఉన్న జనగణమన పాడుతున్నాం అని, అది మన భారతదేశం భాష అన్న భావనతో అంతా పాడుతున్నామని, అదే స్ఫూర్తి కొనసాగాలని కోరుకుంటామన్నారు. ఎవరి విగ్రహాలు పెట్టాలో అక్కడి ప్రజల ఇష్టమని, తెలంగాణ ఆంధ్రలను కలిపే హైవేకు బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలన్నారు.