తెలంగాణలో జన సేన పార్టీ కొత్త ఆఫీస్ రె‘ఢీ’ !

హైదరాబాద్ మణికొండలో జనసేన కొత్త కార్యాలయం ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ కల్యాణ్ కీలక అడుగులు వేస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Jun 19, 2026, 1:42 pm IST
Read Time: 3 mins
తెలంగాణలో జన సేన పార్టీ కొత్త ఆఫీస్ రె‘ఢీ’ !

జనసేన పార్టీ చాన్నాళ్లకు మళ్లీ తెలంగాణ గడ్డపై తన క్రియాశీలక రాజకీయ కార్యకలాపాలను ఉదృతం చేస్తుంది. ఇటీవల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తెలంగాణలో ఏం పని అంటూ తెలంగాణ వాదులు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య సాగిన పరస్పర విమర్శలు, సవాళ్ల పర్వం నేపథ్యంలో తెలంగాణలో జనసేన పార్టీ మళ్లీ క్రీయాశీలకం అవుతుండటం గమనార్హం. అదికూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేన కార్యకలాపాల విస్తరణ ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణలో జనసేన నూతన ప్రస్థానంలో భాగంగా హైదరాబాద్ మణికొండలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో జనసేన ముఖ్య నేతలు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలు సహా భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై పుట్టిన జనసేన ఈ ప్రాంత ప్రజల సమస్యలపై పోరాడుతుందని పవన్ పేర్కొన్నారు. ఈ పరిణామాల క్రమంలో ముఖ్యంగా పవన్ అభిమాన గణం, సెటిలర్లు గణనీయంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీకి సన్నాహకంగా జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని భాగంగా చూడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.