అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాలతో హెచ్చుతగ్గులకు గురవుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,44,220కి పడిపోగా..22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.1,32,200 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 100 తగ్గి రూ. 2,34,900వద్ద కొనసాగుతుంది.
కొనుగోలు కొనసాగించవచ్చు..
బంగారం, వెండి వంటి లోహాల కొనుగోలుకు ప్రస్తుత ధరలను సానుకూలంగా చూడవచ్చని రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయత, ప్రముఖ ఆర్థిక నిపుణుడు కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి ఒక్క రాత్రిలో ధనవంతులను చేసే పెట్టుబడులు కాదని, ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించే ఫైనాన్షియల్ లైఫ్‌బోట్లు అని తెలిపారు. పరిస్థితులు మరింత క్లిష్టం అయ్యే వరకు వేచి చూడకుండా, చిన్న మొత్తంతో అయినా వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలోని బంగారం కొనుగోలు చేసి నిజమైన సంపదను కూడబెట్టడం ప్రారంభించాలని సూచించారు.
ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గిస్తుందని తెలిపారు. అధిక కరెన్సీ ముద్రణ ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తుందని.. అలాంటి సమయంలో బంగారం, వెండి కొనుగోలు శక్తిని రక్షించే సాధనాలుగా పనిచేస్తాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం బంగారం ఫిజికల్ గానే కాదు.. డిజిటల్ గా కూడా కొనుగోలు చేసే అవకాశం సైతం ఉందన్నారు.
భారత్ భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో కేంద్రం బంగారం దిగుమతిపై సుంకాలను భారీగా పెంచింది. 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పసిడి కొనుగోలుదారులకు కీలక హెచ్చరికలు చేసింది. అధిక సుంకాల కారణంగా ఇండియాలోకి అక్రమ మార్గాల్లో బంగారం రావడం గణనీయంగా పెరిగిందని వివరించింది. దీంతో దేశీయంగా బిల్లు లేకుండా బంగారం ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని వివరించింది. స్మగ్లింగ్ బంగారంతో నాణ్యతలో మోసం జరుగవచ్చని..అలాంటి పసిడి కొనుగోలు చేయకుండా కొనుగోలుదారులు జాగ్రత్త పడాలని సూచించింది.