• Telugu News
  • /Telangana

తెలంగాణలో 10వ తేదీ వరకు సర్ గడువు పెంపు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ఎన్యూమరేషన్‌ ఫారాల దాఖలు గడువును ఆగస్టు 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. నిర్ణీత గడువులోగా ఫారాలు పూర్తిచేసి, ఓటర్లు సంబంధిత బీఎల్‌వోలకు అప్పగించాల్సి ఉంటుంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 01, 2026, 12:08 pm IST
Read Time: 3 mins
తెలంగాణలో 10వ తేదీ వరకు సర్ గడువు పెంపు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ఎన్యూమరేషన్‌ ఫారాల దాఖలు గడువును ఆగస్టు 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. నిర్ణీత గడువులోగా ఫారాలు పూర్తిచేసి, ఓటర్లు సంబంధిత బీఎల్‌వోలకు అప్పగించాల్సి ఉంటుంది. సర్‌ ప్రక్రియలో భాగంగా తొలుత జులై 24 వరకు గడువు ఇచ్చింది. అనంతరం ఆగస్టు 3 వరకు పొడిగించగా, తాజాగా మరోసారి ఈనెల 10వరకు గడువు పొడిగించినట్లుగా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. అప్పటివరకు ఎన్యూమరేషన్ దరఖాస్తులు తిరిగి ఇవ్వొచ్చని తెలిపారు.

ఓటర్ల ఫారాల డిజిలైజేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆగస్టు 17న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించనుంది. దీనిపై సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించి.. అక్టోబరు 15 నాటికి వాటిని పరిష్కరించనుంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 19న కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించనుంది.

77.12శాతం డిజిటలైజేషన్ పూర్తి…

రాష్ట్రంలో 3.3 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరందరికీ నూరు శాతం ఇప్పటికే ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్‌వోలు పంపిణీ చేశారు. వాటిని పూర్తిచేసి ఆయా ఓటర్లు బీఎల్‌వోలకు అందిస్తున్నారు. తీసుకున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు డిజిలైజేషన్‌ చేస్తున్నారు. దరఖాస్తు ఫారాల్లోని వివరాలను నమోదు చేయడంతోపాటు 2002 జాబితాలోని ఓటర్ల వివరాల ఆధారంగా యాప్‌లో పొందుపరుస్తున్నారు. శుక్రవారం నాటికి 2.60 కోట్ల మంది ఓటర్ల (77.12 శాతం) వివరాల డిజిటలైజేషన్‌ పూర్తయింది. హైదరాబాద్‌లో 56.31%, రంగారెడ్డి జిల్లాలో 63.43%, మేడ్చల్‌లో 61.37% డిజిలైజేషన్‌ పూర్తిచేశారు. ఈ మూడు ప్రధాన జిల్లాల్లో ఇంకా గణనీయమైన సంఖ్యలో ఫారాలు అందాల్సి ఉండడమే గడువు పొడిగింపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది.