గోవా మార్క్… ఏపీ బీచ్‌ల‌లోనూ ఇక‌పై బార్లు

గోవా తరహాలో ఏపీ బీచ్‌లలో బీచ్ షాక్స్, బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విశాఖ, సూర్యలంకలో పైలట్ ప్రాజెక్టుగా బీర్, వైన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Jun 18, 2026, 3:40 pm IST
Read Time: 5 mins
గోవా మార్క్… ఏపీ బీచ్‌ల‌లోనూ ఇక‌పై బార్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరప్రాంత పర్యాటకాన్ని, ఉపాధిని పెంచే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీచ్‌ల‌లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. విశాఖపట్నం, సూర్యలంకలలో పైలట్ ప్రాజెక్ట్‌గా తక్కువ ఆల్కహాల్ పానీయాల విక్రయానికి అనుమతిచ్చింది. బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ 362 జీవో ఇచ్చింది. 12 తీర ప్రాంత జిల్లాల్లో ఏపీటీడీసీ గుర్తించిన చోట్ల బీచ్ షాక్స్ ఏర్పాటుకు విధివిధానాలు ప్రకటించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఎంపిక చేసిన బీచ్ లలో బీచ్ షాక్స్ మద్యం అమ్మకాలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2029 ఆగస్టు 31వ తేదీ వరకు ఈ విధానం కింద బీచ్ షాక్స్ ఏర్పాటునకు నోటిఫికేషన్ జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖ బీచ్ ల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అనుమతి ఉన్న స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు వీటిని ఏర్పాటు చేసేందుకు లైసెన్స్​లు మంజూరు చేస్తారు.

ఏపీకి ఉన్న 975 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరాన్ని పర్యాటకంగా వాడుకునేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం.. బీచ్ ల్యాండ్స్‌లో పర్యావరణ హితమైన తాత్కాలిక సామగ్రితో మాత్రమే ఈ షాక్స్ నిర్మించాలి. ఈ పాలసీలో పర్యావరణానికి ఇబ్బంది లేని తాత్కాలిక కట్టడాలతో, పరిమిత వేళల్లో తక్కువ ఆల్కహాల్ ఉండే పానీయాలను విక్రయించేందుకు వీలుగా జీవో నెంబర్ 363ని జారీ చేశారు. ఎలాంటి సిమెంట్, కాంక్రీట్ కట్టడాలకు అనుమతి లేదు. పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో రెండేసి చొప్పున బార్ లైసెన్సులు ఇవ్వనున్నారు. అయితే, బీచ్‌లలో మద్యం లభ్యతతో భద్రతా ప్రమాదాలు పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కఠిన నిబంధనలతో అనుమతులు

ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను జీవోలో పొందుపరిచింది. బీచ్ షాక్స్‌లో ఘాటు మద్యం (IMFL/విదేశీ మద్యం) అమ్మడానికి వీల్లేదు. కేవలం ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే బీర్, వైన్, రెడీ-టు- డ్రింక్ (RTD) పానీయాలు మాత్రమే విక్రయించాలి. అలాగే, మద్యం సరఫరాను ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకే పరిమితం చేశారు. కస్టమర్లు మద్యం బాటిళ్లను బయటకు తీసుకెళ్లకూడదని, షాక్ పరిధిలోని డెక్ బెడ్లు, అంబ్రెల్లాల లోపలే వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ లైసెన్సుల కోసం కేవలం స్టార్ హోటళ్లు, టూరిజం రిసార్టులు లేదా టూరిజం శాఖ రిజిస్టర్డ్ సంస్థలు మాత్రమే అర్హులు. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇవి ఉండాలి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) క్లియరెన్స్, ఫైర్ సేఫ్టీ, FSSAI అనుమతులు తప్పనిసరి. ఈ లైసెన్స్ కోసం ఏడాదికి రూ. 7,50,000 రిటైల్ ఎక్సైజ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లైసెన్సులు 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి.