అదిలాబాద్ కాంగ్రెస్ లో అలజడి..!

ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ అలజడి నెలకొంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివాసీల హక్కుల కోసం ప్రభుత్వానికే హెచ్చరికలు చేయగా, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై అవినీతి ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 04, 2026, 5:11 pm IST
Read Time: 9 mins
అదిలాబాద్ కాంగ్రెస్ లో అలజడి..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అనూహ్య అలజడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఒకరు ఆదివాసీల హక్కుల రక్షణ పేరుతో ప్రభుత్వం తీరును ప్రశ్నించగా..మరో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాత్రం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుండటం హాట్ టాపిక్ గా మారింది. ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జన్నారంలో అటవీ అధికారుల తీరుపై తిరుగుబాటు ప్రకటించడం కలకలం రేపింది.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి ప్రాంతం వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఆదివాసీ యువకులను కొట్టిన అటవీ శాఖ అధికారులపై 24 గంటల్లో చర్య తీసుకోకుంటే ప్రభుత్వానికే వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమం చేస్తానని ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆదివాసీలపై చేయి చేసుకున్న ఇంధన్ పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తపాలాపూర్, ఉడుంపూర్, ఖానాపూర్ రేంజ్ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన వెడ్మ బొజ్జు అటవీశాఖ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఖానాపూర్ నియోజకవర్గంలోనే ఒక వ్యతిరేక సామ్రాజ్యం ఏర్పాటు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఆదివాసీ యువకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జరిగిన రాస్తారోకోలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం గమనార్హం.

ఆదివాసీల రాజ్యం కోసం పోరాటం

అటవీశాఖ అధికారులు ఆదివాసీల పట్ల తమ అణిచివేత వైఖరి మార్చుకోకపోతే కవ్వాల్ టైగర్ జోన్ ప్రారంభమైన జన్నారం నుంచే అటవీశాఖకు వ్యతిరేక ఉద్యమానికి పునాది వేస్తామని వెడ్మ బొజ్జు హెచ్చరించారు. అడవిలోకి ప్రజలను రానివ్వని అధికారులు… రెవెన్యూ భూముల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను కూడా తీసుకురాలేని పరిస్థితి ఏర్పడిందని వెడ్మబొజ్జు పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వానికి వ్యతిరేక సామ్రాజ్యం ఏర్పాటు చేయడంతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, ఉద్యమాన్ని ఖానాపూర్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని, ఆదివాసీల రాజ్యం తీసుకొస్తానని హెచ్చరించారు.

దిగొచ్చిన సర్కార్..ఇందన్ పల్లి ఎఫ్ ఆర్ వో సస్పండ్

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు డిమాండ్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. ఆదివాసీలపై చేయి చేసుకున్న ఇంధన్ పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఈ విషయమై ఆదివాసులు ఇక సంయనం పాటించాలంటూ ఎమ్మెల్యే బొజ్జు విజ్ఞప్తి చేశారు.

ప్రేమ్ సాగర్ రావుపై సంచలనం రేపుతున్న అవినీతి ఆరోపణలు

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణలు ఆ జిల్లాలో సంచలనంగా మారాయి. ప్రేమ్ సాగర్ రావు కుటుంబానికి చెందిన వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆరేళ్లలో 11కంపెనీల పేరిట 9 బ్యాంకుల నుంచి రూ. 470 కోట్ల అప్పులు తీసుకున్నాయని, అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఆ సంస్థలను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు బయటపెట్టారు. ఎన్సీఎల్టీలో కేసులు కూడా నడవడంతో పదేళ్ల పాటు వారికి నోటీసులు కూడా జారీ కాబడ్డాయని, అయితే 2023లో గెలవగానే ప్రేమ్ సాగర్ రావు రూ. 450 కోట్ల అప్పు క్లియర్ చేశారని, గెలిచిన రెండున్నరేళ్ల లోపునే రూ. 450 కోట్లకుపైగా అప్పులను ఆయన ఎలా చెల్లించారంటూ ప్రశ్నిస్తున్నారు. మార్చి 24న బంజారాహిల్స్ నికో బ్రాంచ్ లో ఒక్క రోజునే రూ.120కోట్లు ఒకేసారి చెల్లించి ఎన్ వోసీ పొందారని, ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఓ ప్రైవేట్ హోటల్ పేరిట ఉన్న రూ.87కోట్ల అప్పును కూడా క్లియర్ చేశారని ఆరోపిస్తున్నారు.

ప్రేమ్ సాగర్ రావు అఫిడవిట్ ప్రకారం 2018లో రూ. 26 కోట్లు.. 2023లో రూ. 54 కోట్ల ఆస్తులు ఉన్నాయని, 2023లో ఎమ్మెల్యేగా గెలిచాక అన్ని వందల కోట్ల అప్పులు ఎలా చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా ప్రేమ్ సాగర్ రావు యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ, ఇసుక దందా, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యేపై దాదాపు 40కి పైగా క్రిమినల్ కేసులు.. అందులో భూకబ్జాలు, బెదిరింపులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కాప్రా భూకబ్జాలో ఎమ్మెల్యే పేరు వినిపించిందని.. బాధితులు గాంధీభవన్‌ను ముట్టడించారని గుర్తు చేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రూ. 500 కోట్ల అక్రమాలు జరిగాయని, భూసేకరణ కోసం దళితులను బెదిరించి, బలవంతంగా ఎకరా రూ. 13 లక్షలకే భూములు లాక్కుని ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ప్రేమ్ సాగర్ రావుపై గతంలో ఆరోపణలు ఉన్నాయని వారు వెల్లడిస్తున్నారు. పూర్తయిన పనులకు కూడా మళ్లీ టెండర్లు పిలిచి ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారని ప్రత్యర్థులు ఆరోపించారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్వతంత్ర శైలీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయ్యింది. ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్ రాజకీయాల్లో కలకలం రేపింది.